రబడా ‘సూపర్‌’ షో | Rabada Super Show Hepls To Delhi Win Against Kings Punjab Match | Sakshi
Sakshi News home page

రబడా ‘సూపర్‌’ షో

Published Sun, Sep 20 2020 11:48 PM | Last Updated on Mon, Sep 21 2020 12:07 AM

Rabada Super Show Hepls To Delhi Win Against Kings Punjab Match - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో  భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపును అందుకుంది. సూపర్‌ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌ రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి.  ఈ మూడు పరుగుల్ని ఢిల్లీ సునాయసంగా సాధించి తాము ఫేవరెట్‌ జట్లలో ఒకటని నిరూపించుకుంది. కింగ్స్‌  పంజాబ్‌ ఆడిన సూపర్‌ ఓవర్‌లో రాహుల్‌ రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. రబడా వేసిన రెండో బంతికి రాహుల్‌ ఔట్‌ కాగా, ఆ మరుసటి బంతికి పూరన్‌ బౌల్డ్‌ అయ్యాడు. సూపర్‌ ఓవర్‌లో రెండు వికెట్లు పడితే అక్కడితో ఒక జట్టు ఇన్నింగ్స్‌ ముగుస్తుంది. దాంతో కింగ్స్‌ మూడు పరుగుల్ని మాత్రమే ఢిల్లీకి నిర్దేశించింది. ఢిల్లీ ఆడిన సూపర్‌ ఓవర్‌లో ఓపెనర్‌గా దిగిన పంత్‌ రెండు పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.(చదవండి: అటు స్టోయినిస్‌.. ఇటు మయాంక్‌.. మ్యాచ్‌ టై)

ఢిల్లీ క్యాపిటల్స్‌-కింగ్స్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ రసవత్తర పోరు టై అయ్యింది. ఇరు జట్లు 20 ఓవర్లలో 157 పరుగులే చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. కింగ్స్‌కు ఓటమి ఖాయమనుక్ను తరుణంలో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ వికెట్లకు అడ్డంగా నిలబడిపోయి మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకొచ్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా వన్‌ మ్యాన్‌ షో జట్టును ఆదుకున్నాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు సాధించాడు. అయితే గెలుపు ఖాయమనుక్ను తరుణంలో మయాంక్‌ క్యాచ్‌గా ఔటయ్యాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక ఫాస్ట్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. ప్రధానంగా ఢిల్లీ బౌలర్‌ మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో రెచ్చిపోయి ఆడాడు.  చివరి ఓవర్‌లో  కింగ్స్‌కు 13 పరుగులు కావాల్సిన తరుణంలో 12 పరుగులు చేసిన తర్వాత మయాంక్‌ క్యాచ్‌కు దొరికేయడంతో మ్యాచ్‌పై ఒక్కసారిగా ఉత్కంఠను రేగింది.  కాగా, చివరి బంతికి జోర్డాన్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ టై అయ్యింది. చివరి ఓవర్‌లో స్టోయినిస్‌ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను టైగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. కింగ్స్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(21; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. మోహిత్‌ శర్మ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇన్‌కట్టర్‌ను అంచనా వేయడంలో విఫలం కావడంతో బౌల్డ్‌గా నిష్క్రమించాడు. అనంతరం కరుణ్‌ నాయర్‌, పూరన్‌లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరారు. ఆపై మ్యాక్స్‌వెల్‌(1) కూడా ఔటయ్యాడు. రబడా బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లలో కింగ్స్‌ పంజాబ్‌ సగం వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. ఒకవైపు ఓపెనర్‌గా వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ క్రీజ్‌లో ఉండగానే వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ చేరడంతో కింగ్స్‌ పంజాబ్‌ ఒత్తిడిలోకి వెళ్లింది. ఆ సమయంలో మయాంక్‌ క్రీజ్‌లో పాతుకుపోయాడు. కడవరకూ క్రీజ్‌లో ఉండి, పరుగు అవసరమైన సమయంలో షాట్‌ ఆడి ఔటయ్యాడు. దాంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సీజన్‌ ఆరంభమైన రెండో మ్యాచ్‌లోనే సూపర్‌ ఓవర్‌ వరకూ వెళ్లడం ఆసక్తికర పోరుకు అద్దం పడుతుంది.

అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఢిల్లీ కష్టాల్లో పడ్డ సమయంలో స్టోయినిస్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టాడు. . 20 బంతుల్లో  సిక్స్‌లు, ఫోర్లు మోత మోగించి హాఫ్‌ సెంచరీ సాధించాడు. దాంతో ఢిల్లీ స్కోరు బోర్డును 150 పరుగులు దాటింది. ఢిల్లీ 110 పరుగులైనా చేస్తుందా అనే సమయంలో స్టోయినిస్‌ చెలరేగిపోయాడు.  బౌలర్‌ ఎవరైనా వీరబాదుడే లక్ష్యంగా బౌండరీల మోత మోగించాడు. కాట్రెల్‌ వేసిన 19 ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన స్టోయినిస్‌.. చివరి ఓవర్‌లో మాత్రం ఐదు బంతుల్ని బౌండరీ దాటించాడు. జోర్డాన్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతిని సిక్స్‌ కొట్టిన స్టోయినిస్‌.. రెండో బంతిని ఫోర్‌ కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్ని ఫోర్లు కొట్టిన స్టోయినిస్‌.. ఐదో బంతిని సిక్స్‌ కొట్టాడు. ఆరో బంతి నో బాల్‌ కాగా, స్టోయినిస్‌ రనౌట్‌ అయ్యాడు. చివరి ఓవర్‌లో 24 పరుగుల్ని స్టోయినిస్‌ రాబట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement