‘వార్’ వన్‌సైడ్ | India won T20 match against west indies team | Sakshi
Sakshi News home page

‘వార్’ వన్‌సైడ్

Published Mon, Mar 24 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

‘వార్’ వన్‌సైడ్

‘వార్’ వన్‌సైడ్

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
 స్పిన్నర్ల మాయాజాలం
 కదంతొక్కిన కోహ్లి, రోహిత్
 
 ప్రత్యర్థి డిఫెండింగ్ చాంపియన్... అందరూ భారీ హిట్టర్‌లే... ముఖ్యంగా క్రిస్ గేల్ ఉన్నాడు... కాబట్టి భారత్ కష్టపడాలి, జాగ్రత్తగా ఆడాలి... ఇదీ టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు పరిస్థితి. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి కరీబియన్ క్రికెటర్లు భారత్‌కు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ధోని సేన ‘వార్’ వన్‌సైడ్ చేసేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది.
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని అందించిన భారత బౌలర్లు... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తిరుగులేని ప్రదర్శనతో అదరగొట్టారు. భారీ హిట్టర్లున్న వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టిపడేసి సెమీస్‌కు చేరువయ్యారు. బౌలర్ల కష్టానికి ఫలితం దక్కేలా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడటంతో... షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగిన సూపర్-10 గ్రూప్ ‘2’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది.
 
 టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా... వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 129 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (33 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు), సిమ్మన్స్ (22 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లు ఆరంభం నుంచి 19వ ఓవర్‌దాకా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 21 పరుగులు రావడంతో వెస్టిండీస్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు, అమిత్ మిశ్రా రెండు వికెట్లు, అశ్విన్ ఒక్క వికెట్ తీశారు.
 
 భారత జట్టు 19.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ విఫలమైనా... రోహిత్ శర్మ (55 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (41 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్సర్) బాధ్యతగా ఆడి అర్ధసెంచరీలు చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 13.5 ఓవర్లలో 106 పరుగులు జోడించారు. కోహ్లి అవుటయ్యాక... యువరాజ్ (19 బంతుల్లో 10; 1 ఫోర్) క్రీజులో నిలబడేందుకు ఇబ్బందిపడ్డా... రోహిత్‌కు అండగా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో శామ్యూల్స్, రస్సెల్, బద్రీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ ప్రస్తుతం నాలుగు పాయింట్లకు చేరింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం, నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటం వల్ల ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ధోని సేన సెమీస్‌కు చేరే అవకశాలు మెండుగా ఉన్నాయి.
 
 భువనేశ్వర్ ‘స్వింగ్’
 తొలి మూడు ఓవర్లు భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. షమీ బౌలింగ్‌లో గేల్ ఒక్క పరుగు కూడా చేయకముందే ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను ఫస్ట్ స్లిప్‌లో అశ్విన్ వదిలేశాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న గేల్... షమీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచాడు. పవర్‌ప్లేలో భువనేశ్వర్ అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ (3-0-3-0)తో వెస్టిండీస్ ఆరు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే చేసింది.
 
 మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన గేల్... అదే ఊపులో తర్వాతి బంతికి (19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద) ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను యువరాజ్ వదిలేశాడు. 8వ ఓవర్లో అశ్విన్ తన బౌలింగ్‌లో తానే క్యాచ్ అందుకుని డ్వేన్ స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి రెండు ఓవర్లు రైనా, అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో... 10 ఓవర్లకు వెస్టిండీస్ వికెట్ నష్టానికి 46 పరుగులు మాత్రమే చేసింది.
 
 10 నుంచి 15 ఓవర్ల వరకు భారత బౌలర్లు హవా కొనసాగించారు. 13వ ఓవర్లో గేల్ రనౌట్ కావడంతో భారత శిబిరంలో ఉత్సాహం పెరిగింది. 15వ ఓవర్లో మిశ్రా వరుసగా రెండు బంతుల్లో శామ్యూల్స్, బ్రేవోలను అవుట్ చేశాడు. దీంతో 15 ఓవర్లకు వెస్టిండీస్ 4 వికెట్లకు 76 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
 వేగంగా ఆడే ప్రయత్నం చేసిన స్యామీ... 18వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇదే  ఓవర్లో ఆఖరి బంతికి సిమ్మన్స్ కూడా అవుటైనా... అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. చివర్లో చకచకా వికెట్లు పడ్డా... జడేజా వేసిన ఆఖరి ఓవర్లో 21 పరుగులు వచ్చాయి.
 
 సూపర్ భాగస్వామ్యం
 ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బద్రీ బౌలింగ్‌లో ధావన్ ఎల్బీ కావడంతో భారత్‌కు షాక్ తగిలింది. కోహ్లి ఎదురుదాడికి దిగి బౌండరీలు బాది భారత్‌పై ఒత్తిడి పెరగకుండా చూశాడు. కుదురుకున్నాక రోహిత్ కూడా బ్యాట్ ఝళిపించడంతో... పవర్ ప్లే 6 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది.
 
 కోహ్లి, రోహిత్ ఇద్దరూ సమయోచితంగా ఆడారు. లక్ష్యం చిన్నదే కావడంతో ఏ మాత్రం తొందరపాటు లేకుండా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ చెత్త బంతుల్ని మాత్రం బౌండరీలకు పంపారు. దీంతో 10వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ 76 పరుగులు చేసింది.
 
 కోహ్లి 34 బంతుల్లో, రోహిత్ 44 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. 12.4 ఓవర్లలో భారత్ 100 మార్కును చేరుకుంది. 15వ ఓవర్లో రస్సెల్ బౌలింగ్‌లో కోహ్లి బౌల్డయ్యాడు. కోహ్లి, రోహిత్‌ల అద్భుత భాగస్వామ్యంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది.  
 యువరాజ్ ఫామ్‌లోకి రావడానికి ఈ మ్యాచ్‌ను వినియోగించుకునే ప్రయత్నం చేశాడు. అయితే బాగా ఇబ్బందిపడి స్కోర్లు సమం అయ్యాక అనవసరంగా అవుటయ్యాడు. రైనా వచ్చి లాంఛనాన్ని పూర్తి చేశాడు.
 
 స్కోరు వివరాలు
 వెస్టిండీస్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి అండ్ బి) అశ్విన్ 11; క్రిస్ గేల్ రనౌట్ 34; శామ్యూల్స్ (స్టం) ధోని (బి) మిశ్రా 18; సిమ్మన్స్ (సి) ధావన్ (బి)జడేజా 27; డ్వేన్ బ్రేవో ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 0; స్యామీ (సి) రోహిత్ (బి) జడేజా 11; రస్సెల్ (సి) కోహ్లి (బి) జడేజా 7; నరైన్ నాటౌట్ 7; రామ్‌దిన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 1, వైడ్లు 12, నోబాల్ 1) 14; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 129
 వికెట్ల పతనం: 1-38; 2-62; 3-74; 4-74; 5-97; 6-108; 7-121.
 బౌలింగ్: భువనేశ్వర్ 3-0-3-0;షమీ 3-0-27-0; అశ్విన్ 4-0-24-1; అమిత్ మిశ్రా 4-0-18-2; రైనా 2-0-8-0; జడేజా 4-0-48-3.
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 62; ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) బద్రీ 0; కోహ్లి (బి) రస్సెల్ 54; యువరాజ్ (సి) గేల్ (బి) శామ్యూల్స్ 10; రైనా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు (వైడ్లు 2, నోబాల్ 1) 3; మొత్తం (19.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి) 130
 వికెట్ల పతనం: 1-1; 2-107; 3-129.
 బౌలింగ్: బద్రీ 4-0-28-1; సంటోకీ 4-0-27-0; నరైన్ 4-0-20-0; బ్రేవో 1-0-12-0; స్యామీ 1-0-9-0; శామ్యూల్స్ 3.4-0-22-1; రస్సెల్ 2-0-12-1.
 
 టర్నింగ్ పాయింట్
 భువనేశ్వర్ కుమార్  బౌలింగ్ ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. తొలి ఓవర్లో వరుసగా తొలి మూడు బంతులను అద్భుతంగా స్వింగ్ చేశాడు. మూడు ఓవర్లలో ఒక వైడ్, రెండు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. డ్వేన్ స్మిత్, గేల్ లాంటి ఇద్దరు భారీ హిట్టర్‌లను కట్టడి చేశాడు. రెండో ఎండ్‌లో షమీ కాస్త పరుగులిచ్చినా... భువీ మాత్రం చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశాడు. దీంతో పరుగులు రాక వెస్టిండీస్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. మిశ్రా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడం కూడా కీలకమే అయినా... మ్యాచ్‌కు టర్నింగ్‌పాయింట్ భువనేశ్వర్ స్పెల్.
 
 స్కోరెంత?
 ఇదే మైదానంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్ ఆలస్యం కావడంతో భారత్, విండీస్ మ్యాచ్ పది నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. ఇక భారత ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు కూడా 10 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. వెస్టిండీస్ 129 పరుగులు చేస్తే... స్టేడియంలో బోర్డు మీద 130 పరుగులు చేసినట్లు వచ్చింది. దీంతో భారత్ లక్ష్యం విషయంలో కాస్త అయోమయం ఏర్పడింది. దీంతో స్కోర్లు చెక్‌చేసి భారత్ లక్ష్యాన్ని 130గా ప్రకటించాక మ్యాచ్ ప్రారంభమైంది.
 
 టి20 ప్రపంచకప్‌లో నేడు
 న్యూజిలాండ్   x దక్షిణాఫ్రికా
 మధ్యాహ్నం గం. 3.00 నుంచి
 
 శ్రీలంక   x నెదర్లాండ్స్
 
 రాత్రి గం. 7.00 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 క్రికెట్ మా జీవితంలో భాగం. కానీ అదే జీవితం కాదు. అందుకే గెలిచినా, ఓడినా ఒకేలా ఉంటాం. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం ఉంది. అయితే వాళ్లు ప్రణాళికలను సమర్థంగా అమలు చేశారు.  యువరాజ్ టి20ల్లో చాలా గొప్ప ఆటగాడు. వన్డే జట్టులో స్థానం కోల్పోయాక తిరిగి వచ్చి జట్టులో కుదురుకునే సమయంలో కాస్త ఒత్తిడి ఉంటుంది. గాడిలో పడటానికి ఒకట్రెండు మ్యాచ్‌లు అవసరమవుతాయి. బౌండరీ లైన్ దగ్గర క్యాచ్‌ల విషయంలో అన్ని జట్లూ ఇబ్బంది పడుతున్నాయి. దీనికి లైట్స్ కారణమా లేక మరేదైనా కారణం ఉందో విశ్లేషించాలి. దీనిని సమీక్షించుకుంటాం.    
 - ధోని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement