కామన్వెల్త్ స్వర్ణ పతకం అపహరణ
మెల్బోర్న్: దాదాపు పది సంవత్సరాల క్రితం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్యూజీ)లో టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో భారత క్రీడాకారుడు దత్తా సాధించిన స్వర్ణ పతకం అపహరణకు గురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న దత్త తన పసిడి పతకం దొంగిలించబడినట్లు మెల్ బోర్న్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 12వ తేదీన మూనీ పాండ్స్ లోని తన నివాసంలో ఆ పతకం అపహరించబడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ విషయాన్ని తన సహచర ఆటగాళ్లకు తెలియజేయగా, వారు చాలా అసంతృప్తి చెందినట్లు దత్తా తెలిపాడు. ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే టేబుల్ టెన్నిస్ పై మక్కువ పెంచుకున్న దత్తా తరువాత భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, ప్రస్తుతం అతను మెల్ బోర్న్ లోని వెల్ నెస్-టేబుల్ టెన్నిస్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ పతకాన్ని బంగారు వస్తువుగా భావించి మాత్రమే అపహరించి ఉంటారని దత్తా తెలిపాడు. ఇది మార్కెట్ లో ఎటువంటి ఆర్థికప్రయోజనాన్ని చేకూర్చదని పేర్కొన్నాడు. ఆ పతకాన్ని తిరిగి పొందితే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదని దత్తా పేర్కొన్నాడు. 2006లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది.