సీనియర్లకు మరో చాన్స్
సాక్షి, విశాఖపట్నం: ఫామ్‌లో లేక, ఫిట్‌నెస్ కోల్పోయి భారత సీనియర్ జట్టుకు దూరమైన స్టార్ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకునేందుకు మరో అవకాశం లభించింది. సొంతగడ్డపై వెస్టిండీస్ ‘ఎ’తో జరిగే అనధికారిక టెస్టు, వన్డే సిరీస్‌లకోసం సెలక్టర్లు మంగళవారం ఇక్కడ మూడు భారత ‘ఎ’ జట్లను ప్రకటించారు. సీనియర్లు సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతం గంభీర్‌లకు టెస్టు జట్టులో చోటు లభించింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో మొదటి టెస్టుకు కాకుండా...రెండు, మూడు టెస్టుల కోసం వీరిని ఎంపిక చేశారు.
కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్ ఒక్కడే మూడు టెస్టులకూ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టూర్‌లో భాగంగా విండీస్‌తో జరిగే మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ కోసం ఎంపిక చేసిన వన్డే జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సీనియర్ టీమ్‌లోకి వచ్చేందుకు ఇది అతనికి లభించిన అవకాశంగా భావించవచ్చు. గత నెల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత ‘ఎ’ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు చాంపియన్స్ లీగ్ ఆడుతున్నందున వారిని ఎంపిక చేయలేదు. సెప్టెంబర్ 15నుంచి 21 వరకు బెంగళూరులో వన్డే, టి20 మ్యాచ్‌లు... సెప్టెంబర్ 25నుంచి అక్టోబర్ 12 వరకు మైసూరు, షిమోగా, హుబ్లీలలో టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి.