కబడ్డీ ‘పసిడి’ కూత... | Indian women's kabaddi team wins gold in Asian Beach Games | Sakshi
Sakshi News home page

కబడ్డీ ‘పసిడి’ కూత...

Published Thu, Sep 29 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

Indian women's kabaddi team wins gold in Asian Beach Games

భారత మహిళల జట్టుకు స్వర్ణం
 ఆసియా బీచ్ క్రీడలు

 
 డా నాంగ్ (వియత్నాం): కబడ్డీలో మరోసారి తమ ఆధిపత్యం నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు ఆసియా బీచ్ క్రీడల్లో వరుసగా ఐదోసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. థాయ్‌లాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 41-31 పాయింట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. 2008 నుంచి ఇప్పటివరకు ఆసియా బీచ్ క్రీడల్లో భారత మహిళల జట్టు ఖాతాలోనే కబడ్డీ స్వర్ణం చేరింది. ఈ ఐదుసార్లూ ఫైనల్లో థాయ్‌లాండ్‌పైనే భారత్ నెగ్గడం విశేషం. కారంపూడి గాయత్రి కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ జట్టులో కోడెల వర మాణిక్య దుర్గ, పాయల్ చౌదరీ, పింకీ, సాక్షి కుమారి, ఆంథోనియమ్మ సవరిముత్తు ఇతర సభ్యులుగా ఉన్నారు.
 
 ఫైనల్లో భారత్‌కు ఆరంభంలో కాస్త గట్టిపోటీనే ఎదురైంది. విరామ సమయానికి భారత్ 18-17తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధభాగంలో భారత్ మెరుగ్గా ఆడి 23 పారుుంట్లు స్కోరు చేసి, 14 పాయింట్లు సమర్పించుకొని విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుత ఆసియా బీచ్ క్రీడల్లో భారత్‌కిదే తొలి స్వర్ణం కావడం విశేషం. మరోవైపు భారత పురుషుల కబడ్డీ జట్టుకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో భారత్ 28-30తో పాకిస్తాన్ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.
 
  కురాష్ (రెజ్లింగ్ పోలికలున్న క్రీడ) ఈవెంట్‌లో భారత్‌కు అమీషా టోకస్ రజతం అందించింది. 70 కేజీల విభాగం ఫైనల్లో ఎన్గుయెన్ లాన్ (వియత్నాం) చేతిలో అమీషా ఓడిపోయింది. బీచ్ బాడీబిల్డింగ్ 158 సెంటీమీటర్ల విభాగంలో మనోజ్ కుమార్ మజుందార్ భారత్‌కు కాంస్యాన్ని అందించాడు. ఇప్పటివరకు ఈ క్రీడల్లో భారత్ ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు నెగ్గి 15వ ర్యాంక్‌లో ఉంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement