Asian Indoor Athletics Championship
-
Asian Indoor Athletics Championships 2023: ‘రికార్డు’తో మెరిసిన జ్యోతి
అస్తానా (కజకిస్తాన్): కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లో గొప్ప విజయం సాధించింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి మహిళల 60 మీటర్ల హర్డిల్స్ విభాగంలో రజత పతకం గెల్చుకుంది. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతి ఫైనల్ రేసును 8.13 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జ్యోతి ఈ విభాగంలో మళ్లీ కొత్త జాతీయ రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది 60 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డును నెలకొల్పడం ఇది ఐదోసారి కావడం విశేషం. శనివారం జరిగిన హీట్స్‌లో జ్యోతి 8.16 సెకన్లతో జాతీయ రికార్డు సృష్టించగా... రోజు వ్యవధిలోనే తన పేరిటే ఉన్న రికార్డును ఆమె సవరించడం విశేషం. ఫైనల్లో మాసుమి ఆకో (జపాన్; 8.01 సెకన్లు) అందరికంటే వేగంగా లక్ష్యాన్ని దాటి స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చెన్ జియామిన్ (చైనా; 8.15 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్ లో భారత్ ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తాజా ప్రదర్శనతో జ్యోతి 19 ఏళ్ల ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో 60 మీటర్ల హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. 2008లో దోహా ఆతిథ్యమిచ్చిన ఆసియా ఈవెంట్లో భారత్‌కే చెందిన లీలావతి వీరప్పన్ 9.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. జ్యోతి రజతం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. -
Asian Indoor Athletics Championship: జ్యోతి మళ్లీ జాతీయ రికార్డు
అస్తానా (కజకిస్తాన్): భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ ఈ ఏడాది నాలుగోసారి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం 60 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో విశాఖపట్నం అమ్మాయి జ్యోతి 8.16 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో గతవారం 8.17 సెకన్లతో ఫ్రాన్స్‌లో జరిగిన మీట్లో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. -
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నీకి జ్యోతి
ఈనెల 10 నుంచి 12 వరకు కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగే ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీకి చోటు లభించింది. విశాఖపట్టణానికి చెందిన జ్యోతి 60 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్స్‌లో పోటీపడుతుంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అథ్లెటిక్స్ మీట్లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించింది. -
మెరిసిన శ్రీనివాస్, దీప్తి
హాంకాంగ్: ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్స్ సత్తా చాటుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్ బాలుర 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం... మెడ్లే రిలేలో స్వర్ణం సాధించాడు. వరంగల్ జిల్లాకు చెందిన జీవంజి దీప్తి బాలికల 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో కాంస్యం... మెడ్లే రిలేలో రజతం సొంతం చేసుకుంది. 200 మీటర్ల రేసులో షణ్ముగ శ్రీనివాస్ 21.87 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని సంపాదించాడు. వివేక్ కరణ్ (100 మీటర్లు), షణ్ముగ శ్రీనివాస్ (200 మీటర్లు), శశికాంత్ (300 మీటర్లు), అబ్దుల్ రజాక్ (400 మీటర్లు)లతో కూడిన భారత బృందం మెడ్లే రిలేను ఒక నిమిషం 54.04 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు దీప్తి 200 మీటర్ల రేసును 24.78 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని పొందింది. భారత్‌కే చెందిన అవంతిక 24.20 సెకన్లలో రేసును ముగించి రజతం దక్కించుకుంది. దీప్తి (100 మీటర్లు), అవంతిక (200 మీటర్లు), సాండ్రా (300 మీటర్లు), ప్రియా మోహన్ (400 మీటర్లు)లతో కూడిన భారత బృందం 2 నిమిషాల 10.87 సెకన్లలో పూర్తి చేసి రజతం కైవసం చేసుకుంది. పోటీల చివరి రోజు భారత్‌కే చెందిన అమన్ దీప్ సింగ్ ధలివాల్ (షాట్‌పుట్–19.08 మీటర్లు), మథేశ్ బాబు (800 మీటర్లు–1ని:51.48 సెకన్లు), అమిత్ జాంగిర్ (3000 మీటర్లు–8ని:36.34 సెకన్లు) రజత పతకాలు గెలిచారు. బాలికల 800 మీటర్లలో పూజ (2ని:09.32 సెకన్లు) రజతం, 1500 మీటర్లలో చాంతిని చంద్రన్ (4ని:36.09 సెకన్లు) కాంస్యం, బాలుర 1500 మీటర్లలో సుమీత్ ఖరబ్ (1ని:55.81 సెకన్లు) కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ 8 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. చైనా 12 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 31 పతకాలు గెలిచి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. -
దాసన్‌కు కాంస్యం
టెహ్రాన్: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో భారత్‌కు రెండో పతకం లభించింది. పురుషుల 60 మీటర్ల రేసులో ఎలాకియా దాసన్ కాంస్య పతకాన్ని సాధించాడు. అతను 6.67 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో దాసన్... 6.87 సెకన్లతో సమీర్ మోన్ పేరిట ఉన్న భారత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే దాసన్ ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ అర్హత ప్రమాణాన్ని (6.63 సెకన్లు) అధిగమించడంలో సఫలం కాలేకపోయాడు. -
ప్రేమ్ కుమార్‌కు రజతం
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్లో కుమారవెల్ ప్రేమ్ కుమార్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రేమ్ కుమార్ 7.92 మీటర్ల దూరం దూకి తన ఖాతాలో రజత పతకాన్ని వేసుకున్నాడు. జాంగ్ యావోగువాంగ్ (చైనా-7.99 మీటర్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల షాట్‌పుట్‌లో ఓంప్రకాశ్ కర్హానా ఇనుప గుండును 18.77 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలు లభించాయి. -
రంజిత్, మయూఖాలకు రజతాలు
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి రజత పతకం సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో ఈ కేరళ అథ్లెట్ 16.16 మీటర్ల దూరం గెంతాడు. కజకిస్తాన్ అథ్లెట్ 16.69 మీటర్ల దూరం గెంతి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో భారత్‌కే చెందిన మయూఖా జానీ రజత పతకాన్ని నెగ్గింది. ఆమె 14 మీటర్ల దూరం గెంతి రెండో స్థానంలో నిలిచింది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్ విభాగంలో భారత అథ్లెట్ గాయత్రి గోవిందరాజ్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల పెంటాథ్లాన్ ఈవెంట్లో రెండో స్థానం సంపాదించిన స్వప్నా బర్మన్పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. పెంటాథ్లాన్ ఈవెంట్లో భాగమైన 800 మీటర్ల రేసు సందర్భంగా స్వప్న తన లైన్లో కాకుండా వేరే లైన్లో పరిగెత్తిందని ఇరాన్ అథ్లెట్ ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ చేసిన తర్వాత అది నిజమని తేలడంతో నిర్వాహకులు స్వప్న ఫలితాన్ని రద్దు చేశారు. ఇప్పటివరకు ఈ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. -
మయూఖా జానీకి స్వర్ణం
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల లాంగ్‌జంప్‌లో మయూఖా జానీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మయూఖా 6.35 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తద్వారా ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. మహిళల 60 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్, 1500 మీటర్ల రేసులో సుగంధ కుమారి కాంస్యాలు నెగ్గారు. -
ద్యుతీ చంద్ రికార్డు
దోహా (ఖతార్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఒడిషాకు చెందిన ద్యుతీ 60 మీటర్ల విభాగంలో ఈ రికార్డు సృష్టించింది. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్లో ద్యుతీ 7.28 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో 7.81 సెకన్లతో అర్జిన ఖాతూన్ (భారత్) పేరిట ఉన్న జాతీయ రికార్డును ద్యుతీ సవరించింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ పొందుతున్న ద్యుతీ తన టైమింగ్‌తో చాంపియన్‌షిప్ రికార్డును కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డు 7.33 సెకన్లతో విక్టోరియా (కజక్‌స్తాన్) పేరిట ఉండేది.