ధోని అండ్ కో... ఇటు చూడండి! | India's win on the England | Sakshi
Sakshi News home page

ధోని అండ్ కో... ఇటు చూడండి!

Published Sun, Aug 17 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

ధోని అండ్ కో... ఇటు చూడండి!

ధోని అండ్ కో... ఇటు చూడండి!

ఇంగ్లండ్‌లో బంతిని ముట్టుకోవడానికే ధోనిసేన ఆపసోపాలు పడుతున్న సమయంలో... భారత మహిళల జట్టు మాత్రం సంచలన ఆటతీరుతో కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడినా... తమకంటే పటిష్టమైన జట్టుపై అలవోకగా గెలిచింది. అన్నట్లు... భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు గెలవడం ఇది వరుసగా రెండోసారి. 2006లోనూ ఏకైక టెస్టులో విజయం సాధించింది. భారత పురుషుల జట్టు ఎప్పుడూ సాధించని ఘనత ఇది.

►ఇంగ్లండ్‌పై భారత్ గెలుపు
►ఏకైక టెస్టులో విజయం  
►రాణించిన మిథాలీ
వార్మ్‌స్లే: గత మూడు వారాలుగా ఇంగ్లండ్ గడ్డపై భారత పురుషుల జట్టు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అదరహో అనిపించే బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఏమాత్రం టెక్నిక్ లేకుండా ఆడుతూ పెవిలియన్ వైపు పరుగులు తీస్తున్న వైనం అందరూ చూస్తున్నదే. అయితే ఇదే సమయంలో చడీచప్పుడు లేకుండా భారత మహిళల జట్టు మాత్రం చరిత్ర సృష్టించింది. ధోని బృందం పట్టుమని పది ఓవర్లు ఆడేందుకు ఆపసోపాలు పడుతున్న గడ్డపై.. వీరు మాత్రం తలెత్తుకునే రీతిలో చెలరేగారు. ఆడింది.. ఎనిమిదేళ్ల అనంతరం తొలి టెస్టు. జట్టులో ఏకంగా ఎనిమిది మందికి అసలు టెస్టు అనుభవమే లేదు. అయినా తమకన్నా ఎన్నో రెట్లు పటిష్టమైన ఇంగ్లండ్ మహిళల జట్టును వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి ఔరా అనిపించుకున్నారు.

వరుసగా రెండు టెస్టుల్లో ధోని సేన వంద పరుగులు చేసేందుకు సగం మందికి పైగా ఆటగాళ్లను కోల్పోతే వీరు మాత్రం 92 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేయగలిగారు. పట్టుదలతో ఆడితే ఫలితం ఎలా ఉంటుందో తమ ‘సహచర జట్టు’కు రుచి చూపించారు.  కెప్టెన్ మిథాలీ రాజ్ (157 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) చక్కటి అర్ధ సెంచరీతో ముందుండి నడిపించడంతో శనివారం నాలుగో రోజు చివరి రోజు ఆటలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టును భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఈ విజయం కూడా ఓ రకంగా భారత పురుషుల జట్టుకు చెంపపెట్టు లాంటిదే. ఎందుకంటే వారు ఇప్పటిదాకా ఇక్కడ వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలిచింది లేదు. కానీ మిహ ళా జట్టు 2006లోనూ ఇంగ్లండ్‌ను ఏకైక టెస్టులో ఓడించింది. ఇప్పడు జట్టులో ఉన్న మిథాలీ, కరుణా జైన్, జులన్ గోస్వామి అప్పుడు కూడా ఆడారు.
 
ఇక 119/4 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు బరిలోకి దిగిన భారత్ 95.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 183 పరుగులు చేసింది. శనివారం విజయానికి మరో 62 పరుగులు కావాల్సి ఉండగా 31 ఏళ్ల మిథాలీ ఎలాంటి బెరుకు లేకుండా మరో రెండు సెషన్లు ఉండగానే లాంఛనాన్ని పూర్తి చేసింది. తనకు శిఖా పాండే (106 బంతుల్లో 28; 2 ఫోర్లు) విలువైన సహకారాన్ని అందించింది. ఈ జోడి 30.3 ఓవర్లు ఆడి ఐదో వికెట్‌కు 68 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించింది.
 
స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 92, భారత్ తొలి ఇన్నింగ్స్: 114, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 202
 భారత రెండో ఇన్నింగ్స్: కామిని ఎల్బీడబ్ల్యు (బి) క్రాస్ 28; మంధానా ఎల్బీడబ్ల్యు (బి) క్రాస్ 51; రౌత్ (సి) గున్ (బి) నైట్ 16; మిథాలీ నాటౌట్ 50; హర్మన్‌ప్రీత్ (సి) టేలర్ (బి) క్రాస్ 0; శిఖా పాండే నాటౌట్ 28; ఎక్స్‌ట్రాలు (బైస్ 2, లెగ్ బైస్ 6, వైడ్లు 1, నోబ్ 1) 10; మొత్తం (95.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 183.
వికెట్ల పతనం: 1-76; 2-82; 3-112; 4-115.
 బౌలింగ్: ష్రుబ్సోల్ 23-9-34-0; గున్ 19-6-40-0; క్రాస్ 25-6-42-3; ఒడెడ్రా 12-4-25-0; షివర్ 11.3-3-27-0; నైట్ 5-2-7-1.
 
 ‘ఇంగ్లండ్ జట్టు యాషెస్, ప్రపంచకప్ గెలిచింది. కాబట్టి వారిపై మేం సాధించిన ఈ విజయం చిరస్మరణీయం. 2006లో ఇక్కడ టెస్టు ఆడాక మళ్లీ ఈ ఫార్మాట్‌లో ఆడతానని అనుకోలేదు. ఇక నా కెరీర్ ఎన్నాళ్లు సాగుతుందో తెలియదు. కాబట్టి ఈ విజయం వ్యక్తిగతంగానూ సంతృప్తినిచ్చింది.’     - భారత కెప్టెన్ మిథాలీ రాజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement