బోర్డులో ఇటీవల ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ముంబైలో వచ్చే నెల 12న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్‌జీఎమ్) ఏర్పాటు చేసింది. బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వెళ్లారు.
మరోవైపు.. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి. బోర్డు నియమావళి ప్రకారం ఏదైన పదవి ఖాళీ అయితే 45 రోజుల్లోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎస్‌జీఎమ్ నిర్వహించాలి.
ఈ నేపథ్యంలో గురువారం జరిగిన బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో జనవరి 12న ఎస్‌జీఎమ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారమిచ్చినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
కాగా మరో ఏడాది పదవీకాలం మిగిలున్నప్పటికీ జై షా, ఆశిష్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అస్సామ్‌కు చెందిన బోర్డు సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా ఉండగా, కోశాధికారి పదవి బాధ్యతల్ని ఎవరికీ కట్టబెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment