ముంబై దెబ్బకి ఢిల్లీ విలవిల | IPL 2019 Mumbai Indians Beat Delhi Capitals By 40 Runs | Sakshi
Sakshi News home page

ముంబై దెబ్బకి ఢిల్లీ విలవిల

Published Thu, Apr 18 2019 11:47 PM | Last Updated on Thu, Apr 18 2019 11:56 PM

IPL 2019 Mumbai Indians Beat Delhi Capitals By 40 Runs - Sakshi

న్యూఢిల్లీ : ముంబై ఇండియన్స్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 40 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. దీంతో సొంతమైదానంలో జరిగిన పరాభవానికి ముంబై ఢిల్లీపై ప్రతీకారం తీసుకుంది. ముంబై నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది. ముంబై యువ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌(3/19), బుమ్రా(2/18) ధాటికి ఢిల్లీ విలవిల్లాడింది. ముంబై బౌలర్ల కట్టదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు వరుసగా వికెట్ల తీయడంతో ఢిల్లీ కుదేలైంది

ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించిన అనంతరం శిఖర్‌ ధావన్‌(35)ను రాహుల్‌ చహర్‌ ఔట్‌ చేశాడు. ధావన్‌తో ఢిల్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. అనంతరం మరో ఓపెనర్‌ పృథ్వీ సా(20) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఢిల్లీ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అయ్యర్‌(3), పంత్‌(7), మున్రో(3)లు పూర్తిగా నిరాశపరిచారు. చివర్లో అక్షర్‌ పటేల్‌(26) రాణించినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు.    

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-డీకాక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ(30) ఔటయ్యాడు. ఆపై బెన్‌ కట్టింగ్‌(2) నిరాశపరచగా, కాసేపటికి డీకాక్‌(35) రనౌట్‌ అయ్యాడు. దాంతో ముంబై 74 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది.

ఇక సూర్యకుమార్‌ యాదవ్‌(26) ఫర్వాలేదనిపించగా, కృనాల్‌ పాండ్యా-హార్దిక్‌ పాండ్యాలు ఇన్నింగ్స్‌ ను చక్కదిద్దారు. ఇక్కడ హార్దిక్‌ 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేయగా, కృనాల్‌ 26 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అజేయంగా 37 పరుగులు చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చివరి మూడు ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 50 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో రబడా రెండు వికెట్లు సాధించగా, అమిత్‌ మిశ్రా, అక్షర్‌ పటేల్‌లు తలో వికెట్‌ తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement