
సాక్షి, ముంబై : అన్నీ కుదిరితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13 కొత్త పుంతలు తొక్కనుంది. దీనిలో భాగంగా పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ‘పవర్ ప్లేయర్’ అనే కొత్త ప్రతిపాదన గవర్నింగ్ కౌన్సిల్ ముందుకు వచ్చింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తుది నిర్ణయమని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. అయితే పవర్ ప్లేయర్‌పై చర్చ జరుగుతుండగానే మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గత ఐపీఎల్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వారిపై పని ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో మైదానంలో మరో ఎక్స్‌ట్రా అంపైర్‌ను ఉంచాలని గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తోంది. అయితే ఈ ఎక్స్‌ట్రా అంపైర్ కేవలం ‘నో బాల్’ చెక్ చేయడానికి మాత్రమేనని తెలుస్తోంది. అయితే దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగాత్మకంగా ముస్తాక్ అలీ ట్రోఫీలో పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఫ్రంట్ ఫుట్, హైట్ నోబాల్ నిర్ణయాలను మాత్రమే తీసుకునే అధికారం ఎక్స్‌ట్రా అంపైర్‌కు ఉంటుందని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని, దీనిపై అధ్యక్షుడు గంగూలీ కూడా సుముఖంగా ఉన్నాడని ఆ అధికారి తెలిపారు. అయితే వచ్చే ఐపీఎల్‌కు ఎక్కువ సమయం లేనందున ‘పవర్ ప్లేయర్’ను ఈసీజన్‌లో అమలు చేయడం కుదరదని గవర్నింగ్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. అంతేకాకుండా పవర్ ప్లేయర్ నిబంధనకు గంగూలీ ఆమోదముద్ర వేయలేదని తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనను తరువాతి ఐపీఎల్‌కు వాయిదా పడింది. ఇక గత సీజన్‌లో ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా చివరి బంతిని లసిత్ మలింగ నోబాల్ వేసనప్పటికీ అంపైర్ గుర్తించలేదు. అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆ బంతిని అంపైర్ నోబాల్ ప్రకటించి ఉంటే ఫలితం ఆర్సీబీకి అనుకూలంగా ఉండేది. అయితే ఇదే విషయాన్ని మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment