IPL 2024 MI VS DC: అరుదైన క్లబ్‌లో బుమ్రా | IPL 2024 MI Vs DC: Jasprit Bumrah Joins Elite Club Of 150 Wickets, 3rd Fastest To Do So - Sakshi
Sakshi News home page

IPL 2024 MI VS DC: అరుదైన క్లబ్‌లో బుమ్రా

Published Sun, Apr 7 2024 7:27 PM | Last Updated on Mon, Apr 8 2024 10:31 AM

IPL 2024 MI VS DC: Bumrah Joins Elite Club Of 150 Wickets, 3rd Fastest To Do So - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అరుదైన క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ పోరెల్‌ (41) వికెట్‌ పడగొట్టడంతో ఐపీఎల్‌లో 150 వికెట్ల అరుదైన మైలురాయిని తాకాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఇప్పటివరకు కేవలం పది మంది (బుమ్రాతో సహా) మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో చహల్‌ 195 వికెట్లతో టాప్‌లో ఉండగా.. బ్రావో (183), పియుశ్‌ చావ్లా (181), అమిత్‌ మిశ్రా (173), అశ్విన్‌ (172), భువనేశ్వర్‌ కుమార్‌ (171), లసిత్‌ మలింగ (170), సునీల్‌ నరైన్‌ (166), రవంద్ర జడేజా (153) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

మూడో వేగవంతమైన బౌలర్‌గా..
బుమ్రా ఐపీఎల్‌లో 150 వికెట్ల మార్కును తాకిన మూడో వేగవంతమైన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బుమ్రా 150 వికెట్ల మైలురాయిని తాకేందుకు 124 మ్యాచ్‌లు తీసుకోగా.. మలింగ 105 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మలింగ తర్వాతి స్థానంలో చహల్‌ ఉన్నాడు. చహల్‌ 118 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మైలురాయిని తాకాడు. 

కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబైను ట్రిస్టన్‌ స్టబ్స్‌ భయపెట్టాడు. స్టబ్స్‌ కేవలం 19 బంతుల్లోనే అర్దసెంచరీ పూర్తి చేసి ముంబై శిబిరంలో గుబులు పుట్టించాడు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.

ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ గెలుపుకు 34 పరుగులు అవసరం కాగా.. కొయెట్జీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీని గెలిపించేందుకు స్టబ్స్‌ చివరి వరకు ప్రయత్నించి 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టబ్స్‌కు ముందు పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కొయెట్జీ 4, బుమ్రా 2, షెపర్డ్‌ ఓ వికెట్‌ తీశారు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రోహిత్‌ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (10 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్‌లో షెపర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement