అంచనాలపై బీజేపీ, కాంగ్రెస్‌ల పరస్పర భిన్న స్పందన
కొత్త ప్రభుత్వం ఎన్డీఏదేనని బీజేపీ ధీమాట
న్యూఢిల్లీ: కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఎవరిదన్న అంశంపై మంగళవారం బీజేపీ, కాంగ్రెస్ పూర్తి భిన్నంగా స్పందించాయి. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి రాణిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేయగా ఈ అంచనాలు వాస్తవ దూరమని...2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయని కాంగ్రెస్ గుర్తుచేసింది. ఎన్డీఏకు 249 నుంచి 290 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని పలు వార్తాచానళ్ల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ... 270-275 సగటు స్థానాల మార్కును దాటుతామన్నారు. సీమాంధ్రలో (ఆంధ్రప్రదేశ్) మిత్రపక్షమైన టీడీపీతో కలిసి క్లీన్‌స్వీప్ చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని...కానీ ఓటమిపై విమర్శల నుంచి సోనియా, రాహుల్‌లను కాపాడేందుకు ఆ పార్టీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను బలిపశువు చేస్తుందని జవదేకర్ విమర్శించారు. వాస్తవాన్ని అంగీకరించడం కాంగ్రెస్‌కు కష్టంగా ఉంటే 16న ఎన్నికల ఫలితాల అనంతరం ఓటమిని అంగీకరించాలని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ చురకలంటించారు.
శాంపిల్ సర్వేలతో ఫలితాల అంచనానా: కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పేలవ ప్రదర్శన కనబరచబోతోం దన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ తప్పుబట్టారు. దేశంలో సుమారు 80 కోట్ల మంది ఓటర్లు ఉండగా కేవలం కొన్ని లక్షల మందిని అడిగి చేపట్టిన శాంపిల్ సర్వేలతో ఫలితాలను ఎలా అంచనా వేస్తారని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. యూపీఏ భాగస్వామ్యపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తప్పుబట్టారు. 16న ఫలితాలకు ముందు కాలం వెళ్లబుచ్చేందుకే ఇవి పనికొస్తాయంటూ ట్వీట్ చేశారు. కాగా, ఎన్నికల్లో ఒకవేళ తమ పార్టీ ఓడిపోతే ఆ ఫలితాలు యూపీఏ ప్రభుత్వ పనితీరునే ప్రతిఫలిస్తాయని కేంద్రమంత్రి కమల్‌నాథ్ చెప్పుకొచ్చారు. ఎస్పీ, జేడీయూ కూడా ఎగ్జిట్ పోల్స్‌ను తప్పుబట్టాయి.
‘ఎగ్జిట్’పై ఎవరి వాదన వారిదే
Published Wed, May 14 2014 2:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement