
విశాఖ స్పోర్ట్స్: బీచ్ వాలీబాల్ కాంటినెంటల్ కప్ ఫేజ్ వన్ సెంట్రల్ జోన్ టోర్నీలో భారత్ జట్లు చేతులెత్తేయగా... డిఫెండింగ్ చాంప్ శ్రీలంక ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. విశాఖ సాగర తీరంలోని ఇసుకతిన్నెలపై బుధవారం ఉదయం సెషన్‌లో ఇరాన్ ఏ జట్టుతో కజకిస్తాన్ ఏ జట్టు తలపడనుండగా ఇరాన్ బి జట్టుతో కజకిస్తాన్ బి జట్టు ఆడనుంది. సాయంత్రం సెషన్‌లో కజకిస్తాన్ ఏ జట్టుతో శ్రీలంక ఏ జట్టు తలపడనుండగా మరో మ్యాచ్‌లో కజకిస్తాన్ బి జట్టుతో శ్రీలంక బి జట్టు ఆడనుంది. సాయంత్రం సెషన్ రెండుగంటలకే ప్రారంభం కానుంది. మంగళవారం జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ జట్టు ఓటమి పాలైంది. ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో తిరోన్–జయన్(శ్రీలంక) జోడి 2–0 స్ట్రయిట్ సెట్లలో ప్రహ్లాద్–ఆరోన్(భారత్) జోడిపై విజయం సాధించగా... రెండో మ్యాచ్‌లో శ్రీలంక జోడిపై తొలి సెట్‌ను గెలుచుకున్న భారత్ జోడి తరువాత సెట్లలో చేతులెత్తేసింది.
అశాంక–అషేన్(శ్రీలంక) జోడి 2–1తో నరేష్–రాజు(భారత్) జోడిపై విజయం సాధించింది. సాయంత్రం సెషన్‌లో జరిగిన సెమీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు చెందిన మహిళా జోడి లక్షణి–ప్రసాదిని జోడి 2–0తో జెనిఫర్–సుబ్రజ జోడిపైన విజయం సాధించగా... చతురిక–దీపిక(శ్రీలంక) 2–0తో లావణ్య–సుమలత(భారత్) జోడిపైన విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment