న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో... టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) అగ్రశ్రేణి క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ అభిప్రాయపడ్డాడు. పదేళ్ల విరామం తర్వాత 37 ఏళ్ల శరత్ కమల్ గతవారం ఒమన్ ఓపెన్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. సోమవారం స్వదేశానికి తిరిగి వచ్చి స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన శరత్ కమల్... ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో విశ్వ క్రీడలను నిర్వహించకపోవడమే మేలు అని అన్నాడు. ఏథెన్స్, బీజింగ్, రియో ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన శరత్ నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ‘ఓ క్రీడాకారుడిగా ఒలింపిక్స్ జరగాలనే కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కాదు. ప్రస్తుతం కోవిడ్–19 వైరస్ హడలెత్తిస్తోంది. అందరూ వ్యక్తుల మధ్య దూరం పాటించాలని సూచిస్తున్నారు. వేలాది మంది క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్‌లో ఇది సాధ్యం కాదు. క్రీడలు జరుగుతున్న సమయంలో వారందరూ ఒకే చోట కూడా ఉండాల్సి ఉంటుంది’ అని శరత్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment