
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌తో లీగ్ మొదలవుతుంది. మే 24న ముంబైలోనే ఫైనల్ నిర్వహిస్తారు. టోర్నీ ఆనవాయితీ ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ జట్టుకు తర్వాతి సీజన్‌లో ప్రారంభ మ్యాచ్‌తోపాటు ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కుతుంది. 2019 ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలువడంతో ఈ ఏడాది ముంబైలో ఆరంభ మ్యాచ్‌ను, ఫైనల్‌ను నిర్వహిస్తారు. మొత్తం 57 రోజుల పాటు టోర్నీ జరగనుంది. ఎప్పటిలా రాత్రి 8 గంటల నుంచి కాకుండా ఈ సారి 7.30 నుంచి మ్యాచ్‌లు మొదలు చేసే అవకాశం ఉంది. పలు ఫ్రాంచైజీలతో పాటు ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ కూడా ఇదే సరైన సమయంగా భావిస్తోంది. ఈసారి లీగ్ వ్యవధి పెరిగినా... సాధ్యమైనంత వరకు రోజూ ఒకటే మ్యాచ్ ఉండేలా షెడ్యూల్ రూపొందించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో 2019 ఐపీఎల్ మార్చి 23 నుంచే మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment