కాంగ్రెస్కు అంతా ఆంగ్లేయ పాలకుల ఆలోచనలే
లక్నో: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. ఆ పార్టీ పాలనను ఆంగ్లేయుల పాలనతో పోల్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలకు బ్రిటీష్ పాలకులకుండే ఆలోచనలు ఉంటాయని, బ్రిటీషర్ల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ అంత తొందరగా అధికారాన్ని వదులుకోలేదని విమర్శించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంత తొందరగా అధికారం వదులుకోలేదని, కానీ ఆ సమయం వచ్చి చివరకు కోల్పోయిందని అన్నారు.
ఇప్పుడు పనిపాటలేనిదానిలా తయారై అసంఘతమైన పనులు చేస్తుందని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగియడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. పేదలకు, అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి ఆ పార్టీ వ్యతిరేకమని అన్నారు. ఎప్పుడూ గాంధీ-నెహ్రూ కుటుంబాల చుట్టూ తిరగడమే ఆ పార్టీ ఎజెండా ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు అనేవి అసలు కాంగ్రెస్లో లేనేలేవని, రెండు సభలు ఏవిధంగా నైనా స్తంభింపజేయాలని ఆ పార్టీ ముందే నిర్ణయించుకొని వచ్చిందని ఆరోపించారు.