న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ఢిల్లీ క్యాపిటల్స్ బదులు తీర్చుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆరో విజయాన్ని దక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (37 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిశాడు. ఢిల్లీకి ఆడుతున్న నేపాల్‌కు చెందిన యువ స్పిన్నర్ సందీప్ లమిచానే 3 వికెట్లు తీశాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (41 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అయ్యర్ (49 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్రామ్ (9 బంతుల్లో 19; 4 ఫోర్లు) ధాటిగా ఆడాడు.
బాగా ఆడింది... గేల్ ఒక్కడే
పంజాబ్ తరఫున ఫామ్‌లో ఉన్న రాహుల్ (12) విఫలమయ్యాడు. మయాంక్ 2 పరుగులకే ఔట య్యాడు. మిల్లర్ (7) చేతులెత్తేశాడు. ఈ ముగ్గురు కలిసి 21 పరుగులు చేశారు. కానీ ఈ ముగ్గురు ఔటయ్యేసరికి 7.1 ఓవర్లు ముగిశాయి. జట్టు స్కోరేమో 61 పరుగులు. క్రిస్ గేల్ పుణ్యమాని ఈ పరుగులు పంజాబ్ ఖాతాలో చేరాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో పరుగులకు శ్రీకారం చుట్టిన పంజాబ్‌కు కష్టాలెదురైనా... గేల్ మెరుపులే ఇన్నింగ్స్‌కు ఆయువుపట్టుగా నిలిచాయి.
25 బంతుల్లో అర్ధసెంచరీ...
ఓ వైపు వికెట్లు పడుతున్నా గేల్ దుమారం కొనసాగింది. ఇషాంత్ శర్మ మూడో ఓవర్లో 4, 6 బాదిన ఓపెనర్... తర్వాత సందీప్ లమిచానే నాలుగో ఓవర్లో 4 బౌండరీలు కొట్టాడు. దీంతో పవర్‌ప్లేలో కింగ్స్ ఎలెవన్ స్కోరు 50 పరుగులకు చేరింది. స్పిన్నర్లను రంగంలోకి దించితే గేల్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లో (6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతను ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో పంజాబ్ స్కోరు 92/3. వంద పరుగులు దాటాక... లమిచానే వేసిన 13వ ఓవర్లో సిక్సర్ కొట్టిన గేల్ మరో సిక్స్ బాదేందుకు ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్‌కు వెంట్రుకవాసి దూరంలో అద్భుతమైన రిలే క్యాచ్‌తో అతని ఇన్నింగ్స్‌కు తెరపడింది. డీప్‌మిడ్ వికెట్ వద్ద క్యాచ్ పట్టిన ఇంగ్రామ్ బౌండరీ లైనుకు తాకుతుండగా బంతిని పది గజాల దూరంలో ఉన్న అక్షర్ వైపు విసిరాడు. అతను క్యాచ్ అందుకోవడంతో గేల్ ఔటయ్యాడు. అదే ఓవర్లో కరన్ (0) ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఆ తర్వాత మన్‌దీప్ సింగ్ (27 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్) పర్వాలేదనిపించాడు. చివర్లో హర్‌ప్రీత్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో పంజాబ్ స్కోరు 150 దాటింది.
ఆకట్టుకున్న ధావన్, అయ్యర్
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఢిల్లీ పృథ్వీ షా (13) వికెట్‌ను కోల్పోయింది. కరన్ బౌలింగ్‌లో ఫోర్, షమీ ఓవర్‌లో సిక్స్ బాది మంచి జోరు కనబరిచిన పృథ్వీ షా... ధావన్ కారణంగా రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక్కడ నుంచి ధావన్ బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. విలోన్ బౌలింగ్‌లో రెండు వరుస ఫోర్లతో అలరించాడు. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఐదో ఓవర్‌లో ధావన్ సిక్స్, అయ్యర్ రెండు ఫోర్లు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. తర్వాత ధావన్ కాస్త నెమ్మదించినా... కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో తొలి పది ఓవర్లలో ఢిల్లీ 95 పరుగులు చేసింది. భారీ లక్ష్యం కాకపోవడంతో నెమ్మదిగా ఆడిన ధావన్ 36 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. అనంతరం విలోన్ బౌలింగ్‌లో మరో బౌండరీ బాదిన ధావన్... మరుసటి బంతికే రవిచంద్రన్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫలితంగా రెండో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన పంత్ (6) రాణించలేకపోయాడు. చివరి మూడు ఓవర్లలో 23 పరుగులు చేయాల్సిన స్థితిలో ఇంగ్రామ్ చెలరేగిపోయాడు. విలోన్ వేసిన 18 వ ఓవర్‌లో 3 ఫోర్లతో 13 పరుగులు రాబట్టాడు. మరుసటి ఓవర్‌లోనే షమీ అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరుసటి బంతికే అక్షర్ పటేల్ (1) రనౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న అయ్యర్... రూథర్‌ఫర్డ్ (2 నాటౌట్)తో కలిసి రెండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. అజేయ అర్ధ సెంచరీ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఢిల్లీ సిక్సర్...
Published Sun, Apr 21 2019 12:11 AM | Last Updated on Sun, Apr 21 2019 5:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment