కశ్యప్... ఐదో‘సారీ’
♦ మళ్లీ సెమీస్‌లో ఓడిన భారత స్టార్
♦ ఇండోనేసియా ఓపెన్
జకార్తా : అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నా... భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ పోరాటం ముగిసింది. తాజా ఫలితంతో 28 ఏళ్ల కశ్యప్ తన కెరీర్‌లో ఐదోసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ దశను దాటలేకపోయాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)తో 76 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 21-12, 17-21, 19-21తో పోరాడి ఓడిపోయాడు. సెమీస్‌లో ఓడిన కశ్యప్‌కు 11,600 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 43 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో కశ్యప్ సింగపూర్ ఓపెన్ (2012), ఇండోనేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ (2012), డెన్మార్క్ ఓపెన్ (2014)లలోనూ సెమీఫైనల్లో నిష్ర్కమించాడు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్ వాన్ సన్ హో (కొరియా)ను... క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించిన కశ్యప్ సెమీఫైనల్లోనూ మరో సంచలనం సృష్టించేలా కనిపించాడు. అయితే కీలకదశలో అనవసర తప్పిదాలు చేయడం, ప్రత్యర్థి మొమోటా కూడా అద్భుతంగా ఆడటంతో కశ్యప్‌కు ఓటమి తప్పలేదు. తొలి గేమ్‌లో సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచిన కశ్యప్ ఒకదశలో వరుసగా 8 పాయింట్లు నెగ్గి 17-8తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు.
రెండో గేమ్‌లోనూ కశ్యప్ నిలకడగా ఆడి 9-5తో ముందంజ వేశాడు. అయితే అప్పటికే కశ్యప్ ఆటతీరుపై అంచనాకు వచ్చిన మొమోటా నెమ్మదిగా గాడిలో పడ్డాడు. స్కోరును 17-17 వద్ద సమం చేశాడు. ఈ దశలో కశ్యప్ పొరపాట్లు చేయడంతో మొమోటా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. అటు మొమోటా కూడా వెనక్కు తగ్గలేదు. దాంతో ప్రతీ పాయింట్ ఫలితం సుదీర్ఘ ర్యాలీల ద్వారా వచ్చింది. ఒకదశలో కశ్యప్ కాస్తా పైచేయి సాధించి 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి విజయానికి చేరువగా వచ్చాడు. అయితే మొమోటా పట్టుదలతో పోరాడి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గడంతో చివరకు కశ్యప్ ఓటమితో సరిపెట్టుకున్నాడు.