
భారత్ బోణీ
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్‌లో బోణీ చేసింది. ఒమన్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 8-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. యువ స్ట్రయికర్ మన్‌దీప్ సింగ్ ‘హ్యాట్రిక్’ నమోదు చేసి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
ఇపో (మలేసియా): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్‌లో బోణీ చేసింది. ఒమన్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 8-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. యువ స్ట్రయికర్ మన్‌దీప్ సింగ్ ‘హ్యాట్రిక్’ నమోదు చేసి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. రమణ్‌దీప్, రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్, మలాక్ సింగ్, ఎస్.కె. ఉతప్ప ఒక్కో గోల్ చేశారు. సోమవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది.
వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా ఆసియా కప్ నెగ్గాల్సిన భారత్ తొలి మ్యాచ్‌లో దూకుడుగా ఆడింది.
ఆరంభం నుంచే సమన్వయంతో కదులుతూ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. ఫలితంగా ఆట నాలుగో నిమిషంలో మన్‌దీప్ గోల్‌తో ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించిన టీమిండియా చివరి 17 నిమిషాల్లో మరో మూడు గోల్స్‌ను సాధించింది. రెండో అర్ధభాగంలోనూ భారత్ ఆధిపత్యం కొనసాగిస్తూ ఏడు నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసింది. అయితే పెనాల్టీ కార్నర్‌ల విషయంలో భారత్ పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆరు పెనాల్టీ కార్నర్‌లు రాగా కేవలం రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. ‘ఇది ప్రామాణికమైన విజయం. తొలి అర్ధభాగంలో అద్భుతంగా ఆడినా రెండో అర్ధభాగంలో కాస్త నెమ్మదించాం. మొత్తానికి ఈ మ్యాచ్‌లో కనబరిచిన ఆటతీరుతో సంతృప్తి చెందాను’ అని భారత జట్టు తాత్కాలి కోచ్ రోలంట్ అల్ట్‌మన్స్ వ్యాఖ్యానించారు.