Kabaddi Team
-
ఆసియాక్రీడల్లో భారత్ రికార్డు.. 100 పతకాలు! ఇదే తొలిసారి
చైనా వేదికగా జరగుతున్న ఆసియాక్రీడల్లో భారత్ సరి కొత్త రికార్డు సృష్టించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే తొలి సారి 100 పతకాల మార్క్‌ను భారత్ అందుకుంది. తాజగా కబడ్డీలో మహిళల జట్టు గోల్డ్‌మెడల్ సాధించడంతో.. భారత్ ఈ ఘనత సాధిచింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ తుది పోరులో చైనీస్ తైపీ జట్టును 26-25తో భారత్ ఓడించింది. దీంతో భారత మహిళల కబడ్డీ జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంది. కాగా శనివారం ఒక్క రోజే భారత్ మూడు బంగారు పతకాలు సాధించింది. రెండు ఆర్చరీలో రాగా.. మరో స్వర్ణ పతకం కబడ్డీలో వచ్చింది. ఇక మొత్తంగా ఇప్పటి వరకు 100(25 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. చదవండి: Asian Games 2023: అదరగొడుతున్న ఆర్చర్లు.. భారత్ ఖాతాలో మరో రెండు గోల్డ్ మెడల్స్ -
కనకం కాదు కంచు...
జకార్తా: భారత పురుషుల కబడ్డీకి ఆసియా క్రీడల్లో అసాధారణ రికార్డుంది. కానీ ఈ ‘కూత’ ఈసారి ‘కనకం’ దాకా పెట్టలేకపోయింది. సెమీస్‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత పురుషుల జట్టుకు ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. భారత్ 18–27తో పరాజయం చవిచూసింది. 1990లో బీజింగ్ ఆతిథ్యమిచ్చిన ఏషియాడ్‌లో తొలిసారి ఈ గ్రామీణ క్రీడను చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నాలుగేళ్లకోసారి ఎదురులేని భారత జట్టు స్వర్ణం సాధిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ విజయవంతమైన చరిత్రకు చుక్కెదురైంది. 28 ఏళ్ల స్వర్ణ భారతానికి కాంస్యమే దిక్కయింది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ఇరాన్ ఈసారి బదులు తీర్చుకుంది. ఇరాన్‌తో సెమీస్‌లో ఆరంభంలో భారత ఆటగాళ్లు బాగానే ఆడారు. 6–4తో జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చారు. కానీ ఇరాన్ రైడర్లు, డిఫెండర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చారు. అంతే భారత్ ఆలౌటైంది. విరామానికి 9–9తో సమంగా ఉన్న స్కోరు వెనుకబడుతూ వచ్చింది. ఇరాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ప్రొకబడ్డీ (పీకేఎల్) హీరోలు అజయ్ ఠాకూర్, ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, దీపక్ నివాస్ హుడాలు జీరోలయ్యారు. ఇరాన్ ఆటగాళ్లు మిఘాని, అత్రాచలి భారత రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. రాహుల్ చౌదరి రైడింగ్‌లో మెరిసినా... ఇరాన్ జోరుముందు అది ఏమాత్రం సరిపోలేదు. దీంతో డిఫెండింగ్ చాంపియన్ భారత్ స్కోరు పరంగా చూసినా భారీ తేడాతో ఓడింది. -
నా ప్రాణాలకు ముప్పుంది.. సెల్ఫీ వీడియో వైరల్
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్ సెల్ఫీ వీడియో తీసుకుని అందుకు గల కారణాలు వెల్లడించాడు. అయితే పురుగుల మందు తాగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలిలా.. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నాడని శ్రీకాంత్ ఆరోపించారు. ‘నా మీద కోపంతో క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు. టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారు. కబడ్డీ ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్న వీరలంకయ్యకు కేఈ ప్రభాకర్ అండగా ఉన్నారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. నా మరణంతోనైనా క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ’సెల్ఫీ వీడియోలో శ్రీకాంత్ పలు ఆరోపణలు చేయడం ఏపీ కబడ్డీ అసోసియేషన్‌లో అలజడి రేపుతోంది. -
కబడ్డీ ‘పసిడి’ కూత...
భారత మహిళల జట్టుకు స్వర్ణం ఆసియా బీచ్ క్రీడలు డా నాంగ్ (వియత్నాం): కబడ్డీలో మరోసారి తమ ఆధిపత్యం నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు ఆసియా బీచ్ క్రీడల్లో వరుసగా ఐదోసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. థాయ్‌లాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 41-31 పాయింట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. 2008 నుంచి ఇప్పటివరకు ఆసియా బీచ్ క్రీడల్లో భారత మహిళల జట్టు ఖాతాలోనే కబడ్డీ స్వర్ణం చేరింది. ఈ ఐదుసార్లూ ఫైనల్లో థాయ్‌లాండ్‌పైనే భారత్ నెగ్గడం విశేషం. కారంపూడి గాయత్రి కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ జట్టులో కోడెల వర మాణిక్య దుర్గ, పాయల్ చౌదరీ, పింకీ, సాక్షి కుమారి, ఆంథోనియమ్మ సవరిముత్తు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఫైనల్లో భారత్‌కు ఆరంభంలో కాస్త గట్టిపోటీనే ఎదురైంది. విరామ సమయానికి భారత్ 18-17తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధభాగంలో భారత్ మెరుగ్గా ఆడి 23 పారుుంట్లు స్కోరు చేసి, 14 పాయింట్లు సమర్పించుకొని విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుత ఆసియా బీచ్ క్రీడల్లో భారత్‌కిదే తొలి స్వర్ణం కావడం విశేషం. మరోవైపు భారత పురుషుల కబడ్డీ జట్టుకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో భారత్ 28-30తో పాకిస్తాన్ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. కురాష్ (రెజ్లింగ్ పోలికలున్న క్రీడ) ఈవెంట్లో భారత్‌కు అమీషా టోకస్ రజతం అందించింది. 70 కేజీల విభాగం ఫైనల్లో ఎన్గుయెన్ లాన్ (వియత్నాం) చేతిలో అమీషా ఓడిపోయింది. బీచ్ బాడీబిల్డింగ్ 158 సెంటీమీటర్ల విభాగంలో మనోజ్ కుమార్ మజుందార్ భారత్‌కు కాంస్యాన్ని అందించాడు. ఇప్పటివరకు ఈ క్రీడల్లో భారత్ ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు నెగ్గి 15వ ర్యాంక్‌లో ఉంది. -
జిల్లా సీనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్ : సామర్లకోట(తూర్పుగోదావరి)లో అక్టోబరు 6 నుంచి 9వ తేదీ వరకూ జరిగే ఏపీ స్టేట్ సీనియర్ కబడ్డీ మీట్లో పాల్గొనే జిల్లా జట్లను ఆదివారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎంపిక చేశారు. ఎంపికైన జట్లకు ఈనెల 10 నుంచి కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తెలిపారు. పురుషుల జట్టు : టి.బసవయ్య (కెప్టెన్, ఎక్సైజ్ కానిస్టేబుల్), ఎన్.నాగార్జున (ఇన్‌కం ట్యాక్స్), ఎంసీహెచ్ వెంకటేశ్వరరావు (ఈఎస్ఐ), సీహెచ్ మనోజ్‌కుమార్ (సీఆర్పీఎఫ్), జె.అంకాలు (ఉయ్యూరు, ఏజీఎస్‌జీఎస్), కె.బాలాజీ (తాడిగడప), ఎంవీ నరేంద్ర (ఏజీఎస్‌జీఎస్), ఎం.చినబాబు (సెయింట్ జాన్స్ హైస్కూల్, విజయవాడ), జి.రఘురామ్, జి.నరేష్ (బుడవాడ), పి.సుధాకర్‌రావు (పెనుగంచిప్రోలు), డి.హనుమంతరావు (ఏఎన్‌యూ క్యాంపస్), వి.ప్రభుకరుణ (నాగాయలంక), ఎస్.మోహనకృష్ణ (విజయవాడ), కె.రవిబాబు (ఏపీ పోలీస్, విజయవాడ), బి.సుధీర్ (ఉప్పులూరు) ఎంపికయ్యారు. కోచ్‌గా కె.బాలస్వామి (ఉయ్యూరు జెడ్పీ స్కూల్ పీఈటీ), మేనేజర్‌గా వి.వెంకటేశ్వరరావు (పీఈటీ జెడ్పీస్కూల్, మొవ్వ) వ్యవహరిస్తారు. మహిళా జట్టు : ఎండీ నసీమా సుల్తానా (కెప్టెన్, గన్నవరం), ఎం.నవ్య, ఎన్.తిరుపతమ్మ (నాగాయలంక), ఎం.మరియమౌనిక (ఎస్సీ రైల్వే సికింద్రాబాద్), కేఎల్వీ రమణ (కోడూరు), పి.దేవి, బి.ఎస్తేర్‌రాణి, వి.యశస్విని (ఉయ్యూరు, ఏజీఎస్‌జీఎస్), డి.సునీత (కేవీఆర్ కళాశాల, నందిగామ), వి.రమణ (పీవీపీ సిద్ధార్థ కళాశాల, కానూరు), కె.కోటేశ్వరమ్మ (ఎస్వీఎల్ క్రాంతి కళాశాల, అవనిగడ్డ), డి.వెంకటలక్ష్మి (ఏజీఎస్‌జీఎస్), వి.ప్రీతి (కపిలేశ్వరపురం), బి.దుర్గాభవాని (తాడంకి), జి.శిరీష (ఇబ్రహీంపట్నం), కె.భార్గవి (తాడంకి, జెడ్పీ హైస్కూల్), ఎ.చిన్మయి శ్రీజా (కానూరు), కె.ప్రత్యూష (నందిగామ) ఎంపికయ్యారు. కోచ్‌గా జి.రమేష్ (తాడంకి జెడ్పీ హైస్కూల్ పీఈటీ), ఎ.సీతాకుమారి (ఏపీఎస్ఆర్జేసీ నందిగామ పీడీ) వ్యవహరిస్తారు. -
బలి వెరీ గుడ్!
జ్ఞాపకం చల్.. కబడ్డీ.. కబడ్డీ... కమ్ముకొచ్చెరా కాపుకొచ్చెరా.. ఆచ్‌తూచ్.. ఆచ్‌తూచ్.. బల్జింగన్నా.. బల్జింగన్నా... స్కూళ్లో చదివే ప్పుడు కబడ్డీ కబడ్డీ అంటూ ఎక్కువసేపు గస ఆపుకోలేక నోటికి ఏదొస్తే అది అనేసేవాళ్లం. మా కబడ్డీ టీమ్‌కి మంచి రిప్యుటేషనే ఉండేది. ఓడలేదని కాదు. అత్యధిక గెలుపు మాఖాతాలోనే ఉండేది. ప్రేయర్ కన్నా ముందు వచ్చి కబడ్డీ ఆడి, మట్టి కొట్టుకుపోయిన తెల్ల చొక్కాలపై చింత బరికెలతో హెడ్మాస్టర్ ‘బలిగుడు’ ఆడినా బాధ ఉండేది కాదు. మా జిల్లా (వైఎస్సార్ కడప)లో కొన్ని చోట్ల ఈ క్రీడను బలిగుడు అని కూడా అంటారండోయ్. సాయంత్రమైతే రైల్వే క్వార్టర్స్ నీళ్ల ట్యాంకు పక్కన ఖాళీ జాగాలో రాత్రి పది దాకా ఒకోసారి అర్ధరాత్రిళ్లు కూడా బలిగుడు ఆడేదానికి, చూసేదానికిపెళ్లయినోళ్లు, కానోళ్లు, ముసలీ ముతకా అందరూ రెడీ. చూసేవాళ్లలో మహిళలు కూడా ఉండేవారు. ‘ఆమె ఇంట్యోడు (మొగుడు) ఎట్లా ఆడ తాండో సూడాల కదా’ అని ఒకరు... ‘ఓమ్మీ ఆయమ్మి మొగుడు బో ఆన్యాడు లే. దూరి అట్ట పట్టుకుండ్యా. పట్టు పట్టుకోడం ఇంగ ఇడిసిపెట్ల్యా’ అని ఇంకొకరు. ఒక్కోసారి గొడవలై పంచాయితీలు కూడా అయ్యేవి.అలాంటి నా ఫేవరేట్ కబడ్డీకి గోల్డెన్ డేస్ వస్తాయని, అదీ తారలు దిగివచ్చి కబడ్డీ ఆడేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. నా పల్లె ఆట... బుల్లి తెరపై మల్టీ కలర్ డ్రెస్సుల్లో కండరగండలు ఉడుంపట్టు పట్టేస్తుంటే ఆహా క్యా బాత్‌హై! టీవీలో క్రికెట్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, రెజ్లింగ్ మాత్రమే చూసే మావాడు కబడ్డీ చూస్తుంటే వింత అను భూతికి లోనయ్యా. లేకపోతే ఏంటండీ క్రికెట్ మాయలో పడి కూర్చున్నచోటు నుంచి లేవకుండా ఊబకాయులై, బద్దకస్తులై, కార్పొరేట్ చదరంగంలో పావులైన పిల్లలు.. కబడ్డీ కబడ్డీ అంటుంటే గుండెలు ఉప్పొంగవా మరి! ‘పల్లే కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల’ అని కుమిలి పోతున్న నేను కనీసం కబడ్డీతోనయినా పల్లెను గుర్తు పెట్టుకుంటారని, మూలాలను మరిచిపోరని సంబరపడు తున్నా. గోడలకు వేలాడుతున్న క్రికెట్ దేముళ్ల పక్కన కబడ్డీ ఇష్టదైవాలు తొడగొడతారని గట్టి ఇదిగానే ఉన్నా. పల్లె జీవనాడి మళ్లీ జీవం పోసుకుంటుందని నమ్ముతున్నా. తొడగొట్టి ప్రత్యర్థికి సవాలు విసిరే అసలు సిసలు గ్రామీణ ఆట... దమ్మున్న ఆట... నా కబడ్డీకి కార్పొరేట్ సొబగులు అద్దిన వారందరికీ హృదయ పూర్వక సలామ్! - ఎం.జి.నజీర్