సొంతగడ్డపై టి20ల్లో 110 పరుగుల విజయలక్ష్యం అంటే విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టుకు మంచినీళ్ల ప్రాయంలా అనిపించడం సహజం. కానీ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో వాస్తవంలోకి వచ్చేసరికి విజయం అంత సులభంగా ఏమీ దక్కలేదు. విండీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక సగం బ్యాట్స్‌మెన్ డగౌట్ చేరిన తర్వాత 107 బంతులు ఆడితే గానీ గెలుపు దరి చేరలేదు. ఐపీఎల్‌లో సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో దినేశ్ కార్తీక్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆపసోపాలు పడుతూనే భారత్ విజయంతో మ్యాచ్‌ను ముగించింది. అంతకుముందు కుల్దీప్ యాదవ్, తొలి మ్యాచ్ ఆడుతున్న కృనాల్ పాండ్యా స్పిన్ దెబ్బకు విలవిల్లాడిన విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
కోల్‌కతా: టి20 సిరీస్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అలెన్ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ (3/13), కృనాల్ పాండ్యా (1/15) ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం భారత్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ముందుండి జట్టును విజయం దిశగా నడిపించాడు. మూడు టి20ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రేపు లక్నోలో రెండో మ్యాచ్ జరుగుతుంది.
టపటపా...
వరుసగా 3 ఓవర్లలో 3 వికెట్లు... కొంత విరామం తర్వాత వరుసగా మరో 2 ఓవర్లలో 2 వికెట్లు... సగం ఓవర్లకే సగం మంది డగౌట్‌కు...ఇదీ తొలి టి20లో వెస్టిండీస్ ఆటతీరు. భారత స్పిన్నర్ల ద్వయం పూర్తిగా కట్టి పడేయడంతో పరుగులు చేయలేక గుడ్డిగా షాట్లు ఆడబోయి ఆ జట్టు వరుసగా వికెట్లు సమర్పించుకుంది. తమ టి20 చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. తమకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో కూడా వరల్డ్ చాంపియన్ రాత మారలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఉమేశ్ వేసిన తొలి ఓవర్లో హోప్ (14) రెండు ఫోర్లు కొట్టడంతో విండీస్ ఇన్నింగ్స్ జోరుగానే ప్రారంభమైనా ఆ తర్వాత వేగంగా పతనం సాగింది. ఉమేశ్ తర్వాతి ఓవర్లో రామ్‌దిన్ (2) వెనుదిరగ్గా... ఆ వెంటనే హెట్‌మైర్‌తో సమన్వయ లోపంతో హోప్ రనౌటయ్యాడు. రాహుల్ విసిరిన త్రో కీపర్ పైనుంచి వెళ్లిపోయినా మనీశ్ పాండే దానిని చక్కగా అందుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ అవతలి ఎండ్‌కు చేరడంతో సునాయాసంగా రనౌట్ చేసేశాడు. తర్వాతి ఓవర్లో హెట్‌మైర్ (10)ను బుమ్రా ఔట్ చేశాడు. కృనాల్ తొలి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన పొలార్డ్ (14) అతని తర్వాతి ఓవర్లోనే పాండేకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కుల్దీప్ మ్యాజిక్ మొదలైంది. అతని తన వరుస మూడు ఓవర్లలో బ్రావో (5), పావెల్ (4), బ్రాత్‌వైట్ (4) ఆట కట్టించాడు. 6 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అలెన్ మరికొన్ని పరుగులు జోడించగా... ఉమేశ్ వేసిన 19వ ఓవర్లో మూడు ఫోర్లు రావడంతో విండీస్ స్కోరు 100 పరుగులు దాటింది. ఈ మ్యాచ్‌లో విండీస్ తరఫున ముగ్గురు ఆటగాళ్లు అలెన్, పియర్, థామస్ టి20ల్లో అరంగేట్రం చేశారు.
థామస్ జోరు...
స్వల్ప లక్ష్యమే అయినా భారత్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విండీస్ పేసర్ ఒషాన్ థామస్ దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతులు బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రోహిత్ (6)ను ఔట్ చేసిన థామస్...తర్వాతి ఓవర్లో అద్భుత బంతితో ధావన్ (3)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. రిషభ్ పంత్ (1) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అరుదుగా దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపించిన రాహుల్ (22 బంతుల్లో 16; 2 ఫోర్లు) భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగడంతో భారత్ 45 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ దశలో కార్తీక్, మనీశ్ పాండే (24 బంతుల్లో 19; 2 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. పొలార్డ్ ఓవర్లో కార్తీక్ మూడు ఫోర్లు కొట్టడం విశేషం. వీరిద్దరు ఐదో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. గెలుపునకు చేరువైన దశలో పియర్ అద్భుత రిటర్న్ క్యాచ్‌తో మనీశ్ పాండే ఔటయ్యాడు. అయితే తొలి మ్యాచ్ ఆడుతున్న కృనాల్ పాండ్యా (9 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) దూకుడు ప్రదర్శిస్తూ కార్తీక్‌తో కలిసి మ్యాచ్‌ను ముగించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 17 బంతుల్లో అభేద్యంగా 27 పరుగులు జత చేశారు.
కృనాల్‌కు అవకాశం
తొలి టి20 మ్యాచ్‌లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇప్పటికే ఆడిన 6 వన్డేల్లో 11 వికెట్లు తీసి ఆకట్టుకున్న లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్‌కు ఇది తొలి టి20 మ్యాచ్ కాగా... బౌలింగ్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు తొలిసారి భారత్ తరఫున ఆడే అవకాశం దక్కింది. తన లెఫ్టార్మ్ స్పిన్, దూకుడైన బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లో ఆకట్టుకున్న 27 ఏళ్ల కృనాల్‌కు తమ్ముడు హార్దిక్ అరంగేట్రం చేసిన దాదాపు మూడేళ్ల తర్వాత తొలి మ్యాచ్ దక్కడం విశేషం. గత మూడు ఐపీఎల్‌లలో కనీసం 500కు పైగా పరుగులు 25కు పైగా వికెట్లు తీసిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడైన కృనాల్‌కు 2017 ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ను గెలిపించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడంతో ప్రత్యేక గుర్తింపు దక్కింది. భారత్ తరఫున టి20లు ఆడిన 77, 78వ ఆటగాళ్లుగా (అక్షర క్రమంలో) ఖలీల్, కృనాల్ గుర్తింపు పొందారు. అజీర్తి కారణంగా భువనేశ్వర్ చివరి నిమిషంలో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో ఉమేశ్‌కు అవకాశం కల్పించారు. మరోవైపు పంత్‌కు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకే ధోని టి20ల నుంచి తప్పుకున్నాడంటూ కోహ్లి స్వయంగా చెప్పాడు. కానీ ఈ మ్యాచ్‌లో ధోని లేకపోయినా మరోసారి పంత్ ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. దినేశ్ కార్తీక్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: షై హోప్ (రనౌట్) 14; రామ్‌దిన్ (సి) కార్తీక్ (బి) ఉమేశ్ 2; హెట్‌మైర్ (సి) కార్తీక్ (బి) బుమ్రా 10; పొలార్డ్ (సి) మనీశ్ పాండే (బి) కృనాల్ పాండ్యా 14; డారెన్ బ్రేవో (సి) ధావన్ (బి) కుల్దీప్ 5; రావ్‌మన్ పావెల్ (సి) కార్తీక్ (బి) కుల్దీప్ 4; బ్రాత్‌వైట్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 4; అలెన్ (సి) ఉమేశ్ (బి) ఖలీల్ అహ్మద్ 27; కీమో పాల్ (నాటౌట్) 15; పియర్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 109.
వికెట్ల పతనం: 1–16; 2–22; 3–28; 4–47; 5–49; 6–56; 7–63; 8–87.
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4–0–36–1; ఖలీల్ 4–1–16–1; బుమ్రా 4–0–27–1; కృనాల్ పాండ్యా 4–0–15–1; కుల్దీప్ 4–0–13–3.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రామ్‌దిన్ (బి) థామస్ 6; ధావన్ (బి) థామస్ 3; రాహుల్ (సి) బ్రేవో (బి) బ్రాత్‌వైట్ 16; పంత్ (సి) బ్రావో (బి) బ్రాత్‌వైట్ 1; మనీశ్ పాండే (సి అండ్ బి) పియర్ 19; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 31; కృనాల్ పాండ్యా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 110.
వికెట్ల పతనం: 1–7; 2–16; 3–35; 4–45; 5–83.
బౌలింగ్: థామస్ 4–0–21–2; కీమో పాల్ 3.5–0–30–0; కార్లోస్ బ్రాత్‌వైట్ 4–1–11–2; పియర్ 4–0–16–1; కీరన్ పొలార్డ్ 1–0–12–0; అలెన్ 1–0–11–0.
గంట మోగించిన అజహర్
భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఆదివారం తొలి టి20 మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో గంట మోగించాడు. లార్డ్స్ తరహాలోనే ఈ ప్రతిష్టాత్మక మైదానంలో రెండేళ్ల క్రితం భారత్, న్యూజిలాండ్ టెస్టు సందర్భంగా గంటను ఏర్పాటు చేసి మ్యాచ్‌కు ముందు దానిని మోగించడం సంప్రదాయంగా మార్చారు. హైదరాబాదీ అజహర్‌కు ఈడెన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఇక్కడే ఆడి సెంచరీ చేసిన అజహర్ ఆ తర్వాత ఆడిన మరో 6 టెస్టుల్లో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీని (74 బంతుల్లో) అజహర్ 1996లో దక్షిణాఫ్రికాపై ఈడెన్‌లోనే నమోదు చేశాడు. 1993లో ఇదే వేదికపై అతని కెప్టెన్సీలో భారత్ వన్డే టోర్నీ ‘హీరో కప్’ నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment