ఇస్లామాబాద్: క్రికెట్ అభిమానులకు ప్రపంచకప్ అంటేనే ఓ పండుగ. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక రకమైన ఉత్కంఠ. ప్రపంచకప్ గెలవకున్నా పర్వాలేదు కానీ ఈ మ్యాచ్ గెలవాలని కోరుకునే ఇరు జట్ల అభిమానులు కూడా ఉన్నారు. అయితే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు పాక్‌పై భారత్‌దే పైచేయి. క్రికెట్ విశ్వసమరంలో ఇరుజట్లు ఆరు సార్లు తలపడగా ఆరింటిలోనూ టీమిండియానే గెలుపొందింది. అయితే ప్రపంచకప్‌లో ఈ పరాజయాల పరంపరకు బ్రేక్ పడుతుందని పాక్ ప్రధాన సెలక్టర్, మాజీ సారథి ఇంజమాముల్ హక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా వచ్చేనెల 16న జరుగనున్న దాయాదుల పోరులో పాక్ పైచేయి సాధిస్తుందని ఇంజమామ్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఎంతలా అంటే ఇతర జట్లతో గెలువకున్న ఫర్వాలేదు. కానీ, ఒక్క భారత్‌పై నెగ్గాల్సిందే అని భావిస్తారు. భారత జైత్రయాత్రకు ఈసారి బ్రేక్ వేస్తామనే నమ్మకముంది. అయితే ప్రపంచకప్ అంటే కేవలం ఈ ఒక్క మ్యాచే కాదు. మిగిలినా జట్లపై కూడా గెలువాల్సి ఉంటుంది అని ఇంజమామ్ వివరించాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్, టీమిండియాలతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు సెమీస్ చేరే అవకాశం ఉందని అంచనా వేశాడు.
ఆటగాళ్లను ఎంపిక చేయడం అంత ఈజీ కాదు..
ప్రస్తుతం పాక్‌లో ఆటగాళ్ల మధ్య పోటీ ఎక్కువగా ఉందని, ఎవరి ఎంపిక చేయాలో అర్థం పరిస్థితి నెలకొందని ఇంజమామ్ పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్ లాంటి మహా సమరానికి ఆటగాళ్లను ఎంపిక చేయడమంటే సవాలేనని తెలిపాడు. ప్రస్తుతం పాక్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని, యువకులు, సీనియర్లతో జట్టు సమత్యుల్యంగా ఉందన్నాడు. ఆఫ్గనిస్తాన్ ఈ టోర్నీలో సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment