ముంబై మురిసె... | IPL 2019 Mumbai Seal the Super Over And Qualify For The Playoffs | Sakshi
Sakshi News home page

ముంబై మురిసె...

Published Fri, May 3 2019 12:31 AM | Last Updated on Fri, May 3 2019 5:58 AM

IPL 2019 Mumbai Seal the Super Over And Qualify For The Playoffs - Sakshi

సహజంగా సిక్స్‌లు, ఫోర్లతో ఊగే ఐపీఎల్‌ మ్యాచ్‌ను ఈసారి ఉత్కంఠ ఊపేసింది. ఈ మ్యాచ్‌లో ‘సూపర్‌’ ఫలితంతో ముంబై ఇండియన్స్‌ ముందంజ వేసింది. మూడో జట్టుగా ‘ప్లే ఆఫ్‌’ దశకు అర్హత సంపాదించింది. మనీశ్‌ పాండే ప్రదర్శనతో ఆఖరిదాకా పోరాడిన హైదరాబాద్‌ సూపర్‌ ఓవర్లో బోర్లా పడింది. ముందుకెళ్లే ఆశల్ని క్లిష్టం చేసుకుంది. చిత్రంగా ఈ సూపర్‌ ఓవర్‌ పోరు 7 బంతుల్లోనే ముగిసింది. హైదరాబాద్‌ మొదటి నాలుగు బంతుల్లో 2 వికెట్లను కోల్పోయి 8 పరుగులు చేయగా... ముంబై 3 బంతుల్లోనే 9 పరుగులు చేసి గెలిచింది.

ముంబై: ఇరు జట్లకు కీలకమైన ఈ పోరులో ఆఖరిదాకా ముంబై, హైదరాబాద్‌ జట్లు పోరాడాయి. దీంతో 20 ఓవర్ల సమరంలో సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే ‘సూపర్‌ ఓవర్‌’ తేల్చేసిన ఫలితం హైదరాబాద్‌కు శరాఘాతమైంది. ముంబైని ముందుకు తీసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్‌ డికాక్‌ (58 బంతుల్లో 69 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 162  పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయింది. మనీశ్‌ పాండే (47 బంతుల్లో 71 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. బుమ్రా, హార్దిక్, కృనాల్‌ తలా 2 వికెట్లు తీశారు. మ్యాచ్‌ ‘టై’ కావడంతో... ఫలితం తేలడానికి ఒక్కో ఓవర్‌తో కూడిన సూపర్‌ ఓవర్‌ను ఆడించారు. ఈ సూపర్‌ ఓవర్‌లో ముంబై మూడు బంతుల్లోనే గెలిచింది. బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. చెన్నై, ఢిల్లీ, ముంబై ప్లే ఆఫ్‌ దశకు చేరుకోవడంతో... మిగిలిన మరో బెర్త్‌ కోసం నాలుగు జట్లు హైదరాబాద్, పంజాబ్, కోల్‌కతా, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు పోటీలో ఉన్నాయి. 

ఎవరూ పెద్దగా నిలబడలేదు... 
టాస్‌ నెగ్గిన ముంబై కీలక మ్యాచ్‌లో ఛేదనలో ఎదురయ్యే ఒత్తిడి కంటే ముందు బ్యాటింగ్‌ చేయడమే నయమనుకుంది. మంచి పవర్‌ హిట్టర్లున్న ముంబై ఇండియన్స్‌ ఆశించిన స్థాయిలో మాత్రం పరుగులు చేయలేకపోయింది. మెరుపులు మెరిపించే బ్యాట్స్‌మన్‌ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. కడదాకా నిలబడిన ఓపెనర్‌ డికాక్‌ మాత్రం భారీ షాట్లు ఆడలేకపోయాడు. డికాక్‌తో ముంబై ఆట ఆరంభించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఉన్నంతసేపూ బౌండరీలతో అలరించాడు. కానీ ఈ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. భువీ, ఖలీల్‌ అహ్మద్‌ వేసిన తొలి రెండు ఓవర్లలోనే ఐదు బౌండరీలు బాది ఊపుమీదున్న రోహిత్‌ (18 బంతుల్లో 24; 5 ఫోర్లు) ఆట ఆరో ఓవర్లోనే ముగిసింది. తర్వాత డికాక్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ జతయ్యాడు. ఈ జోడి జోరుగా సాగిపోతున్న దశలో సూర్యకుమార్‌ (17 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌)నూ ఖలీలే ఔట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత లూయిస్‌ (1) విఫలమయ్యాడు. అతన్ని నబీ పెవిలియన్‌ చేర్చాడు. హార్దిక్‌ క్రీజులోకి వచ్చాడు. 

ఆఖరి దాకా ఆడింది డికాక్‌ ఒక్కడే... 
బాసిల్‌ థంపి వేసిన 14వ ఓవర్‌లో హార్దిక్‌ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదగా... డికాక్‌ మరో ఫోర్‌ కొట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో ముంబై 16 పరుగులు చేసింది. దీంతో ముంబై స్కోరు వంద దాటింది. తర్వాత రషీద్‌ ఖాన్‌ మాత్రం తన ఓవర్లో ఆ అవకాశమివ్వలేదు. నాలుగు సింగిల్స్‌ ఇచ్చిన ఈ స్పిన్నర్‌ రెండు డాట్‌ బాల్స్‌ వేశాడు. 16వ ఓవర్లో భువీ 7 పరుగులిచ్చి హార్దిక్‌ పాండ్యా (10 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) వికెట్‌ను పడగొట్టాడు. దీంతో పొలార్డ్‌ క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్‌ డికాక్‌ 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తంపి బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదాడు. రషీద్‌ ఖాన్‌ 18వ ఓవర్లో పొలార్డ్‌ భారీ సిక్సర్‌ కొట్టగా, డికాక్‌ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. 19వ ఓవర్‌ వేసేందుకు బంతినందుకున్న భువనేశ్వర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. ఈ డెత్‌ ఓవర్లో పొలార్డ్‌ క్రీజులో ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాడు. ఖలీల్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలిబంతిని భారీ షాట్‌గా ఆడేందుకు ప్రయత్నించిన పొలార్డ్‌ (9 బంతుల్లో 10; 1 సిక్స్‌) అభిషేక్‌ శర్మ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన కృనాల్‌ పాండ్యా సిక్స్‌ కొట్టడంతో ఈ ఓవర్లో 11 పరుగులు జతయ్యాయి. భువీ, నబీ చెరో వికెట్‌ తీశారు. 

ధాటిగా మొదలైంది కానీ... 
వార్నర్‌ లేని సన్‌ ఇన్నింగ్స్‌ను సాహా, గప్టిల్‌ ధాటిగానే ప్రారంభించారు. తొలి ఓవర్లో సాహా, రెండో ఓవర్లో గప్టిల్‌ బౌండరీ  కొట్టారు. ఇక మూడో ఓవర్లో అయితే ఇద్దరు కలిసి 17 పరుగులు పిండుకున్నారు. శరణ్‌ బౌలింగ్‌లో సాహా 2 ఫోర్లు, గప్టిల్‌ ఒక సిక్సర్‌ బాదాడు. దీంతో పరుగుల వేగం పెరిగింది. ఇదే జోరుతో బుమ్రా నాలుగో ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన సాహా (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) ఆఖరి బంతికి  ఔటయ్యాడు. తర్వాత మనీశ్‌ పాండే రాగానే బ్యాట్‌కు పని చెప్పాడు. మలింగ వేసిన ఐదో ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌ బాదేశాడు. ఈ ఓవర్లో కూడా 17 పరుగులు రాగా 4.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరింది. సాఫీగా సాగుతున్న రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను మళ్లీ బుమ్రానే దెబ్బతీశాడు. గప్టిల్‌ను (11 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌) ఎల్బీగా వెనక్కిపంపాడు. గప్టిల్‌ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. తర్వాత కాసేపటికే కెప్టెన్‌ విలియమ్సన్‌ (3) వికెట్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ను కుదిపేసింది. కృనాల్‌ బౌలింగ్‌లో అతను స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎల్బీ అప్పీల్‌ చేసినా అంపైర్‌ తిరస్కరించాడు. దీంతో ముంబై రివ్యూకు వెళ్లి విలియమ్సన్‌ను బయటకు పంపింది. సన్‌రైజర్స్‌ 65 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.  

రాణించిన మనీశ్‌ పాండే 
విజయ్‌ శంకర్‌ క్రీజ్‌లోకి రాగా... పాండే అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. 10 ఓవర్లలో హైదరాబాద్‌ 80/3 స్కోరు చేసింది. అయితే చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోతున్న దశలో సన్‌రైజర్స్‌ స్వల్పవ్యవధిలో 2 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 98 స్కోరు వద్ద విజయ్‌ శంకర్‌ (12)ను కృనాల్‌ పాండ్యా, 105 పరుగుల వద్ద అభిషేక్‌ శర్మ (2)ను హార్దిక్‌ పాండ్యా పెవిలియన్‌ పంపారు. హైదరాబాద్‌ విజయ సమీకరణం చివరి 5 ఓవర్లలో 57 పరుగులుగా మారిపోయింది. జోరుతో స్కోరును నడిపిస్తున్న పాండే 37 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్‌ వేసిన బుమ్రా అద్భుతంగా కట్టడి చేసి 7 పరుగులే ఇచ్చాడు. మలింగ 18వ ఓవర్లో నబీ ఫోర్, సిక్స్‌ బాదడంతో 12 పరుగులు వచ్చాయి. ఆఖరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సివుండగా బుమ్రా 19వ ఓవర్లో పాండే 2 బౌండరీలు కొట్టాడు. ఈ ఓవర్లో 12 పరుగులు రాగా హైదరాబాద్‌ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 17 పరుగులు చేయాలి. 5 బంతుల్లో 10 పరుగులు చేసిన హైదరాబాద్‌ నబి వికెట్‌ను కోల్పోయింది. చివరి బంతికి 7 పరుగులు చేయాల్సి ఉండగా పాండే సిక్స్‌ కొట్టాడు. మ్యాచ్‌ ‘టై’ అయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement