పట్టు చిక్కేదెవరికో! | Thirimanne, Mathews push Sri Lanka towards first innings lead | Sakshi
Sakshi News home page

పట్టు చిక్కేదెవరికో!

Published Sun, Nov 19 2017 12:50 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

Thirimanne, Mathews push Sri Lanka towards first innings lead - Sakshi - Sakshi

ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. తొలి రెండు రోజులు అంతరాయాలతో సాగిన ఆటకు మూడో రోజు ఎలాంటి ఆటంకం కలుగలేదు. తొలుత వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత పరుగులు వచ్చాయి. మొత్తానికి ఈడెన్‌ గార్డెన్స్‌లో మూడో రోజు పర్యాటక జట్టు శ్రీలంక తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలుత భారత్‌ను 172 పరుగులకే కట్టడి చేసి... అనంతరం నిలకడగా పరుగులు సాధిస్తూ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యానికి చేరువైంది. నాలుగో రోజు కెప్టెన్‌ చండిమాల్, డిక్‌వెలా ఎక్కువసేపు క్రీజ్‌లో ఉంటే లంకకు ఈ మ్యాచ్‌పై పట్టు చిక్కే అవకాశముంది. మరోవైపు లంచ్‌లోపు లంక ఇన్నింగ్స్‌కు తెరదించి... ఆపై భారీగా పరుగులు సాధిస్తే భారత్‌కూ పట్టుబిగించే చాన్స్‌ ఉంది. దాంతో నాలుగో రోజు ఆట రెండు జట్లకూ కీలకం కానుంది.   


కోల్‌కతా: అంతరాయాల నడుమ ఆట సాగిన తొలి రెండు రోజుల్లో బంతితో ఆధిపత్యం చలాయించిన శ్రీలంక... మూడో రోజు బంతితోపాటు బ్యాట్‌తోనూ ఆకట్టుకుంది. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై పట్టు సంపాదించేందుకు అనువైన పరిస్థితులను సృష్టించుకుంది. మొదట టీమిండియాను 172 పరుగులకే కట్టడి చేసిన లంక జట్టు... తిరిమన్నె (94 బంతుల్లో 51; 8 ఫోర్లు), ఏంజెలో మాథ్యూస్‌ (94 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో మంచి స్థితిలో నిలిచింది.

మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. భారత్‌ స్కోరును సమం చేసేందుకు ఏడు పరుగుల దూరంలో నిలిచింది. కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ (13 బ్యాటింగ్‌), డిక్‌వెలా (14 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. వెలుతురు సరిగా లేని కారణంగా మూడో రోజు ఆటను గంట ముందే అంపైర్లు నిలిపివేశారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 74/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ మరో 98 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయి 172 పరుగులవద్ద ఆలౌటైంది. లంక బౌలర్లలో లక్మల్‌కు నాలుగు వికెట్లు లభించగా... గమగే, షనక, స్పిన్నర్‌ దిల్‌రువాన్‌ పెరీరాలకు రెండేసి వికెట్లు దక్కాయి.  

పుజారా అర్ధ సెంచరీ
మూడో రోజు ఆటలో గమగే వేసిన తొలి బంతిపై సింగిల్‌ తీసిన పుజారా ఆ తర్వాత హెరాత్‌ వేసిన ఓవర్లో బౌండరీ సాధించి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడు ఓవర్ల తర్వాత గమగే వేసిన అద్భుతమైన ఇన్‌కట్టర్‌ నేరుగా వికెట్లను గిరాటేయటంతో పుజారా ఇన్నింగ్స్‌కు తెరపడింది. అనంతరం వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా (83 బంతుల్లో 29; 6 ఫోర్లు), రవీంద్ర జడేజా (37 బంతుల్లో 22; 2 ఫోర్లు, ఒక సిక్స్‌) కాసేపు లంక బౌలర్లను ప్రతిఘటించారు.

ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించాక ఆఫ్‌ స్పిన్నర్‌ దిల్‌రువాన్‌ పెరీరా మూడు బంతుల వ్యవధిలో వీరిద్దరినీ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత భువనేశ్వర్‌ (13), షమీ  (22 బంతుల్లో 24; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. దాంతో ఒకదశలో 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన భారత్‌ 150 పరుగులు దాటగలిగింది. స్వదేశంలో లంకపై భారత్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2005లో చెన్నై టెస్టులో 167 పరుగులకే టీమిండియా ఆలౌటైంది.  

ఆచితూచి ఆట...
లంక బ్యాటింగ్‌ ప్రారంభం కాగానే... భువనేశ్వర్, షమీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో లంక ఓపెనర్లు ఆచితూచి ఆడుతూనే అవకాశం దొరికినపుడల్లా బౌండరీలు సాధించారు. అయితే షమీ బౌలింగ్‌లో ఎల్బీపై రివ్యూ కోరి విజయం సాధించిన లంక... భువనేశ్వర్‌ బౌలింగ్‌లో కరుణరత్నె ఎల్బీగా అవుటవ్వడంతో మళ్లీ రివ్యూ కోరింది. రివ్యూలో బంతి కరుణరత్నే ప్యాడ్‌లను తాకినట్లు తేలడంతో లంక తొలి వికెట్‌ను కోల్పోయింది.

ఏడో ఓవర్లో భువీ వేసిన అవుట్‌ స్వింగర్‌ సమరవిక్రమ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్‌ సాహా చేతుల్లోకి వెళ్లింది. దీంతో 34 పరుగుల వద్ద లంక రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన తిరిమన్నె, మాథ్యూస్‌ ఓపికగా ఆడారు. షమీ బౌలింగ్‌లో తిరిమన్నె ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను స్లిప్స్‌లో శిఖర్‌ ధావన్‌ వదిలేయడం లంకకు కలిసొచ్చింది. వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకోవడంతో టీ విరామానికి లంక 2 వికెట్లకు 113 పరుగులు సాధించింది.  

ఉమేశ్‌ జోరు...
మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించేట్లు కనబడుతున్న లంకను టీ విరామం తర్వాత ఉమేశ్‌ దెబ్బతీశాడు. 37వ ఓవర్లో ఉమేశ్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ డెలివరీ.. తిరిమన్నె బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ స్లిప్స్‌లోకి వెళ్లింది. సెకండ్‌ స్లిప్స్‌లో కోహ్లి తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకోవడంతో తిరిమన్నె ఇన్నింగ్స్‌ ముగిసింది.

39వ ఓవర్లో ఉమేశ్‌ వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మాథ్యూస్‌ షార్ట్‌ కవర్‌లో రాహుల్‌కు సులువైన క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. తిరిమన్నె, మాథ్యూస్‌ మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ చండిమాల్, వికెట్‌ కీపర్‌ డిక్‌వెలా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వెలుతురు సరిగా లేకపోవడంతో గంటముందే అంపైర్లు మూడో రోజు ఆటను నిలిపేశారు.

లంక ఖాతాలో 2 డీఆర్‌ఎస్‌లు
భారత బ్యాటింగ్‌ సమయంలో పెరీరా బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఎల్బీగా ఔటయ్యాడు. అయితే అం పైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో చండిమాల్‌ రివ్యూ కోరారు. రివ్యూలో బంతి ముందుగా ప్యాడ్‌లను ముద్దాడిన తర్వాత బ్యాట్‌ను తాకినట్లు తేలటంతో ఫలితం లంకకు అనుకూలంగా వచ్చింది. లంక తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌లో షమీ వేసిన బంతి ఓపెనర్‌ కరుణరత్నె ప్యాడ్లను తాకడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. దీంతో లంక డీఆర్‌ఎస్‌ను కోరింది. రివ్యూలో నాటౌట్‌గా తేలింది. ఆ తర్వాత కాసేపటికే భువనేశ్వర్‌ ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు.


శ్రీలంకలో ముక్కోణపు టి20 సిరీస్‌కు భారత్‌
కొలంబో: శ్రీలంక 70వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ముక్కోణపు టి20 సిరీస్‌ను నిర్వహించేందుకు లంక బోర్డు (ఎస్‌ఎల్‌సీ) సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఈ టోర్నీలో ఆతిథ్య శ్రీలంకతోపాటు భారత్, బంగ్లాదేశ్‌ పాల్గొంటాయని ఎస్‌ఎల్‌సీ వెల్లడించింది. మార్చి 8 నుంచి 20వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే నిర్వహిస్తారు. ఒక్కో జట్టు ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌ల్లో తలపడుతుంది.

20 ఏళ్ల క్రితం 50వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1998లో నిర్వహించిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. ఇందులో న్యూజిలాండ్‌ మూడో దేశంగా పోటీపడింది. ‘లంక 70 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఎస్‌ఎల్‌సీ వినతికి భారత బోర్డు సమ్మతి తెలిపింది’ అని బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి తెలిపారు. ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు తిలంగ సుమతిపళ మాట్లాడుతూ తమ వేడుకల్లో భారత్‌ పాల్గొననుండటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.  


స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) డిక్‌వెలా (బి) లక్మల్‌ 0; ధావన్‌ (బి) లక్మల్‌ 8; పుజారా (బి) గమగే 52; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) లక్మల్‌ 0; రహానే (సి) డిక్‌వెలా (బి) షనక 4; అశ్విన్‌ (సి) కరుణరత్నే (బి) షనక 4; సాహా (సి) మాథ్యూస్‌ (బి) పెరీరా 29; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) పెరీరా 22; భువనేశ్వర్‌ (సి) డిక్‌వెలా (బి) లక్మల్‌ 13; షమీ (సి) షనక (బి) గమగే 24; ఉమేశ్‌ యాదవ్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (59.3 ఓవర్లలో ఆలౌట్‌) 172
వికెట్ల పతనం: 1–0, 2–13, 3–17, 4–30, 5–50, 6–79, 7–127, 8–128, 9–146, 10–172.
బౌలింగ్‌: లక్మల్‌ 19–12–26–4, గమగే 17.3–5–59–2, షనక 12–4–36–2, కరుణరత్నే 2–0–17–0, హెరాత్‌ 2–0–5–0, దిల్‌రువాన్‌ పెరీరా 7–1–19–2.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: సమరవిక్రమ (సి) సాహా (బి) భువనేశ్వర్‌ 23; కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్‌ 8; తిరిమన్నె (సి) కోహ్లి (బి) ఉమేశ్‌ 51, మాథ్యూస్‌ (సి) రాహుల్‌ (బి) ఉమేశ్‌ 52, చండిమాల్‌ (బ్యాటింగ్‌) 13, డిక్‌వెలా (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (45.4 ఓవర్లలో 4 వికెట్లకు) 165
వికెట్ల పతనం: 1–29, 2–34, 3–133, 4–138.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 14.4–2–49–2, షమీ 13.5–5–53–0, ఉమేశ్‌ యాదవ్‌ 13–1–50–2, అశ్విన్‌ 4–0–9–0, కోహ్లి 0.1–0–0–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement