విదేశీ పర్యటనల్లో కొత్త రికార్డులను లిఖిస్తున్న విరాట్ కోహ్లి సేనకు... మరో ఘనతను తమ ఖాతాలో వేసుకునే అరుదైన సందర్భం వచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించిన ఊపును కొనసాగిస్తూ... న్యూజిలాండ్ గడ్డపై ఓటములతో కూడిన గత చరిత్రను సవరించేందుకు చక్కటి అవకాశం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో... మిగతా అన్నిచోట్ల కంటే కఠిన పరీక్షకు నిలవాల్సి ఉంటుంది. పరిస్థితులకు తోడు సొంతగడ్డపై ఒక పట్టాన మింగుడుపడని కివీస్‌ను ఢీకొట్టనుండటమే దీనికి కారణం. వీటన్నిటిని అధిగమించి, తుది జట్టు కూర్పు సమస్యలకూ పరిష్కారం కనుగొంటే కోహ్లి సేన తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ప్రపంచ కప్‌నకు వెళ్లేందుకు వీలుంటుంది. బలాబలాలరీత్యా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నా, ఆతిథ్య జట్టును ఎదుర్కొనడం టీమిండియాకు సవాలే. ప్రత్యర్థి ఫామ్ కూడా అత్యున్నతంగా ఉన్నందున రానున్న సిరీస్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
నేపియర్: గత ఏడాది కాలంలో వన్డేల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించి, ఇంగ్లండ్‌లో త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్న టీమిండియాకు... న్యూజిలాండ్‌లో తమ పేలవ రికార్డును చెరిపేసే వీలు చిక్కింది. ప్రపంచకప్ ముంగిట చివరి విదేశీ సవాల్ కూడా అయిన కివీస్ పర్యటనకు నేటి నుంచి తెరలేవనుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ నేపియర్‌లో జరుగనుంది. చల్లటి వాతావరణంలో సీమ్, స్వింగ్, బౌన్స్ కలగలిసిన పిచ్‌లపై బౌల్ట్, సౌతీ వంటి పేసర్లకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో కూడిన భారత టాపార్డర్‌కు ఆసక్తికర సమరం సాగడం ఖాయం. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్... టీమిండియా బౌలర్ల సత్తాకు సవాల్ విసరనున్నారు.
ఆ ముగ్గురిలో ఒకరు...
గత వారం ఆస్ట్రేలియాపై చివరి వన్డే ఆడిన జట్టు నుంచి ఒక మార్పుతో భారత్ తొలి మ్యాచ్ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ టాప్–3లో రోహిత్, ధావన్, కోహ్లి పోగా నంబర్–4గా మళ్లీ ధోనినే రావొచ్చు. లేదంటే దినేశ్ కార్తీక్ వస్తాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి కేదార్ జాదవ్‌ను ముందుగానూ పంపొచ్చు. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి వీరెంతవరకు నిలుస్తారో చూడాలి. పేస్ ఆల్‌రౌండర్ స్థానం విజయ్ శంకర్‌దే. ఆసీస్‌పై ఆరు వికెట్ల ప్రదర్శనతో చహల్ తొలి స్పిన్నర్ బెర్త్ కొట్టేశాడు. రెండో స్పిన్నర్‌గా జడేజా, కుల్దీప్‌లలో ఒకరిని ఎంచుకోవడమా? లేక మూడో పేసర్‌గా ఖలీల్ అహ్మద్‌ను దింపడమా? అని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. గత పర్యటనలో విఫలమైన ప్రధాన పేసర్లు భువనేశ్వర్, షమీ ఈసారి మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించాలి. చిన్న మైదానం కాబట్టి కివీస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడం ముఖ్యం.
సమరోత్సాహంతో కివీస్
ఇటీవల శ్రీలంకపై మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉంది న్యూజిలాండ్. గప్టిల్, మున్రో దూకుడుకు పేరుగాంచిన ఓపెనర్లు. విలియమ్సన్, రాస్ టేలర్, లాథమ్‌లతో మిడిలార్డర్ పటిష్ఠంగా ఉంది. నికోల్స్ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. ఈ బ్యాటింగ్ ఆర్డర్‌ను పడగొట్టడం టీమిండియాకు పెద్ద పనే. పేస్ ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ ధాటిగా ఆడతాడు. స్పిన్ ఆల్‌రౌండర్ సాన్‌ట్నర్‌ను తీసుకుంటే ఇష్ సోధికి తోడుగా ఉంటాడు. ప్రధాన పేసర్లు టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌లతో పాటు మూడో పేసర్‌గా ఫెర్గూసన్, బ్రాస్‌వెల్‌లలో ఒకరికి చోటు దక్కుతుంది.
పిచ్, వాతావరణం
మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్ మైదానం చిన్నది. సహజంగా ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా గతంలో ఇక్కడ రెండు వన్డేలు రద్దయ్యాయి. తర్వాత ఆ సమస్యను చక్కదిద్దారు. 2015 ప్రపంచ కప్ అనంతరం ఈ మైదానం మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లి (కెప్టెన్), ధోని, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా/కుల్దీప్ యాదవ్/ఖలీల్ అహ్మద్, షమీ, భువనేశ్వర్, చహల్.
న్యూజిలాండ్: గప్టిల్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్/సాన్‌ట్నర్, సౌతీ, ఫెర్గూసన్/బ్రాస్‌వెల్, బౌల్ట్, సోధి.
►ఉదయం గం.7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment