విరాట్ విశ్వరూపం.. అశ్విన్ అదుర్స్
► కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ
► తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం
► తొలి ఇన్నింగ్స్ 566/8 (డిక్లెర్డ్)
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ (283 బంతుల్లో 200; 24 ఫోర్లు)కి తోడు ఆల్ రౌండర్ అశ్విన్ సెంచరీ (253 బంతుల్లో 113 ; 12 ఫోర్లు) స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించడంతో భారీ స్కోరు చేసింది. దీంతో రెండో రోజు కూడా భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవర్ నైట్ స్కోరు 302/4 తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 566 పరుగుల వద్ద అమిత్ మిశ్రా(68 బంతుల్లో 53; 6 ఫోర్లు) 8వ వికెట్ గా ఔట్ కాగానే భారత్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది.
ఓవర్ నైట్ స్కోరు 302/4 తో రెండోరోజు బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ, అశ్విన్ మొదట డిఫెన్స్కు ప్రాధాన్యమిచ్చారు. విండీస్ పేసర్లు బౌన్సర్లు, పదునైన పేస్ బౌలింగ్తో దాడులు చేసినా వీరు మాత్రం ఒత్తిడికి గురికాలేదు. 43 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న అశ్విన్ 127 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. విరాట్ కూడా జోరు చూపడంతో తొలి సెషన్‌లో భారత్ వికెట్ కోల్పోకుండా 102 పరుగులు చేసింది. కానీ లంచ్ తర్వాత రెండో బంతికే గాబ్రియెల్ బౌలింగ్ లో కోహ్లి అవుట్ కావడంతో ఐదో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
బ్రాత్వైట్కు మూడు వికెట్లు
కోహ్లి ఔటయ్యాక క్రీజులోకొచ్చిన సాహా (88 బంతుల్లో 40; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. అయితే బ్రాత్ వైట్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడగా సాహా స్టంప్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిశ్రా సహకారంలో అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రాత్ వైట్ మరోసారి భారత్ను దెబ్బతీశాడు. స్కోరు వేగాన్ని పెంచేందుకు యత్నించిన అశ్విన్ బ్రాత్వైట్ బౌలింగ్ లో గాబ్రియెల్ కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. షమీ(9 బంతుల్లో 17; 2 సిక్సులు) దూకుడుగా ఆడుతుంటే మరోవైపు మిశ్రా హాఫ్ సెంచరీ (53) చేసి బ్రాత్ వైట్ బౌలింగ్ లో హోల్డర్ క్యాచ్ పట్టడంతో భారత్ 8వ వికెట్ కోల్పోయింది. అప్పటికి 161.5 ఓవర్లలో భారత్ స్కోరు 566/8. మిశ్రా ఔట కాగానే కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లెర్ చేశాడు. విండీస్ బౌలర్లలో బిషూ, బ్రాత్వైట్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, గాబ్రియెల్ రెండు వికెట్లు తీశాడు.
బ్యాటింగ్ కు దిగిన విండీస్ 16 ఓవర్లలో వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. బ్రాత్వైట్ (11), బిషూ(0) క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.