శతకం సాధించిన స్మృతి (PC: BCCI)
న్యూజిలాండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. వైట్ ఫెర్న్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించింది.
మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వుమెన్ టీమ్ భారత్‌కు వచ్చింది. తొలి వన్డేలో బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన.. రెండో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.
రాణించిన బ్రూక్ హాలీడే
ఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ఇరుజట్లు మూడో వన్డేలో పోటీపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్ సుజీ బేట్స్(4), వన్‌డౌన్ బ్యాటర్ లారెన్ డౌన్(1) విఫలం కాగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లెమ్మర్ 39 రన్స్ చేసింది.
దీప్తి శర్మకు మూడు వికెట్లు
కెప్టెన్ సోఫీ డివైన్(9) నిరాశపరచగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్రూక్ హాలీడే 96 బంతుల్లో 86 రన్స్‌తో అదరగొట్టింది. మిగతా వాళ్లలో ఇసబెల్లా గేజ్(25), లీ తుహుము(24 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.
ఈ క్రమంలో 49.5 ఓవర్లలో న్యూజిలాండ్ 232 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు కూల్చగా.. రేణుకా సింగ్, సైమా ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ల ద్వారా వచ్చినవే.
సెంచరీతో చెలరేగిన స్మృతి
ఇక వైట్ ఫెర్న్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (12)ను కివీస్ పేసర్ హన్నా రోవ్ అవుట్ చేసింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా(35)తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరు బోర్డును ముందుకు నడిపించింది.
గత రెండు మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన(5, 0) ఆమె ఈసారి మాత్రం బ్యాట్ ఝులిపించింది. మొత్తంగా 122 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సరిగ్గా వంద పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి.
హర్మన్ అర్ధ శతకం
ఇక కెప్టెన్ హర్మన్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. స్మృతి మంధానతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఫోర్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసింది.
ఇక జెమీమా రోడ్రిగ్స్ సైతం ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసింది. ఈ క్రమంలో 44.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే స్కోర్లు
👉న్యూజిలాండ్- 232 (49.5)
👉భారత్- 236/4 (44.2)
👉ఫలితం- న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం
చదవండి: Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?
That HUNDRED Feeling 💯🤗
Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 2024
3rd ODI ✅
Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏
Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe— BCCI Women (@BCCIWomen) October 29, 2024
Comments
Please login to add a commentAdd a comment