కోహ్లి ఆట కావాలి!
►వరుసగా విఫలమవుతున్న భారత కెప్టెన్
►చివరి టెస్టులోనైనా రాణించేనా!
మాటకు మాట జవాబు... ప్రత్యర్థికి పోటీగా ఎదురుదాడి... మీడియా సమావేశాల్లో కూడా దూకుడు... ఆస్ట్రేలియాలాంటి జట్టుతో తలపడుతున్న సమయంలో ఒక కెప్టెన్‌గా ఎలా ఉండాలో విరాట్ కోహ్లి అన్నీ చేసి చూపించాడు. స్మిత్ దొంగతనాన్ని పట్టుకోవడంనుంచి వార్నర్‌ను ఆటపట్టించడం వరకు అన్నీ అయిపోయాయి. కానీ కోహ్లినుంచి జట్టు, అభిమానులు ఆశించే ఆట మాత్రం మూడు టెస్టులు ముగిసినా కనిపించలేదు. ఆసీస్‌తో పోరుకు ముందు వరకు వరుసగా నాలుగు సిరీస్‌లలో డబుల్ సెంచరీలతో చెలరేగిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి కనీసం అర్ధ సెంచరీ కూడా పూర్తి చేయలేదు! అటు వైపు తీవ్ర ఒత్తిడిలో కూడా ప్రత్యర్థి కెప్టెన్ పరుగుల వేటలో దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం పూర్తిగా వెనుకబడిపోయాడు. ఇతర బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నా కోహ్లి వైఫల్యం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. అద్భుతంలా సాగిన ఈ సీజన్‌లో చివరి టెస్టులోనైనా తన అసలు సత్తా ప్రదర్శించే కోహ్లి ఈ టెస్టును బ్యాటింగ్‌తోనూ చిరస్మరణీయం చేసుకుంటాడా అనేది ఆసక్తికరం.
సాక్షి క్రీడా విభాగం : బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టుల ఫలితాలు, వివాదల సంగతి పక్కన పెడితే ఆస్ట్రేలియా జట్టు ఒక విషయంలో మాత్రం పూర్తిగా సఫలమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన విరాట్ కోహ్లిని పరుగులు చేయకుండా ఆ జట్టు నిరోధించగలిగింది. 0, 13, 12, 15, 6... ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన స్కోర్లు ఇవి. ఈ సిరీస్‌కు ముందు అద్భుతమైన ఆటతో రికార్డులు తిరగరాసిన కోహ్లి అనూహ్య ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2014లో ఇంగ్లండ్‌లో ఘోర వైఫల్యంనుంచి కోలుకొని తన ఆటలో మార్పులు చేసుకున్న అనంతరం కోహ్లి కెరీర్‌లో ఇంత గడ్డు దశ ఎప్పుడూ రాలేదు. బ్యాట్స్‌మెన్ అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవడం సాధారణమే అని సర్ది చెప్పుకున్నా... కోహ్లి స్థాయి క్రికెటర్ అదీ సొంత గడ్డపై ఇలా ఇబ్బంది పడటం మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అతనికంటే ఎక్కువగా జట్టు భారాన్ని మోస్తున్న స్మిత్ అలవోకగా పరుగులు సాధిస్తుండగా, కోహ్లి మాత్రం తడబడ్డాడు.
క్రీజ్‌లోనే తడబాటు...
పుణే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం ఒక్కసారిగా మూడేళ్ల క్రితంనాటి కోహ్లిని గుర్తుకు తెచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంతి వదిలేసి బౌల్డ్ కావడంపై క్రికెట్ విశ్లేషకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బెంగళూరు టెస్టులో రెండు సార్లూ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం అయితే అతని ఫుట్‌వర్క్ లోపాలను చూపించింది. గతంలో ఇదే తరహా సమస్య వచ్చినప్పుడు అతను సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేయడంతో పాటు తన లోపాన్ని సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యాడు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కోహ్లి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అయితే రాంచీ టెస్టుకు ముందు చాలా విరామం లభించినా కోహ్లి దీనిపై దృష్టి పెట్టినట్లు లేదు. తన స్థాయికి ఫామ్‌లోకి తిరిగి రావడం పెద్ద సమస్య కాకపోవచ్చని అతను భావించి ఉంటాడు. మూడో టెస్టులో కూడా కొత్త బంతిని డ్రైవ్ చేయబోయి స్లిప్‌లోనే క్యాచ్ ఇవ్వడం కోహ్లి సన్నాహకాల లోపాలను బయట పెట్టింది. ఒక సిరీస్ వైఫల్యం గొప్ప ఆటగాడి స్థాయిని తగ్గించకపోవచ్చు గానీ జట్టు బ్యాటింగ్‌కు మూలస్థంభంలాంటి ఆటగాడు మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశించడంలో తప్పు లేదు.
ఒత్తిడి పెంచుకున్నాడా...
రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో కోహ్లి... ఆసీస్ ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో నాలుగు టెస్టులలో నాలుగు సెంచరీలు సాధించడంతో పాటు మాటల యుద్ధంలో కూడా కంగారూలతో సమానంగా బదులిచ్చాడు. ఈ సారి ఆ జట్టు భారత్‌కు వచ్చినప్పుడు కూడా తన దూకుడును ఎక్కడా తగ్గించవద్దని, పెద్దగా బలంగా లేని ఆసీస్‌పై అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించాలని కూడా భావించి ఉంటాడు. మాటల దాడికి కూడా కోహ్లి ముందే సన్నద్ధమైనట్లున్నాడు. అదే మైండ్‌సెట్‌తో కోహ్లి తన బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాడేమో అనిపిస్తోంది. మీడియాలో ఏం రాసినా పట్టించుకోను, అది వారి ఉద్యోగం అంటూ ఒక వైపు చెబుతున్నా... పుణే ఫలితం కోహ్లిపై ప్రతికూల ప్రభావం చూపించింది.
రివ్యూ వివాదం విషయం, రాంచీ టెస్టు తర్వాత ఫిజియోపై వ్యాఖ్యల విషయంలో కూడా కోహ్లి అవసరానికి మించిన దూకుడు కనబర్చాడని, ఇది అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని వ్యాఖ్యలు వినిపించాయి. ఒక కెప్టెన్‌గా ఉంటూ వికెట్ తీసినప్పుడు వార్నర్‌కు భుజం చూపిస్తూ చేసిన సంజ్ఞను వీవీఎస్ లక్ష్మణ్ కూడా తప్పుపట్టారు.ఇక అర్థం పర్థం లేనివే అయినా... ఆస్ట్రేలియా మీడియా వార్తలు కూడా కోహ్లి దాకా చేరి అతని ఏకాగ్రతను దెబ్బ తీసినట్లున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలోనైనా కోహ్లి తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలని అంతా కోరుకుంటున్నారు.
గాయం తగ్గలేదా..!
రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గురువారం భారత జట్టు నెట్ సెషన్‌కు అతను వచ్చినా బ్యాటింగ్ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. అతని భుజానికి ఇంకా బ్యాండేజీ కనిపిస్తోంది. కొద్ది సేపు వార్మప్‌లో పాల్గొన్న అనంతరం ఫీల్డింగ్‌లో అండర్ ఆర్మ్ త్రోలు మాత్రం విసిరాడు. మొత్తంగా తన భుజంపై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు కోహ్లి ప్రయత్నించాడు. అయితే ముందు జాగ్రత్త కోసమే అతను బ్యాటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. నాలుగో టెస్టుకు ముందు రోజు శుక్రవారం జరిగే ప్రాక్టీస్ సమయంలో కోహ్లి గాయంపై మరింత స్పష్టత రావచ్చు. అయితే రాంచీలోనూ తన గాయంపై ఉన్న సందేహాలను తొలగిస్తూ బ్యాటింగ్‌కు దిగిన విరాట్ స్వభావం గురించిన తెలిసినవారు సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టుకు అతను దూరంగా ఉండే
అవకాశమే లేదని చెబుతున్నారు.
ప్రత్యామ్నాయంగా అయ్యర్...
కోహ్లి గాయం నేపథ్యంలో బీసీసీఐ ముందు జాగ్రత్తగా మరో బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేసింది. ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ శుక్రవారం జట్టుతో చేరతాడు. ధర్మశాలలాంటి చోటుకు చివరి నిమిషంలో చేరుకోవడం కష్టం కాబట్టి, మరో ఆటగాడు అందుబాటులో ఉంటే మంచిదని భావించి అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. గత ఏడాది రంజీ ట్రోఫీలో 1321 పరుగులతో టాపర్‌గా నిలిచిన అయ్యర్, ఈ సీజన్‌లో కూడా ముంబై తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అయ్యర్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు.