ఆ మూడు మ్యాచ్లు ధర్మశాలలో..
ధర్మశాల: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా కింగ్స్ పంజాబ్ హోం మ్యాచ్ లను ధర్మశాలలో నిర్వహించనున్నారు. దీనికి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అంగీకరించడంతో కింగ్స్ పంజాబ్ హోం గ్రౌండ్ గా ధర్మశాల ఖరారైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో కింగ్స్ పంజాబ్ హైం పిచ్ అయిన నాగ్ పూర్లో మూడు మ్యాచ్లను ఆడాల్సి ఉంది. అయితే కరవు కారణంగా మహారాష్ట్రలో మ్యాచ్‌లను తరలించాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో అక్కడ జరగాల్సిన 13 మ్యాచ్‌లను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లన్నీ తరలించాలని కోర్టు పేర్కొనడంతో ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్స్, కింగ్స్ పంజాబ్ జట్ల హోం గ్రౌండ్ లను మార్చాల్సి వచ్చింది. ఇప్పటికే పుణె సూపర్ జెయింట్స్ తన హోం గ్రౌండ్ గా విశాఖను ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ తన హోం పిచ్ గా జైపూర్ ను ఎంచుకుంది. ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో మే 1న పుణేలో జరగాల్సిన మ్యాచ్‌ను అక్కడే నిర్వహించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే అవకాశం ఉంది.