
జకార్తా: భారత పురుషుల కబడ్డీకి ఆసియా క్రీడల్లో అసాధారణ రికార్డుంది. కానీ ఈ ‘కూత’ ఈసారి ‘కనకం’ దాకా పెట్టలేకపోయింది. సెమీస్‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత పురుషుల జట్టుకు ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. భారత్ 18–27తో పరాజయం చవిచూసింది. 1990లో బీజింగ్ ఆతిథ్యమిచ్చిన ఏషియాడ్‌లో తొలిసారి ఈ గ్రామీణ క్రీడను చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నాలుగేళ్లకోసారి ఎదురులేని భారత జట్టు స్వర్ణం సాధిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ విజయవంతమైన చరిత్రకు చుక్కెదురైంది. 28 ఏళ్ల స్వర్ణ భారతానికి కాంస్యమే దిక్కయింది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ఇరాన్ ఈసారి బదులు తీర్చుకుంది.
ఇరాన్‌తో సెమీస్‌లో ఆరంభంలో భారత ఆటగాళ్లు బాగానే ఆడారు. 6–4తో జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చారు. కానీ ఇరాన్ రైడర్లు, డిఫెండర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చారు. అంతే భారత్ ఆలౌటైంది. విరామానికి 9–9తో సమంగా ఉన్న స్కోరు వెనుకబడుతూ వచ్చింది. ఇరాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ప్రొకబడ్డీ (పీకేఎల్) హీరోలు అజయ్ ఠాకూర్, ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, దీపక్ నివాస్ హుడాలు జీరోలయ్యారు. ఇరాన్ ఆటగాళ్లు మిఘాని, అత్రాచలి భారత రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. రాహుల్ చౌదరి రైడింగ్‌లో మెరిసినా... ఇరాన్ జోరుముందు అది ఏమాత్రం సరిపోలేదు. దీంతో డిఫెండింగ్ చాంపియన్ భారత్ స్కోరు పరంగా చూసినా భారీ తేడాతో ఓడింది.