Ashish Shelar
-
బీసీసీఐలో మరో పోస్ట్ ఖాళీ
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో మరో కీలక పదవి ఖాళీ అయ్యింది. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో చేరారు. ఆదివారం ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో క్రికెట్ బోర్డులోని తన కోశాధికారి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రెండేళ్ల క్రితం 2022 అక్టోబర్‌లో బీసీసీఐ కోశాధికారిగా షెలార్ ఎన్నికయ్యారు.గత నెల మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా... భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ముంబై సబర్బన్ జిల్లా పరిధిలోని వాంద్రే వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆశిష్ షెలార్ ఎన్నికయ్యారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులెవరూ బోర్డు కార్యవర్గంలో ఉండకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి. 2016లో ఏర్పాటైన జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే 2022లో ఎమ్మెల్యే, ఎంపీలకు మినహాయింపునిస్తూ కేబినెట్ హోదా ఉన్న వారిని అనర్హులని తీసుకొచి్చన సవరణకు సుప్రీం ఆమోదం తెలపడంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉన్న షెలార్ కోశాధికారిగానూ పనిచేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి కావడంతో బోర్డు పదవికి రాజీనామా చేశారు. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి కూడా ఖాళీ అయ్యింది. ఇప్పుడు కీలకమైన కార్యదర్శి, కోశాధికారి పదవులు రెండూ ఖాళీగా ఉన్నాయి. అయితే జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రస్తుతానికి తాత్కాలిక కార్యదర్శిగా పని చేస్తున్నారు. -
మహారాష్ట్రలో ‘ఢిల్లీ’ ప్రకంపనలు
- ఉద్ధవ్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ - ప్రభుత్వం నుంచి వైదొలగి విమర్శించాలన్న ఆశిష్ శేలార్ - ఫడ్నవీస్ సర్కార్‌ను పడగొడితే శివసేనకు మద్దతిస్తామన్న ఎన్సీపీ సాక్షి, ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోదీ అలల కంటే ఆప్ సునామీ గొప్పదని వ్యాఖ్యానించిన శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ మండిపడింది. ఢిల్లీ ఓటమితో క్రుంగిపోయిన రాష్ట్ర నేతలకు ఉద్ధవ్ వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టు చేశాయి. దీంతో ధైర్యముంటే ముందు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి విమర్శలు చేయాలని ఉద్ధవ్‌కు సవాల్ విసిరారు. సందులో సడేమియాలా వెంటనే అందుకున్న ఎన్సీపీ, ఫడ్నవీస్ సర్కార్‌ను పడగొట్టేందుకు శివసేనకు మద్దతివ్వగలమని ప్రకటించింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై అటు ప్రత్యర్థి పార్టీలతో పాటు ఇటు భాగస్వామ్య పక్షాలు కూడా లోలోన సంతోషిస్తున్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు సంధిస్తోంది. దాదాపు పాతికేళ్ల పాటు కొనసాగిన వీరి మైత్రి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగిపోయిన సంగతి తెల్సిందే. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం రెండు పార్టీలు తిరిగి జత కట్టినప్పటికీ శివసేన తన అసంతృప్తిని ఎప్పటికప్పుడు వెళ్లగక్కుతూనే ఉంది. దేశమంతటా నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందన్న అహంకారంతో బీజేపీ తమను చిన్నచూపుచూస్తోందన్న భావన సేన నేతల్లో నెలకొంది. దీంతో అవకాశం దొరికినప్పుడుల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు సంధిస్తున్నారు. ‘మోదీ అలల కంటే సునామీ ప్రభావం అధికంగా ఉంటుంది’ అన్న ఉద్ధవ్ వ్యాఖ్యలు ఆయనకు బీజేపీపై ఉన్న అక్కసును వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ వైపు నుంచి కూడా ధీటైన సమాధానం వచ్చింది. ధైర్యముంటే ముందు ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లి విమర్శించాలని బీజేపీ ముంబై నగర శాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్ సవాల్ విసిరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, ఫడ్నవీస్ సర్కార్‌ను పడగొట్టేందుకు తాము శివసేనకు మద్దతునిస్తామని ప్రకటించారు. దీంతో మంగళవారం సాయంత్రం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శివసేన మద్దతుతో మైనారిటీ సర్కారును నడుపుతున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతకాలం అధికారంలో ఉండగలరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మాలిక్ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ నుంచి, అటు శివసేన నుంచి ప్రతిస్పందన వ్యక్తం కాలేదు. -
మాజీలకు మరోసారి ఆహ్వానం
సాక్షి, ముంబై: పలు కారణాలవల్ల పార్టీని వదిలి బయటకు వెళ్లిన పదాధికారులు, కార్యకర్తలను తిరిగి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని మరిం త బలోపేతం చేయడంతో భాగంగా మాజీ సీనియర్లను అక్కున చేర్చుకునేందుకు ఈ ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల పార్టీ కొందరు నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకుంది. కొందరు నాయకులు, కార్పొరేటర్లను పార్టీ నుంచి వెలివేశారు. అలకలు, విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలన్నింటినీ మర్చిపోయి తిరిగి సొంత గూటిలోకి చేరుకోవాలంటూ బీజేపీ మాజీలకు సూచిస్తోంది. మాజీ కార్పొరేటర్ పరాగ్ అల్వాణి, మాజీ మహిళ కార్పొరేటర్ జయశ్రీ ఖరాత్, భాండుప్ బీజేపీ పదాధికారి బాబూ శింగరే తదితరులు పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించారు. వీరితోపాటు చర్యలు తీసుకున్న కార్యకర్తలనూ తిరిగి చేర్చుకుంటామని బీజేపీ ముంబై అధ్యక్షుడు, ఎమ్మెల్యే అశిష్ శేలార్ ప్రకటించారు. పరాగ్ అల్వాణి భార్య జ్యోతి అల్వాణి గత ఎన్నికల్లో విలేపార్లే నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేసి గెలిచారు. అయితే శేలార్ ఆహ్వానాన్ని ఆమె కూడా అంగీకరించి పార్టీలో చేరారు. ఇలా పార్టీ నుంచి దూరమైన అందరినీ తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీకి చెందిన వారితోపాటు ఇతర పార్టీల కార్పొరేటర్లు, నాయకులను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేందుకు వివిధ ప్రణాళికలు రూపొం దిస్తున్నామని శేలార్ చెప్పారు.