అనూహ్యం.. ఆశ్చర్యం...
రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయబోయే వ్యక్తి పేరు ఖరారైంది. దళితనేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించింది.
రామ్‌నాథ్ కోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికైతే కేఆర్ నారాయణ్ తర్వాత రెండో దళిత నేత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించినవారు అవుతారు. బీహార్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం పార్టీ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న రామ్‌నాధ్ కోవింద్ రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 24న ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నందున అంతకుముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది.
ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ ముందునుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో వ్యవహరించిన విధంగానే రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలోనూ ఇతర పేర్లను తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము పేర్లు వినిపించాయి. ఇందులో ఒక్కో దశలో ఒక్కొక్కరి పేరుపై ప్రచారం జరిగింది. కానీ... ఎక్కడా కూడా తమ అసలు అభ్యర్థి ఎవరో బయటపెట్టకుండా మోదీ, అమిత్ షాలు అడుగు ముందుకు వేశారు.
అలాగే పార్టీ తరఫున కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీలు విపక్షాలు, మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల్లోనూ తమ అభ్యర్థి ఎవరో వాళ్లు కూడా బయటపెట్టలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్, వామపక్షనేతలతో పాటు మిత్రపక్షం శివసేన నేతలు కూడా ప్రశ్నించారు. అయినప్పటికీ గుంభనంగా వ్యవహరించిన మోదీ, షాలు చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా దళిత మంత్రాన్ని పఠించారు. విపక్షాలకు షాకిస్తూ దళితాస్త్రం సంధించారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ మొదటి నుంచి గుంభనంగా వ్యవహరించింది. చివరికి పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ముగిసిన తర్వాత స్వయంగా పార్టీ చీఫ్ అమిత్ షా ప్రకటిస్తేగానీ అసలు పేరు బయటకు రాలేదు.
రాష్ట్రపతి అభ్యర్ధిగా దళిత నాయకుడు రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన బీజేపీ ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు వ్యవహరించింది. ఇందులో ఒకటి విపక్షాల మద్ధతు కూడగట్టడం. బీజేపీ సంధించిన దళితాస్త్రంతో విపక్షాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. గతంలో వాజ్‌పేయ్ హయాంలో ఎలాగైతే అనూహ్యంగా అబ్దుల్ కలాం పేరును తెరపైకి తీసుకొచ్చి విపక్షాలకు చెక్ పెట్టారో ఇప్పుడు కూడా అలాగే దళితమంత్రాన్ని పఠించి విపక్షాలకు అవకాశం లేకుండా చేశారు. నిన్నా మొన్నటి వరకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామంటూ బీరాలు పోయిన విపక్ష నేతలు ఇప్పుడు ఒక్కొక్కరే బీజేపీ అభ్యర్థికి మద్ధతు పలుకుతున్నారు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్‌ఐపీ సహా పలువురు నేతలు రామ్‌నాథ్ అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించారు.
ఇక దళితులనే నమ్ముకున్న బీఎస్పీకి కూడా రామ్‌నాథ్‌కే మద్ధతు పలకడం మినహా మరో అవకాశం లేదు. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరోవైపు ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం ఇప్పుడే చెప్పలేమని, పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే ప్రతిపక్షాలన్నీ ఈ నెల 22న సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థి వ్యవహారంపై చర్చించిన తర్వాత, పోటీ ఉంటుందా లేదా అనేది అప్పుడే ప్రకటిస్తామని తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక వామపక్షాలు కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతుకు సుముఖంగా లేవు.
ఎవరీ రామ్‌నాధ్ కోవింద్?
రాష్ట్రపతి అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన రామ్‌నాధ్ కోవింద్ 1945 ఆగస్టు ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని దహేత్ జిల్లాలో జన్మించారు. దళితవర్గానికి చెందిన రామ్‌నాథ్ కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు.
1994లో తొలి సారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ఆయన 2000వ సంవత్సరంలో మరోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యునిగా పని చేశారు. 1998-2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా వ్యవహరించిన ఆయన 2015 ఆగస్టు 16న బీహార్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2002 అక్టోబర్‌లో భారత్ తరఫున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ఆయన దళితులు, వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు.