షాహిద్ ‘షహీద్’
అస్తమించిన భారత హాకీ దిగ్గజం మొహమ్మద్ షాహిద్
అత్యుత్తమ ఫార్వర్డ్‌గా గుర్తింపు
1980 ఒలింపిక్ హాకీ జట్టులో సభ్యుడు
భారత హాకీని ఒకప్పుడు తన వేగంతో పరుగులు పెట్టించిన దిగ్గజం జీవిత టర్ఫ్‌పై పరుగు ముగించారు. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించడంలో ప్రపంచ నీరాజనాలందుకున్న ఫార్వర్డ్ తన బతుకు డిఫెన్స్‌లో మాత్రం బలహీనంగా మారిపోయారు. ‘నిర్ణీత సమయానికి’కి ముందే వచ్చిన అనారోగ్యంతో... నాటి హాకీ సూపర్ స్టార్ షాహిద్ 56 ఏళ్లకే ‘షహీద్’గా మారారు.
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం, 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మొహమ్మద్ షాహిద్ అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ తర్వాత వచ్చిన జాండీస్, డెంగీ షాహిద్ పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. ఆ తర్వాత ఆయన కోలుకోలేకపోయారు. ఇక్కడి మెడిసిటీ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూనే షాహిద్ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య పర్వీన్, కవల పిల్లలు సైఫ్, హీనా ఉన్నారు. భారత హాకీ జట్టు ఆఖరిసారిగా ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గిన 1980 జట్టులో షాహిద్ కీలక సభ్యుడు. ఆ తర్వాత మరో రెండు ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న షాహిద్, రెండు ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు గెలవడంలో తనదైన పాత్ర పోషించారు. 1979నుంచి 1988 సియోల్ ఒలింపిక్స్ వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షాహిద్‌ను భారత ప్రభుత్వం అర్జున (1981), పద్మశ్రీ (1986) అవార్డులతో సత్కరించింది. వారణాసికి చెందిన షాహిద్ చనిపోయే సమయానికి భారత రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. వారణాసిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
అత్యుత్తమ కెరీర్...
1960 ఏప్రిల్ 14న జన్మించిన షాహిద్, 1979లో ఫ్రాన్స్‌లో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో రాణించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అదే ఏడాది నాలుగు దేశాల టోర్నీ ద్వారా సీనియర్ టీమ్‌లోకి కూడా వచ్చేశాడు. మైదానంలో చిరుతలా పరుగెత్తడంతో పాటు బంతిని డ్రిబిల్ చేయడంలో అద్భుత నైపుణ్యం షాహిద్ సొంతం. 80ల్లో షాహిద్, జఫర్ ఇక్బాల్ జోడి అటాకింగ్ హాకీకి పర్యాయపదంగా నిలిచింది. 1980లో ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో ‘బెస్ట్ ఫార్వర్డ్’ అవార్డు అందుకున్న షాహిద్, ఒలింపిక్స్ స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడిగా తన కెరీర్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.
సంతాపాల వెల్లువ
భారతదేశం ఒక గొప్ప క్రీడాకారుడిని కోల్పోయింది. షాహిద్‌ను రక్షించుకునేందుకు మేం చేయాల్సిందంతా చేశాం. అయితే మా సహాయం, ప్రార్థనలు ఆయనను బతికించుకునేందుకు సరిపోలేదు -ప్రధాని నరేంద్ర మోదీషాహిద్ మృతి నన్ను కలచివేసింది. అతను చాలా మంచి మనిషి. అయితే చనిపోయాక గానీ మనవాళ్ల గొప్పతనాన్ని గుర్తించకపోవడం దురదృష్టకరం - బల్బీర్ సింగ్ సీనియర్, మాజీ ఆటగాడు
మనం మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడంలో అతని డ్రిబ్లింగ్ కీలక పాత్ర పోషించింది. భారత్ ఒక్కటే కాదు ప్రపంచం మొత్తం అతని ఆటకు అచ్చెరువొందింది. చివరి రోజు కూడా తనకేమీ కాదని, డిశ్చార్జ్ అవుతానని నమ్మకంతో చెప్పాడు - ఎంకే కౌశిక్, మాజీ ఆటగాడు
నా జీవితంలో అతనిలాంటి చురుకైన ఆటగాడిని చూడలేదు. మా మధ్య ఫీల్డ్‌లో ఎంతో గొప్ప సమన్వయం ఉండేది. ఆయన మరణం హాకీ ప్రపంచానికి తీరని లోటు
- జఫర్ ఇక్బాల్, మాజీ ఆటగాడు