కపిల్, గావస్కర్ చూసేవాళ్లు
మొహమ్మద్ షాహిద్ మరణం హాకీ ప్రపంచానికి తీరని లోటు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా... కోలుకుంటున్నారని తెలిసి సంతోషించాం. అంతలోనే ఈ అనూహ్య వార్త. 80వ దశకంలో ఆయనకు సాటి మరెవరూ లేరు. ఆయనకున్న స్కిల్స్ ఇంకెవరికీ రాలేదు. హాకీ స్టిక్‌కు ఏదో అయస్కాంతం ఉన్నట్లు బంతిని కంట్రోల్ చేసేవారు. మైదానంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ బంతిని పూర్తి నియంత్రణతో తీసుకెళ్లేవారు. షాహిద్ ఆడుతున్నారంటే ప్రత్యర్థులు చాలా అప్రమత్తంగా ఉండేవారు. ప్రత్యర్థుల్లో ఏకంగా ఐదుగురు ఒక్క షాహిద్‌ని నియంత్రించడానికి ఆయన చుట్టూ ఉండేవారు. అయినా వాళ్లను తప్పించి మరీ సహచరులకు పాస్‌లు ఇచ్చేవారు. అంతటి స్కిల్ మరెవరికీ లేదు. ప్రతి మ్యాచ్‌లో షార్ట్‌కార్నర్ ఆయనే తీసుకునేవారు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు.
వేగమే ఆయన ఆయుధం. మైదానంలోనే కాదు, బయట ఆయన నడుస్తుంటే పక్కనవాళ్లు పరుగెత్తాల్సి వచ్చేది. మాట కూడా అంతే స్పీడ్‌తో ఉంటుంది. 1988 సియోల్ ఒలింపిక్స్ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. నేను 1989లో భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యాక తొలిసారి హాలెండ్‌లో టోర్నీకి వెళ్లాను. వేరే మ్యాచ్ చూడటానికి వెళ్లి స్టాండ్స్‌లో కూర్చుంటే... ఓ ప్రేక్షకుడు ‘షాహిద్ ఎక్కడున్నారు’ అని అడిగారు. ఆయన రిటైర్ అయ్యారని చెప్పాను. ‘షాహిద్ లేకుండా ఎలా గెలుస్తారు’ అని ఆ ప్రేక్షకుడు అడిగాడు. ఆయన ఆడుతుంటే విదేశాల్లో కూడా అభిమానులు భారీ సంఖ్యలో వచ్చేవారు. బంతి ఆయన స్టిక్ దగ్గర ఉందంటే స్టేడియం హోరెత్తేది. ఆయనను చూడటం అదృష్టం. భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌లాంటి స్టార్ క్రికెటర్స్ కూడా షాహిద్ ఆటను చూడటానికి వచ్చేవారు. ఈ రోజుల్లో క్రీడాకారులకు సినిమా వాళ్ల నుంచి ఎంత ఫాలోయింగ్ ఉందో... ఆ రోజుల్లోనే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉండేది.
ధనరాజ్ పిళ్లైని, నన్ను షాహిద్ బాగా ఇష్టపడేవారు. ఏ సందర్భంలో మేం కనిపించినా కూర్చోబెట్టుకుని చాలా విషయాలు చెప్పేవారు. ఏడేళ్ల క్రితం ఝాన్సీలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆయనతో కలిసి ఆడాను. హాకీని వదిలిన రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన స్కిల్స్ అలాగే ఉన్నాయి. అయితే అంత గొప్ప స్కిల్‌ను తర్వాతి తరాలకు అందించలేకపోవడం మన దురదృష్టం. బనారస్‌లోనే ఉండిపోవడం వల్ల ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)లో లేదా ఏదైనా అకాడమీలోకి ఆయనను తీసుకుని కుర్రాళ్లకు ఆ మెళకువలు నేర్పించి ఉంటే బాగుండేది. రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గానే ఆయన కెరీర్ ముగిసిపోయింది. ఏమైనా భారత హాకీ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది.
ముకేశ్ కుమార్
(రచయిత భారత హాకీ మాజీ కెప్టెన్, ట్రిపుల్ ఒలింపియన్)