
‘రజత’ సిరిల్
* ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు తేజం
* ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: టోర్నీ ఆసాంతం అంచనాలకు మించి రాణించిన హైదరాబాద్ యువ ఆటగాడు అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ తుది సమరంలో తడబడ్డాడు. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. అయితే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో బాలుర సింగిల్స్ విభాగంలో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ సిరిల్ వర్మ 21-17, 10-21, 7-21తో ఆరో సీడ్ చియా హుంగ్ లూ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సిరిల్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే చియా హుంగ్ లూ వెంటనే తేరుకొని తన సత్తా చాటుకున్నాడు. సిరిల్ వర్మకు మరో అవకాశం ఇవ్వకుండా తర్వాతి రెండు గేమ్‌లను నెగ్గి ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా అవతరించాడు.