సేమ్... షేమ్..! | India's third worst defeat in Tests | Sakshi
Sakshi News home page

సేమ్... షేమ్..!

Published Mon, Aug 18 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

సేమ్... షేమ్..!

సేమ్... షేమ్..!

ఆఖరి టెస్టులోనూ భారత్ ఓటమిఇన్నింగ్స్ 244 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు 3-1తో సిరీస్ కైవసం‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అండర్సన్, భువనేశ్వర్ రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.ఈనెల 25 నుంచి వన్డే సిరీస్
 
ప్రాక్టీస్‌కు రాకుండా పబ్‌ల వెంట తిరిగే ఆటగాళ్ల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం..!
షికార్లు కొట్టడానికి టూరిస్టుల్లా విదేశాలకు వెళ్లే ‘స్టార్’ల నుంచి ఇంతకంటే ఏం కోరుకోగలం..!
ఆట కంటే ఇతర వ్యాపకాలపై ఎక్కువ దృష్టి పెట్టే వాళ్లు ఇంతకంటే బాగా ఎలా ఆడతారు..?
టి20ల ‘మాయ’లో టెస్టు క్రికెట్ అంటే కనీస గౌరవం చూపని క్రికెటర్లు ఇంతకంటే ఏం సాధించగలరు..?


భారత క్రికెట్ పరువు ‘థేమ్స్’లో కలిసింది. వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌ల్ని ధోనిసేన మూడో రోజే ఓడిపోయింది. అది కూడా రెండుసార్ల్లూ ఇన్నింగ్స్ పరాభవాలు. ఆటలో గెలుపోటములు సహజం. కానీ కనీసం పోరాడకుండా... ఏదో పని ముగించుకుని వెళ్లిపోయే ధోరణితో ధోనిసేన సగటు భారత క్రికెట్ అభిమాని గుండె బద్దలు చేసింది. ఓవల్‌లోనూ ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది.
 
లండన్: ‘రానురాను రాజు గుర్రం గాడిదయిందంట...’ భారత క్రికెటర్లకు ఈ నానుడి చక్కగా సరిపోతుంది. ఆర్జనలోనూ, అభిమానులను సంపాదించడంలోనూ క్రికెట్ ప్రపంచంలోనే టాప్... ఐసీసీలో ఉండే మేజర్ ట్రోఫీలన్నింటినీ గెలిచిన జట్టు... కానీ ఐదు రోజులపాటు టెస్టు మ్యాచ్ ఆడలేకపోయింది. తమకు క్రికెట్ కొత్త అనే రీతిలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మూడు రోజుల్లోనే చేతులెత్తేసింది.
 
ధోనిసేన రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన పరుగులు (242), ఇంగ్లండ్ ఒక్క ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులలో (486) సగం కూడా లేకపోవడం... కేవలం రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 90.3 ఓవర్లే బ్యాటింగ్ చేయడంతో... గత 40 ఏళ్లలో ఏనాడూ లేని అతి పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ నిలకడను చూపెట్టిన ఇంగ్లండ్ ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 244 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
 
ఓవల్‌లో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో... 338 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 29.2 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. బిన్నీ (25 నాటౌట్) టాప్ స్కోరర్. కోహ్లి (20)తో సహా మిగతా వారందరూ విఫలమయ్యారు. ఏకంగా ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ 4, అండర్సన్ 2 వికెట్లు తీశారు.
 
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116.3 ఓవర్లలో 486 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు 338 పరుగుల ఆధిక్యం దక్కింది. రూట్ (165 బంతుల్లో 149 నాటౌట్; 18 ఫోర్లు, 1 సిక్సర్) కెరీర్‌లో 5వ సెంచరీ నమోదు చేశాడు. బ్రాడ్ (37) ఫర్వాలేదనిపించాడు. ఇషాంత్ 4, అశ్విన్ 3, ఆరోన్ 2 వికెట్లు తీశారు. రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అండర్సన్, భువనేశ్వర్‌లకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరుజట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఈనెల 25 నుంచి జరుగుతుంది.
 
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 148
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 486.
భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) అండర్సన్ 2; గంభీర్ రనౌట్ 3; పుజారా (సి) బట్లర్ (బి) అండర్సన్ 11; కోహ్లి (సి) కుక్ (బి) జోర్డాన్ 20; రహానే (సి) బ్యాలెన్స్ (బి) బ్రాడ్ 4; ధోని (సి) రాబ్సన్ (బి) వోక్స్ 0; బిన్నీ నాటౌట్ 25; అశ్విన్ (సి) బెల్ (బి) జోర్డాన్ 7; భువనేశ్వర్ (సి) బెల్ (బి) జోర్డాన్ 4; ఆరోన్ రనౌట్ 1; ఇషాంత్ (సి) అలీ (బి) జోర్డాన్ 2; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: (29.2 ఓవర్లలో ఆలౌట్) 94.
వికెట్ల పతనం: 1-6; 2-9; 3-30; 4-45; 5-46; 6-62; 7-70; 8-74; 9-84; 10-94.
బౌలింగ్: అండర్సన్ 8-3-16-2; బ్రాడ్ 10-2-22-1; వోక్స్ 7-0-24-1; జోర్డాన్ 4.2-0-18-4.
 
సెషన్-1: ఇంగ్లండ్ పరుగుల హోరు
385/7 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు రూట్ వెన్నెముకగా నిలిచాడు. ఇషాంత్ వేసిన రోజులో మూడో ఓవర్ తొలి బంతికి రూట్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రెండో బంతికి జోర్డాన్ (20) అవుటయ్యాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.బ్రాడ్ కూడా వేగంగా ఆడాడు. రూట్, బ్రాడ్ జోడి కేవలం 6.4 ఓవర్లలో 63 పరుగులు జోడించారు. చివర్లో స్వల్ప వ్యవధిలో బ్రాడ్, అండర్సన్ (1) అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే తడబడింది. 9 బంతుల వ్యవధిలో ఓపెనర్లు విజయ్ (2), గంభీర్ (3) అవుటయ్యారు. తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో షెడ్యూల్ కంటే కాస్త ముందుగా లంచ్‌కు వెళ్లారు.
ఓవర్లు: 11.3; పరుగులు: 101; వికెట్లు:3 (ఇంగ్లండ్)
ఓవర్లు: 6.1; పరుగులు: 9; వికెట్లు: 2 (భారత్)
 
సెషన్-2; 46 పరుగులకే సగం జట్టు...
లంచ్ తర్వాత కోహ్లి, పుజారా (11) నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అండర్సన్, బ్రాడ్ స్వింగ్‌తో బాగా ఇబ్బందిపెట్టారు. కనీసం డిఫెన్స్ చేయడానికి కూడా భయపడిన పుజారా 13వ ఓవర్‌లో అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఐదు ఓవర్ల తర్వాత రహానే (4) క్యాచ్‌ను బ్యాలెన్స్ అద్భుతంగా అందుకున్నాడు. మరో ఐదు బంతుల తర్వాత ధోని (0) కూడా వెనుదిరగడంతో భారత్ 46 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఈ సిరీస్‌లో తొలిసారి ఆత్మ విశ్వాసంతో కనబడిన కోహ్లి  అడపాదడపా బౌండరీలతో అలరించాడు.
 
బిన్నీతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివర్లో జోర్డాన్ స్వింగ్‌కు భారత్ కుదేలైంది. ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో జోర్డాన్ అద్భుతమైన లేట్ స్వింగర్‌కు కోహ్లి బలైతే... తర్వాతి ఓవర్‌లో ఐదు బంతుల వ్యవధిలో అశ్విన్ (7), భువనేశ్వర్ (4)లు అతనికే వికెట్లు సమర్పించుకున్నారు. మరో ఓవర్ తర్వాత ఆరోన్ (1) రనౌట్ అయ్యాడు. ఇషాంత్ (2)ను కూడా ఓ షార్ట్ బంతితో అవుట్ చేసిన జోర్డాన్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఓవర్లు: 23.1; పరుగులు: 85; వికెట్లు: 8
 
* ఓవరాల్‌గా భారత్‌కు ఇది మూడో అతి పెద్ద పరాజయం.
* ఇంగ్లండ్ వరుసగా మూడో సారి భారత్‌పై సిరీస్ నెగ్గి (2011, 2012, 2014) పటౌడీ ట్రోఫీని గెలుచుకుంది.
* భారత్ 6 సార్లు ఇన్నింగ్స్ 200 పరుగులకంటే ఎక్కువ తేడాతో ఓడింది. ఇందులో మూడు ఇంగ్లండ్ చేతిలోనే వచ్చాయి.
 
* భారత టెస్టు చరిత్రలో వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో, మూడు రోజుల్లోపే ఓడటం ఇదే మొదటిసారి.
* ధోని కెప్టెన్సీలో ఇదే అతి పెద్ద పరాజయం. గతంలో 2011 బర్మింగ్‌హామ్ టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ 242 పరుగులతో ఓడింది.
* టెస్టు చరిత్రలో ఒక జట్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉండి వరుసగా మూడు టెస్టులు ఓడటం 1937 తర్వాత ఇదే తొలిసారి.
*భారత్ బయట ధోనికిది 14వ టెస్టు పరాజయం.
* ఈ సిరీస్‌లో భారత్ ఐదు సార్లు ఇన్నింగ్స్‌లో 200 లోపు ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement