మళ్లీ మువ్వన్నెల నీడలో...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు పాల్గొంటారు.. అయినా వారి చేతులో మువ్వన్నెల పతాకం కనిపించదు.. పతకాలు సాధించినా తమ దేశ ఖాతాలోకి రావు.. ఒక్కోసారి టోర్నీలు ప్రారంభమయ్యాక కూడా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటూ అథ్లెట్లకు ఛీత్కారాలు.. గత ఏడాది కాలంలో భారత్ తరఫున బరిలోకి దిగిన అథ్లెట్లకు ఎదురైన అనుభవాలివి. అయితే ఇక ఈ అవమానకర ధోరణికి చెక్ పడింది.
కళంకిత వ్యక్తుల ప్రమేయంతో పాటు కేంద్ర ప్రభుత్వ జోక్యానికి ప్రతిచర్యగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై కొనసాగుతున్న నిషేధాన్ని.... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎత్తివేసింది. తాజా ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే తిరిగి ఐఓఏ... ఒలింపిక్ ఉద్యమంలోకి అడుగుపెట్టినట్టయ్యింది. నూతన అధ్యక్షుడిగా ప్రపంచ స్క్వాష్ సమాఖ్య చీఫ్ ఎన్.రామచంద్రన్ ఎన్నికైన విషయం తెలిసిందే.
నిషేధం తొలగాలంటే తాము చెప్పిన సూచనలను అమలు చేయడంతోపాటు రాజ్యాంగ సవరణ చేసుకోవాల్సిందేనని గతంలో ఐఓసీ ఆదేశాలు జారీ చేసింది.
తదనుగుణంగా కళంకిత వ్యక్తులకు ఎన్నికల్లో పాల్గొనకుండా ఐఓఏ రాజ్యాంగాన్ని సవరించింది.
దీంట్లో భాగంగా ఈనెల 9న ఐఓసీ పరిశీలకుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి నూతన బోర్డు ఏర్పాటయ్యింది.
ఈ ఎన్నికల ఫలితాలతో పాటు సాధారణ సర్వసభ్య సమావేశం గురించి ఐఓసీ అధ్యక్షుడికి పరిశీలకులు నివేదికను అందించారు.
శీతాకాల ఒలింపిక్స్ జరుగుతున్న సోచిలో మంగళవారం ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు (ఈబీ) అడ్ హక్ సమావేశం జరిగింది.
ఎలాంటి అవినీతి మచ్చ లేని వ్యక్తులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారని, ఐఓఏ రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఎన్నికలు జరిగాయని పరిశీలకులు ఐఓసీ ఈబీ సభ్యులకు తెలిపారు.
సంతృప్తి చెందిన ఐఓసీ... ఐఓఏను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది.
దీంతో 14 నెలలుగా కొనసాగుతున్న భారత ఒలింపిక్ సంఘంపై ఉన్న నిషేధం తొలగింది.
ఈ నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో భారత అథ్లెట్లు తమ జాతీయ పతాకం కింద పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.
సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ముగ్గురు భారత ఆటగాళ్లు తమ దేశం తరఫున ఆడే వీలు చిక్కింది. ముగింపు ఉత్సవంలో వీరు భారత పతాకంతోనే పాల్గొంటారు.
ఇదే తొలిసారి
‘ఒలింపిక్ క్రీడలు జరుగుతున్న సందర్భంలో ఓ ఎన్‌ఓసీపై నిషేధం ఎత్తివేయడం ఒలింపిక్ చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది. సోచి వింటర్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఒలింపిక్ పతాకం చేతబట్టి ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వతంత్ర ఒలింపిక్ ఆటగాళ్లుగా పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక వారు తమ దేశం తరఫునే పాల్గొనవచ్చు. అలాగే ముగింపు కార్యక్రమంలో భారత పతాకాన్ని చేతపట్టుకోవచ్చు’
- ఐఓసీ
అసలేం జరిగింది...
భారత ప్రభుత్వం అమలు చేయాలనుకున్న జాతీయ క్రీడా బిల్లుకు ఐఓఏ అంగీకరించడం, కళంకిత వ్యక్తులను తమ కమిటీలో ఉంచడంతో ఐఓసీ ఆగ్రహించింది.
దీంతో 14 నెలల క్రితం.. డిసెంబర్ 4, 2012న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఐఓసీ నిషేధం విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఐఓఏ, ప్రభుత్వ ప్రతినిధులతో లాసానేలో సమావేశం కావాలని ఐఓసీ ప్రతిపాదించింది. పలుమార్లు వాయిదా పడిన అనంతరం గతేడాది మే 15న సమావేశం జరిగింది. క్రీడా మంత్రి జితేంద్ర సింగ్, షూటర్ బింద్రా కూడా హాజరయ్యారు.
ఇక్కడే ఒలింపిక్ ఉద్యమంలోకి రావాలంటే ఏం చేయాలో రోడ్ మ్యాప్‌ను జారీ చేసింది. జూలై 15లోగా తమ రాజ్యాంగాన్ని సవరించుకోవాలి.. సెప్టెంబర్ 1లోగా కొత్త ఆఫీస్ బేరర్లను నియమించుకోవాలి.. అని స్పష్టం చేసింది.
అలాగే కళంకితులు ఐఓఏ ఎన్నికలకు అర్హులు కారని ఆగస్టు 15న ప్రకటించింది. అయితే ఈ నిబంధనను ఐఓఏ తిరస్కరించింది. తమ దేశ చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటామని స్పష్టం చేసింది. శిక్ష పడినవారికే ఈ నిబంధన అమలు కావాలని సూచించింది.
కానీ పట్టు వీడని ఐఓసీ.. అక్టోబర్ 31లోగా తమ రాజ్యాంగ సవరణ ద్వారా అలాంటి వారిని తొలగించాలని, డిసెంబర్ 15లోగా తాజా ఎన్నికలు జరపాలని ఆదేశించింది. ఆ తర్వాత ఐఓసీ సూచనలన్నింటినీ ఆమోదించిన ఐఓఏ.. ఎన్నికలు కూడా జరపడంతో వివాదం ఓ కొలిక్కి వచ్చింది.
‘ఆ నిషేధం మంచే చేసింది’
‘ఏడాదికి పైగా క్రీడాకారులు, అభిమానులు జరుగుతున్న పరిణామాలపై తమ ఆందోళనను వెలిబుచ్చారు. భారత్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించాలని మా క్రీడా శాఖ కూడా లాసానేలో, ఇతర వేదికలపై కోరాం. అయితే ఇంతకాలంగా మనం సాధించిందేమైనా ఉంటే అది క్రీడలను ప్రక్షాళన చేయడం. తిరిగి ఒలింపిక్ ఉద్యమంలోకి వచ్చినందుకు ఐఓఏకు సహకరించినందుకు ఐఓసీకి అభినందనలు. ఇక ఆటగాళ్లు దేశ పతాకం కింద పోటీపడనున్నారనే విషయం సంతృప్తినిస్తోంది’
- జితేంద్ర సింగ్ (క్రీడా మంత్రి)
ఇక గర్వంగా చెబుతాను
‘సోచి క్రీడల ప్రారంభ వేడుకల్లో మేం ముగ్గురం ఒలింపిక్ పతాకం కింద నడవడం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే ఇది నా తొలి వింటర్ ఒలింపిక్స్. ఐఓసీ పతాకం కింద పోటీచేయాల్సి రావడం విచారం కలిగించింది. కానీ ఇప్పుడు భారత అథ్లెట్‌గా బరిలోకి దిగబోతున్నాను. నిజానికి ఇది నేనూహించలేదు. ఇప్పుడు నా తోటి అథ్లెట్లతో ‘నేను భారత ఆటగాడిని’ అని గర్వంగా చెబుతాను’
- హిమాన్షు (అథ్లెట్)