- ఉద్ధవ్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ
- ప్రభుత్వం నుంచి వైదొలగి విమర్శించాలన్న ఆశిష్ శేలార్
- ఫడ్నవీస్ సర్కార్‌ను పడగొడితే శివసేనకు మద్దతిస్తామన్న ఎన్సీపీ
సాక్షి, ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోదీ అలల కంటే ఆప్ సునామీ గొప్పదని వ్యాఖ్యానించిన శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ మండిపడింది. ఢిల్లీ ఓటమితో క్రుంగిపోయిన రాష్ట్ర నేతలకు ఉద్ధవ్ వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టు చేశాయి.
దీంతో ధైర్యముంటే ముందు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి విమర్శలు చేయాలని ఉద్ధవ్‌కు సవాల్ విసిరారు. సందులో సడేమియాలా వెంటనే అందుకున్న ఎన్సీపీ, ఫడ్నవీస్ సర్కార్‌ను పడగొట్టేందుకు శివసేనకు మద్దతివ్వగలమని ప్రకటించింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై అటు ప్రత్యర్థి పార్టీలతో పాటు ఇటు భాగస్వామ్య పక్షాలు కూడా లోలోన సంతోషిస్తున్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు సంధిస్తోంది. దాదాపు పాతికేళ్ల పాటు కొనసాగిన వీరి మైత్రి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగిపోయిన సంగతి తెల్సిందే. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం రెండు పార్టీలు తిరిగి జత కట్టినప్పటికీ శివసేన తన అసంతృప్తిని ఎప్పటికప్పుడు వెళ్లగక్కుతూనే ఉంది. దేశమంతటా నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందన్న అహంకారంతో బీజేపీ తమను చిన్నచూపుచూస్తోందన్న భావన సేన నేతల్లో నెలకొంది.
దీంతో అవకాశం దొరికినప్పుడుల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు సంధిస్తున్నారు. ‘మోదీ అలల కంటే సునామీ ప్రభావం అధికంగా ఉంటుంది’ అన్న ఉద్ధవ్ వ్యాఖ్యలు ఆయనకు బీజేపీపై ఉన్న అక్కసును వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ వైపు నుంచి కూడా ధీటైన సమాధానం వచ్చింది. ధైర్యముంటే ముందు ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లి విమర్శించాలని బీజేపీ ముంబై నగర శాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్ సవాల్ విసిరారు.
దీనిపై వెంటనే స్పందించిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, ఫడ్నవీస్ సర్కార్‌ను పడగొట్టేందుకు తాము శివసేనకు మద్దతునిస్తామని ప్రకటించారు. దీంతో మంగళవారం సాయంత్రం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శివసేన మద్దతుతో మైనారిటీ సర్కారును నడుపుతున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతకాలం అధికారంలో ఉండగలరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మాలిక్ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ నుంచి, అటు శివసేన నుంచి ప్రతిస్పందన వ్యక్తం కాలేదు.
మహారాష్ట్రలో ‘ఢిల్లీ’ ప్రకంపనలు
Published Tue, Feb 10 2015 10:34 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement