
జోరు కొనసాగించాలి
►నేటినుంచి శ్రీలంకతో భారత్ తొలి టెస్టు
►హార్దిక్ పాండ్యా అరంగేట్రం!
►సోనీ సిక్స్‌లో ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం
సరిగ్గా రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లి తొలిసారి పూర్తి స్థాయి కెప్టెన్ హోదాలో శ్రీలంకపైనే టెస్టు సిరీస్ ఆడాడు. అయితే తొలి టెస్టులోనే జట్టుకు షాక్ ఎదురైనా ఆ తర్వాత అప్రతిహతంగా దూసుకెళ్లింది. ఎంతలా అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా జట్టు ఆడిన 23 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడింది. దీంతో అటు జట్టు నంబర్‌వన్‌గానూ నిలిచింది. ఇక స్వదేశంలో జరిగిన సుదీర్ఘ టెస్టు సీజన్ అనంతరం భారత క్రికెట్ జట్టు నాలుగు నెలల పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితమైంది. ఇప్పుడు మరోసారి శ్రీలంకపై మూడు టెస్టుల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఈసారి గాలే టెస్టు ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అటు జింబాబ్వేతో వన్డే సిరీస్ కోల్పోయి కాస్త కష్టంగానే ఏకైక టెస్టును దక్కించుకున్న లంక తమకన్నా పటిష్టమైన భారత్‌ను దీటుగా ఎదుర్కోవాలని భావిస్తోంది.
గాలే: విరాట్ కోహ్లి నేతృత్వంలో దూకుడు మీదున్న భారత జట్టు కాస్త విరామం తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ ఆడేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి (బుధవారం) నుంచి గాలేలో తొలి టెస్టు జరుగనుంది. స్వదేశంలో జరిగిన గత సీజన్‌లో భారత్ చెలరేగింది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో 13 టెస్టులు జరగ్గా 10 విజయాలతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఇదే జోరుతో ప్రపంచ నంబర్‌వన్ జట్టు హోదాతో భారత్ మరో కొత్త సీజన్‌ను ఆరంభించనుంది. అయితే 2015 పర్యటనలో ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో భారత్ బోల్తా పడింది. అయితే ఆ తర్వాత జరిగిన రెండు టెస్టులను తన ఖాతాలో వేసుకుంది. క్రితం సారి పర్యటనలో టీమ్ డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి ఈసారి ప్రధాన కోచ్‌గా జట్టుకు మార్గదర్శకంగా ఉండనున్నారు. ఇక కీలక ఆటగాళ్ల దూరం కావడంతో బలహీనంగా కనిపిస్తున్న ఆతిథ్య జట్టు ఏమేరకు భారత్‌ను నిలువరిస్తుందో చూడాలి.
పటిష్టంగా భారత్
శ్రీలంకతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ భారత జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. జ్వరం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయినా జట్టు ధీమాతోనే ఉంది. అభినవ్ ముకుంద్, శిఖర్ ధావన్ జట్టు ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. మిడిలార్డర్‌లో పుజారా, కోహ్లి, రహానే, సాహాలతో సూపర్‌గా ఉంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో దూసుకెళుతున్న హార్దిక్ పాండ్యా అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే రోహిత్ ఆడేది అనుమానమే. రెండేళ్ల క్రితం ఇక్కడ భారత్ ఐదుగురు బౌలర్లతో దిగి ఫలితం చెల్లించుకుంది. నాలుగో ఇన్నింగ్స్‌లో హెరాత్‌ను ఎదుర్కొనే సత్తా లేకుండా పోయింది. మరోసారి కోహ్లి అదే నిర్ణయం తీసుకుంటే అశ్విన్‌తో పాటు కుల్దీప్ కూడా జట్టులో ఉంటాడు.
సమస్యలతో లంక
కీలక ఆటగాళ్లు దూరం కావడంతో శ్రీలంక క్రికెట్ సంధి కాలంలో ఉంది. మరోవైపు కెప్టెన్ చండిమాల్ న్యుమోనియాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్ ఓటమి వారిని వెంటా డుతోంది. అయితే ఏకైక టెస్టు నెగ్గడంతో కాస్త ఆత్మవిశ్వాసంతో ఉంది. వాస్‌ను బౌలింగ్ కోచ్‌గా తిలకరత్నేను బ్యాటింగ్ కోచ్‌గా జట్టు ఆటతీరును మెరుగుపరిచేందుకు నియమించారు. కెప్టెన్ హెరాత్ స్పిన్ బౌలింగ్ భారత్‌ను ఇబ్బందిపెట్టనుంది. జింబాబ్వేపై తను 11 వికెట్లు తీసి అదరగొట్టాడు. చండిమాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధనంజయ డి సిల్వ... గుణతిలక మధ్య నాలుగో స్థానం కోసం పోటీ ఉంది.
ధావన్, ముకుంద్‌లకు చక్కని అవకాశం
గతంలో భారత క్రికెటర్లకు ప్రత్యేకించి ఓ బిజీ సీజన్ అంటూ ఉండేది. అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా వారంతా అంతర్జాతీయ క్రికెట్‌కు అంకితమయ్యేవారు. ఆ తర్వాత సెప్టెంబర్ వరకు సొంత కార్పొరేట్ జట్లకో... క్లబ్, కౌంటీలకో ఆడేవారు. అయితే ఇదంతా గతం! కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ఆఫ్ సీజన్‌లోనూ భారత్ బిజీ అయింది. వివిధ దేశాలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు భారత్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. వెస్టిండీస్ పర్యటన ముగియగానే అప్పుడే లంక చేరి పూర్తిస్థాయి సిరీస్‌కు సిద్ధమైంది కోహ్లి సేన. రెండేళ్ల క్రితం లంకలో 2–1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు కూడా గాలేలో మొదలయ్యే టెస్టుతోనే పర్యటన ప్రారంభిస్తోంది. ఇప్పుడు శ్రీలంక బౌలింగ్, బ్యాటింగ్‌లలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. మురళీధరన్, జయవర్ధనే, సంగక్కర రిటైరై చాన్నాళ్లయినా ఇంకా ఆ స్థానాల లోటు అలాగే ఉంది. ఇక భారత్ విషయానికొస్తే రెగ్యులర్ ఓపెనర్లు మురళీ విజయ్, రాహుల్ గాయపడటంతో శిఖర్ ధావన్, ముకుంద్‌లకు ఇది మంచి అవకాశం.
ఆసీస్‌తో విఫలమైన ముకుంద్‌కు ఈ సిరీస్ చక్కని వేదిక. ధావన్ ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. కానీ టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. లంకతో బుధవారం నుంచి జరిగే తొలి టెస్టులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా లేక మరో బ్యాట్స్‌మెన్‌కు అవకాశమిస్తుందా అనేది అసక్తికరం. టెస్టులు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. దీంతో ఐదుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌తో పాటు బాగా ఆడగల సాహా అందుబాటులో ఉన్నాడు. అలాగే అశ్విన్, జడేజాలు జట్టుకు అవసరమైన పరుగులు చేయగల సమర్థులు. దీంతో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగే అంశాన్ని కోహ్లి పరిశీలించొచ్చు.
- సునీల్ గావస్కర్
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ముకుంద్, ధావన్, పుజారా, రహానే, రోహిత్/పాండ్యా, సాహా, అశ్విన్, జడేజా, ఉమేశ్, షమీ.
శ్రీలంక: హెరాత్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుశాల్ మెండిస్, గుణతిలక, మాథ్యూస్, డిక్‌వెల్లా, గుణరత్నే, పెరీరా, లాహిరు, నువాన్ ప్రదీప్.
పిచ్: తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. ఆ తర్వాత బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ.