
‘పట్టు’ వదలని పోరాటం!
► ఆస్ట్రేలియా తరఫున రియోకు అర్హత సాధించిన భారత రెజ్లర్ వినోద్
► మృత్యువు అంచునుంచి బయటపడి
► ఒలింపియన్‌గా ఎదిగిన వైనం
దాదాపు పదిహేనేళ్ల క్రితం ఆ టీనేజ్ రెజ్లర్ అప్పుడప్పుడే జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే ఇతని ఎదుగుదల చూసిన మరో ఆటగాడి తండ్రి కుర్రాడిపై పగను పెంచుకున్నాడు. టోర్నమెంట్‌లో ఆడటం కోసం మరో రాష్ట్రానికి వెళుతున్న సమయంలో మత్తు మందు ఇచ్చి క్రూరంగా రైల్లోంచి తోసేశాడు. అడవిలో పడిపోయిన ఆ అబ్బాయి చావుకు చేరువగా వెళ్లి అదృష్టవశాత్తూ బతికిపోయాడు.
అయితే ఆ రెజ్లర్ అంతటితో ఆగిపోలేదు. ఏడాది పాటు మంచంపైనే ఉన్నా తన పోరాటం ఆపలేదు. తనకు తగిలిన రాళ్లను పునాదిగా మార్చుకొని మరింత ఎదిగాడు. క్రీడా ప్రపంచమంతా పాల్గొనాలని కలలుగనే ఒలింపిక్స్‌లో అతను సగర్వంగా అడుగు పెట్టబోతున్నాడు. ఆస్ట్రేలియా తరఫున రియో బరిలోకి దిగనున్న 31 ఏళ్ల భారత రెజ్లర్ వినోద్ కుమార్ విజయ గాథ ఇది. ఏ సినిమా స్టోరీకి తగ్గని మలుపులు ఉన్న వీర కథ ఇది.
సాక్షి క్రీడా విభాగం :- న్యూస్ పేపర్ హ్యాకర్... కొరియర్ బాయ్... ఫ్యాక్టరీలో ప్యాకేజ్ బాయ్... బార్‌లో బౌన్సర్... బతుకుతెరువు కోసం వినోద్ కుమార్ ఆస్ట్రేలియాలో చేయని పని లేదు. మన తెలుగు సినిమాల్లో హీరోలా ఒక్కపాటలోనే అతను ఐశ్వర్యవంతుడిలా మారిపోలేదు. ఇంగ్లీష్ భాషలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దేశం కాని దేశం వెళ్లి ఒలింపియన్‌గా ఎదగడం అసాధారణం. అతని జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆస్ట్రేలియాలో ఉన్న ఆరేళ్లలో అతను తనకు తెలిసిన ఒకే విద్య కుస్తీనే నమ్ముకున్నాడు. ఉదయం, సాయంత్రం ఎలాంటి పని చేసినా రెజ్లింగ్‌పై మాత్రం ప్రాణం పెట్టాడు. అదే అతడి జీవితాన్ని మార్చింది.
సుశీల్, యోగేశ్వర్‌లతో కలిసి...
హర్యానాలోని సోనేపట్‌కు చెందిన వినోద్, ఆ ప్రాంతంలోని చాలా మందిలాగే రెజ్లింగ్ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఢిల్లీకి వెళ్లి ప్రముఖ కోచ్ సత్పాల్ సింగ్ వద్ద శిక్షణలో చేరాడు. సుశీల్ కుమార్, యోగేశ్వర్‌దత్‌లతో కలిసి అతను అక్కడే సాధన చేసేవాడు. జూనియర్ స్థాయిలో చురుకైన రెజ్లర్‌గా గుర్తింపు తెచ్చుకొని వేర్వేరు టోర్నీలలో రాణించడంతో వినోద్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 16 ఏళ్ల వయసులో పెద్ద స్థాయిలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న దశలో రైలు దుర్ఘటన చోటు చేసుకుంది. ఏదైనా పోటీ ఉంటే అది రెజ్లింగ్‌లోనే చూపిస్తారని అతను అనుకున్నాడు గానీ ఇలా ప్రాణాలే తీసేంత కక్ష వారిలో ఉందని అతను ఊహించలేకపోయాడు.
పోరాటం మొదలు
రైల్లోంచి పడటంతో అతని శరీరంలో అనేక భాగాలు బాగా దెబ్బతిన్నాయి. మరుసటి ఉదయం పట్టాల పక్కన రైల్వే ఉద్యోగులు చూడటంతో ప్రాణం దక్కింది. చికిత్సతో కొంత కోలుకున్నా... దాదాపు ఏడాది పాటు మంచం మీదనుంచి లేవలేకపోయాడు. తీవ్రమైన నొప్పులతో రాత్రంతా మేలుకోవాల్సి వచ్చేది. బతికితే చాలనే ఇలాంటి స్థితిలో ఇక కుస్తీ గురించి ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఈ సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి తన జీవితంపై ఆశలు పెంచుకున్నాడు. పవన్ కుమార్ అనే మాజీ రెజ్లర్ అండగా నిలవడంతో వినోద్‌లో కొత్త ఆశలు చిగురించాయి.
మళ్లీ బరిలోకి...
పూర్తి ఫిట్‌గా లేకపోయినా పవన్ సూచనతో ఢిల్లీకి చేరుకొని మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కొద్ది రోజులకు మళ్లీ ఆడగలననే నమ్మకం ఏర్పడింది. అయితే ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దేశవ్యాప్తంగా ఎక్కడ సాంప్రదాయ కుస్తీ పోటీలు (దంగల్) జరిగితే అక్కడికి వెళ్లిపోయేవాడు. అక్కడ టైటిల్స్ గెలిస్తే వచ్చే డబ్బుతో మళ్లీ ప్రాక్టీస్. అయితే ఇన్నేళ్ల విరామంలో రెజ్లింగ్ అకాడమీలో చాలా మంది ఆటగాళ్లు ఎదిగిపోవడంతో తాను అక్కడ ఏమీ చేయలేనని అర్థమైంది. మరో వైపు తనపై హత్యాప్రయత్నం చేసినవారిపై కేసు పెట్టినా అవి సుదీర్ఘ కాలం సాగాయి. దాంతో దేవుడే చూసుకుంటాడు... అంటూ కేసు వెనక్కి తీసుకున్నాడు. ఇది అతని కుటుంబ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో విసిగిపోయి ఎక్కడికైనా వెళ్లిపోదామని అనుకున్న సమయంలో పవన్ కుమారే మళ్లీ ఆదుకున్నాడు. రెజ్లర్లకు మంచి అవకాశం ఉందంటూ తనకు ఉన్న పరిచయాలతో వినోద్‌ను ఆస్ట్రేలియా పంపించాడు.
కంగారు కంగారుగా...
ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత భాష రాకపోవడంతో పాటు డబ్బులు లేకపోవడంవంటి అనేక సమస్యలు వినోద్‌ను చుట్టుముట్టాయి. దాంతో ఏదైనా ఉద్యోగం కావాల్సిందేనంటూ పేపర్ బాయ్‌గా చేరాడు. ఎక్కువ డబ్బుల కోసం ఉదయం పూటనే నడుస్తూ దాదాపు 800 ఇళ్లకు పేపర్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేందుకు భారత్‌లో చేసిన అప్పులను మెల్లగా తీర్చుకుంటూ పోయాడు. మెల్‌బోర్న్‌లో స్థానిక క్లబ్ సహకరించడంతో రెజ్లింగ్‌పై పూర్తి స్థాయి దృష్టి పెట్టాడు. ఏ ఉద్యోగం చేసినా తన ప్రాక్టీస్‌కు ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. ఆస్ట్రేలియాలో వివిధ స్థాయిలలో వరుస విజయాలు దక్కడంతో పాటు ఆరు సార్లు జాతీయ చాంపియన్‌గా నిలవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. గత రెండేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పలు పతకాలు సొంతం చేసుకున్న వినోద్... ఏప్రిల్‌లో అల్జీరియాలో జరిగిన ఆఫ్రికా/ఓషియానియా క్వాలిఫయర్స్ పోటీల్లో రజతం సాధించి ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. గ్రీకో రోమన్ 66 కేజీల విభాగంలో అతను పోటీ పడతాడు. 2010 నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్న అతనికి ఏడాది క్రితమే పౌరసత్వం దక్కింది.
అమ్మ లేకుండా...
వినోద్ తండ్రి చాలా కాలం క్రితమే చనిపోగా... రెండేళ్ల క్రితం తన సొంత ఊరులో తల్లి జన్నోదేవిని కలిసొచ్చాడు. ఆ తర్వాతనుంచి ప్రాక్టీస్‌లో బిజీ కావడంతో ప్రతీ వారాంతంలో ఫోన్ చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఏప్రిల్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాక ‘అమ్మా... చాలా మంది ఒలింపిక్స్ వెళుతున్నారంట. నువ్వెప్పుడు వెళతావురా అని అడిగేదానివి. ఇప్పుడు నీ కొడుకు కూడా ఒలింపియన్ అయ్యాడని గర్వంగా చెప్పుకో’ అని ఫోన్ చేయడంతో ఆమె ఎంతో సంతోషంతో ఊరంతా చాటింపు వేసింది. అయితే రెండు వారాల క్రితమే అకస్మాత్తుగా చనిపోయిన ఆ అమ్మకు ఇప్పుడు కొడుకును రియో వేదికపై చూసే అదృష్టం లేదు!