హాంకాంగ్: ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్‌లో చివరి రోజు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్స్ సత్తా చాటుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్ బాలుర 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం... మెడ్లే రిలేలో స్వర్ణం సాధించాడు. వరంగల్ జిల్లాకు చెందిన జీవంజి దీప్తి బాలికల 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో కాంస్యం... మెడ్లే రిలేలో రజతం సొంతం చేసుకుంది. 200 మీటర్ల రేసులో షణ్ముగ శ్రీనివాస్ 21.87 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని సంపాదించాడు. వివేక్ కరణ్ (100 మీటర్లు), షణ్ముగ శ్రీనివాస్ (200 మీటర్లు), శశికాంత్ (300 మీటర్లు), అబ్దుల్ రజాక్ (400 మీటర్లు)లతో కూడిన భారత బృందం మెడ్లే రిలేను ఒక నిమిషం 54.04 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు దీప్తి 200 మీటర్ల రేసును 24.78 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని పొందింది.
భారత్‌కే చెందిన అవంతిక 24.20 సెకన్లలో రేసును ముగించి రజతం దక్కించుకుంది. దీప్తి (100 మీటర్లు), అవంతిక (200 మీటర్లు), సాండ్రా (300 మీటర్లు), ప్రియా మోహన్ (400 మీటర్లు)లతో కూడిన భారత బృందం 2 నిమిషాల 10.87 సెకన్లలో పూర్తి చేసి రజతం కైవసం చేసుకుంది. పోటీల చివరి రోజు భారత్‌కే చెందిన అమన్ దీప్ సింగ్ ధలివాల్ (షాట్‌పుట్–19.08 మీటర్లు), మథేశ్ బాబు (800 మీటర్లు–1ని:51.48 సెకన్లు), అమిత్ జాంగిర్ (3000 మీటర్లు–8ని:36.34 సెకన్లు) రజత పతకాలు గెలిచారు. బాలికల 800 మీటర్లలో పూజ (2ని:09.32 సెకన్లు) రజతం, 1500 మీటర్లలో చాంతిని చంద్రన్ (4ని:36.09 సెకన్లు) కాంస్యం, బాలుర 1500 మీటర్లలో సుమీత్ ఖరబ్ (1ని:55.81 సెకన్లు) కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ 8 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. చైనా 12 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 31 పతకాలు గెలిచి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment