హైదరాబాద్: వరుస విజయాలతో జోరు మీదున్న డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవాలనుకున్న సీఎస్‌కేకు భంగపాటు తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌లో చాలా రోజుల తర్వాత సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా.. అనంతంరం బ్యాట్స్‌మెన్ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. వరుస పరాజయాలతో డీలా పడిన సన్‌రైజర్స్‌కు ఈ విజయం రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించేదే. సీఎస్‌కే నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని.. విలియమ్సన్ సేన 16.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ఛేదనలో ఓపెనర్లు బెయిర్ స్టో(61 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వార్నర్(50; 25 బంతుల్లో 10ఫోర్లు)లు అర్దసెంచరీలతో రాణించి మరోసారి సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. సీఎస్‌కే బౌలర్లలో తాహీర్ రెండు వికెట్లు.. చాహర్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సీఎస్‌కేకు ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్‌లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం వాట్సన్(31) నదీమ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం తరువాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ డుప్లెసిస్(45)ను విజయ్ శంకర్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో కుదురుకున్నాడునకున్న తరుణంలో తాత్కాలిక సారథి సురేష్ రైనా(13)ను రషీద్ ఖాన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవరల్లో కేదార్ జాదవ్(1)ను మరో అద్భుత బంతితో రషీద్ బోల్తా కొట్టించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న బిల్లింగ్స్(0) కూడా తీవ్రంగా నిరాశ పరిచాడు. ఓ వైపు వికెట్లు పడగొడుతూనే మరో వైపు పరుగులు ఇవ్వకుండా సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చివర్లో రాయుడు(25 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్, శంకర్, నదీమ్ తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment