న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూసుకుపోతున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తరహాల్లో అన్ని ఫార్మాట్లలో విజయాలను నమోదు చేస్తున్న టీమిండియా..ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసే నాటికి 'గేటెస్ట్ వన్డే టీమ్'గా రూపొందే అవకాశాలున్నాయన్నారు. అంతకుముందు చూడని భారత క్రికెట్ జట్టును మరికొద్ది రోజుల్లో చూడబోతున్నమని గావస్కర్ జోస్యం చెప్పారు.
'కోహ్లి నేతృత్వంలోని ప్రస్తుత టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. అందుచేత ఆసీస్ తో సిరీస్ ముగిసేనాటికి భారత జట్టు గొప్ప వన్డే జట్టుగా ఖ్యాతిని గడించడం ఖాయం. భారత జట్టులో తొమ్మిదో నంబర్ వరకూ బ్యాటింగ్ చేసే ఆటగాళ్లున్నారు. ఇక బౌలింగ్ లో కూడా జట్టు సమతుల్యంగా ఉంది. మరొకవైపు ఆసీస్ జట్టు బలహీనంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో ఆ జట్టు బలహీనంగా అయితే లేదు. ఇప్పటివరకూ జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల్లోనూ ఆసీస్ ప్రదర్శన బాగానే ఉంది. ఆయా వన్డేల్లో భారత్ ఒత్తిడిని జయించి విజయాలు నమోదు చేసింది. అదే భారత జట్టును చాంపియన్ స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం తొమ్మిది వరుస విజయాలతో ఉన్న భారత జట్టు..ఈ సిరీస్ ముగిసే నాటికి మరొక కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది'అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.