ఐపీఎల్ వేలం వాయిదా
ఈనెల 20 నుంచి 25 మధ్య ఉండే అవకాశం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 4న శనివారం జరగాల్సి ఉండగా మూడో వారంలో జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. బీసీసీఐ ఈ విషయంలో తుది తేదీ ఖరారు చేయకపోయినా ఈనెల 20 నుంచి 25వ తేదీల మధ్య జరిపేందుకు సిద్ధమవుతోంది. లీగ్ ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు జరిపేందుకు గత నవంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్ పాలకమండలిలో నిర్ణయించారు. అదే సమయంలో ఆటగాళ్ల వేలం ఈనెల 4న జరుగుతుందని ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీసీఐలో సమూల మార్పులు జరిగాయి. అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను వారి పదవుల నుంచి తొలగించింది. బోర్డు సీఈవోగా రాహుల్ జోహ్రిని నియమించి రోజువారీ కార్యకలాపాలను జరిపేలా ఆదేశించింది. అయితే వ్యవహారాల పర్యవేక్షణ కోసం కమిటీ సభ్యుల నియామకం షెడ్యూల్‌కన్నా ఆలస్యమవడంతో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం మార్చాలని భావించారు.
అయితే గత సోమవారం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నలుగురి సభ్యుల ‘కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) గురువారం సంబంధిత బీసీసీఐ అధికారులను కలుసుకుంది. ఐపీఎల్ 2017 తదితర అత్యవసర విషయాలను చర్చించారు. ఐపీఎల్ సన్నాహకాలను పరిశీలిస్తామని ఫ్రాంచైజీలకు సీఓఏ హామీ ఇచ్చింది. త్వరలోనే విధి విధానాలను పంపిస్తామని తెలిపింది’ అని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు ఈ ఆలస్యం కారణంగా ఈనెల 18న ముగిసే ముస్తాక్ అలీ టి20 టోర్నీలో రాణించే దేశవాళీ ఆటగాళ్లను కూడా పరిశీలించే అవకాశం దొరుకుతుందని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు.
ఇంగ్లండ్ ఆటగాళ్లకు నష్టం లేదు: కోహ్లి
భారత్‌తో జరిగిన చివరి టి20లో ఇంగ్లండ్ బ్యాటింగ్ కుప్పకూలినా ఐపీఎల్ వేలంలో వారి అవకాశాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కెప్టెన్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అది ఆయా ఫ్రాంచైజీల ఆలోచనాధోరణిపై ఆధారపడి ఉంటుందని, వారు తమ జట్ల సమతూకం కోసం ఆలోచించి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటారని చెప్పాడు. అలాగే బెన్ స్టోక్స్ కోసం అన్ని జట్లు పోటీపడి భారీ ధర పలికే అవకాశాలున్నాయని యువరాజ్ సింగ్ తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అద్భుత ఫీల్డర్‌గా పేరు తెచ్చుకున్నాడని, ఇతడి కోసం అన్ని జట్లు ఎగబడతాయని యువీ అన్నాడు.