ఏడాది కరువు తీరింది | India won a Test match | Sakshi
Sakshi News home page

ఏడాది కరువు తీరింది

Published Mon, Aug 24 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

ఏడాది కరువు తీరింది

ఏడాది కరువు తీరింది

ఏడాది దాటింది భారత్ చివరిసారి టెస్టు మ్యాచ్ గెలిచి. ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడాం. బంగ్లాదేశ్‌పై కూడా వరుణుడి వల్ల గెలవలేకపోయాం. శ్రీలంకలో తొలి టెస్టులో విజయం ముంగిట బొక్కబోర్లా పడ్డాం. టెస్టు విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూసిన భారత జట్టు ఎట్టకేలకు శ్రీలంకలో ఆ కరువు తీర్చుకుంది. అద్భుతాలు, అనూహ్యాలకు తావివ్వకుండా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంక దిగ్గజం సంగక్కర ఓటమితోనే తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించగా... భారత కెప్టెన్‌గా కోహ్లి తొలి టెస్టు విజయాన్ని రుచి చూశాడు.
 
- రెండో టెస్టులో భారత్ ఘనవిజయం  
- 278 పరుగులతో లంక చిత్తు  
- అశ్విన్‌కు 5 వికెట్లు  
- 28నుంచి మూడో టెస్టు
కొలంబో:
శ్రీలంకతో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న భారత్ వెంటనే కోలుకుంది. రెండో టెస్టులో ఆరంభంనుంచి అంది వచ్చిన ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంటూ మరోసారి చేజారకుండా జాగ్రత్త పడింది. ఫలితంగా సోమవారం ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో భారత్ 278 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 72/2తో చివరి రోజు ఆట ప్రారంభించిన లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది.

కరుణరత్నే (103 బంతుల్లో 46; 6 ఫోర్లు) పోరాటం మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (5/42) మరోసారి చెలరేగి జట్టును గెలిపించాడు. అతనికి లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/29) అండగా నిలిచాడు. ఈ గెలుపుతో భారత్ మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ శుక్రవారంనుంచి ఇక్కడి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతుంది.
 
తొలి బంతికే షాక్
చివరి రోజు పోరాడి మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలనుకున్నశ్రీలంక ఆశలు మ్యాథ్యూస్ (23) అవుట్ కావడంతోనే సన్నగిల్లాయి. ఐదో రోజు ఉమేశ్ వేసిన తొలి బంతికే కీపర్ రాహుల్ అద్భుత క్యాచ్ పట్టడంతో లంక కెప్టెన్ నిష్ర్కమించాడు. ఆ తర్వాత మిశ్రా తన ఓవర్లోనే చండీమల్ (15)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ మరింత పట్టు బిగించింది. కొద్ది సేపటికే తిరిమన్నె (11)ను అవుట్‌చేసి అశ్విన్ తానూ సంబరంలో భాగమయ్యాడు. అనంతరం లంక మిగతా వికెట్లు కోల్పోవడం లాంఛనమే అయింది. కొంత పోరాడే ప్రయత్నం చేసిన ఓపెనర్ కరుణరత్నే కూడా అశ్విన్‌కు వికెట్ అప్పగించాడు. మిశ్రా బౌలింగ్‌లో కౌశల్ అవుట్ కావడంతో ఆ జట్టు 9వ వికెట్ కోల్పోయింది.
 
ఏడు బంతుల్లోనే...
ఈ దశలో ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా జోరందుకుంది. దాంతో పది నిమిషాలు ముందుగా అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. అయితే మైదానంలోకి తిరిగి వచ్చిన తర్వాత భారత్ విజయానికి మరో ఏడు బంతులు మాత్రమే సరిపోయాయి. మిశ్రా బౌలింగ్‌లో చమీరా ఎల్బీడబ్ల్యూ కావడంతో గెలుపు టీమిండియా సొంతమైంది. ఆదివారం 21 ఓవర్లు ఆడి 2 వికెట్లకు 72 పరుగులు చేసిన లంక...చివరి రోజు 22.4 ఓవర్లు ఆడి 62 పరుగులకే మిగతా 8 వికెట్లు కోల్పోయింది.
 
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ 393.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 306.
భారత్ రెండో ఇన్నింగ్స్ 325/8 డిక్లేర్డ్.

శ్రీలంక రెండో ఇన్నింగ్స్: సిల్వ (సి) బిన్నీ (బి) అశ్విన్ 1; కరుణరత్నే (బి) అశ్విన్ 46; సంగక్కర (సి) విజయ్ (బి) అశ్విన్ 18; మ్యాథ్యూస్ (సి) రాహుల్ (బి) ఉమేశ్ 23; చండీమల్ (బి) మిశ్రా 15; తిరిమన్నె (సి) (సబ్) పుజారా (బి) అశ్విన్ 11; ముబారక్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 0; ప్రసాద్ (సి) మిశ్రా (బి) అశ్విన్ 0; హెరాత్ (నాటౌట్) 4; కౌశల్ (ఎల్బీ) (బి) మిశ్రా 5; చమీరా (ఎల్బీ) (బి) మిశ్రా 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (43.4 ఓవర్లలో ఆలౌట్) 134.
వికెట్ల పతనం: 1-8; 2-33; 3-72; 4-91; 5-106; 6-111; 7-114; 8-123; 9-128; 10-134.
బౌలింగ్: అశ్విన్ 16-6-42-5; ఉమేశ్ 7-1-18-1; ఇషాంత్ 11-2-41-1; మిశ్రా 9.4-3-29-3.
 
12     అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 12వ సారి. ఇందులో 9 సార్లు భారత్ మ్యాచ్ గెలిచింది. కేవలం 27 టెస్టుల్లోనే అతను ఈ గణాంకాలు నమోదు చేశాడు.

2     1986 (ఇంగ్లండ్‌పై) తర్వాత పరుగులపరంగా భారత్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం.

5     కోహ్లికి కెప్టెన్‌గా ఐదో టెస్టులోనే తొలి ‘విదేశీ’ విజయం దక్కింది. అజహర్ 18, కపిల్ 12 టెస్టులకు గానీ కెప్టెన్‌గా విదేశాల్లో విజయాన్ని అందించలేకపోయారు.

1     గత ఏడాది లార్డ్స్ టెస్టు (2014 జులై) విజయం తర్వాత భారత్ గెలవడం ఇదే తొలిసారి. ఈ మధ్యలో జరిగిన 9 టెస్టుల్లో టీమిండియా 6 ఓడి, 3 డ్రా చేసుకుంది.
 
పుజారాను ఆడిస్తాం
గతంలో రెండు సార్లు విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయాం. ఎవరో ఒకరనే కాకుండా ఈ విజయంలో జట్టులోని ప్రతీ సభ్యుడు తన వంతు పాత్ర పోషించాడు. అశ్విన్ బౌలింగ్‌లో దూకుడు నాకు చాలా నచ్చిం ది. కెప్టెన్‌గా తొలి గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. గాలే ఓటమి మమ్మల్ని తీవ్రంగా బాధించింది. మా బ్యాట్స్‌మెన్ సెంచరీలకంటే ప్రత్యర్థి 20 వికెట్లు తీయడమే నాకు ఎక్కువ ఆనందం.

మ్యాచ్‌లో పరిస్థితిని బట్టి మార్చుకోవడమే తప్ప ఎవరి బ్యాటింగ్ ఆర్డర్ కూడా శాశ్వతం కాదు (రహానే, రోహిత్ గురించి). రాబోయే కొన్నేళ్లు భారత్‌కు ఆడాల్సినవారు దేని కైనా సిద్ధంగా ఉండాలి. మూడో టెస్టులో రాహుల్‌తో కలిసి పుజారా ఓపెనింగ్ చేస్తాడు. అతను గతంలోనూ ఓపెనర్‌గా వచ్చాడు. కరుణ్ నాయర్‌ను ఆడించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాం.                     
-విరాట్ కోహ్లి, భారత కెప్టెన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement