
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతీ ఒక్కరు ఓటు వేసే విధంగా అవగాహన పెంచే కార్యక్రమానికి మద్దతు పలకాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ క్రికెటర్లను కూడా భాగం చేస్తూ ట్వీట్ చేశారు. ఇందులో అశ్విన్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన అశ్విన్... ప్రజాస్వామ్య దేశంలో కీలకమైన ఓటును అందరూ వినియోగించి సరైన నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు. అయితే పనిలో పనిగా తన వైపు నుంచి మరో విజ్ఞప్తిని కూడా ప్రధానికి పంపాడు.
ఐపీఎల్ కారణంగా వేర్వేరు నగరాల్లో ఉండాల్సి వస్తున్న తమ క్రికెటర్ల తరఫున అతను ట్వీట్ చేశాడు. ‘ఐపీఎల్‌లో ఆడుతున్న ప్రతీ క్రికెటర్ తాము ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిందిగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ప్రధానికి అశ్విన్ ట్వీట్ చేశాడు. ఇలాంటి అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం క్రికెటర్ విజ్ఞప్తిపై ఏమైనా స్పందిస్తుందో చూడాలి.