ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో విజయం కోహ్లిసేన వైపే మొగ్గుచూపింది. దీంతో విండీస్ పర్యటనను కోహ్లి సేన విజయంతో ఆరంభించింది. విండీస్ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి భారత్ పూర్తి చేసింది. ఛేదనలో రోహిత్ శర్మ(24), విరాట్ కోహ్లి(19), మనీష్ పాండే(19)లు పర్వాలేదనిపించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ తీవ్రంగా కష్టపడింది. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(1), రిషభ్ పంత్ (గోల్డెన్ డక్)లు ఘోరంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, సునీల్ నరైన్, కీమో పాల్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా యువ బౌలర్ నవదీప్ సైనీ(3/17) విండీస్ బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టించాడు. సైనీతో పాటు మిగతా బౌలర్లు తలో చేయి వేయడంతో విండీస్‌ను కట్టడి చేశారు. విండీస్ ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్(49; 49 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. నికోలస్ పూరన్(20) ఫర్వాలేదనిపించాడు. దీంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు. విండీస్ పతనాన్ని శాసించిన నవదీప్ సైనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment