'ఆ మూడు మోదీని గద్దె దించుతాయి'
వడోదర: ప్రధాని నరేంద్రమోదీపై ఒకప్పటి నటుడు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బార్ విరుచుకుపడ్డారు. సామాన్యుడిని ప్రధాని నరేంద్ర మోదీ నిలువునా మోసం చేశారని అన్నారు. ఆయన చేసిన నిర్లక్ష్యంతో అధికారాన్ని కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఎన్డీయే ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. హర్యానాలో దళిత చిన్నారుల హత్యలు, దాద్రి ఘటనలు, ఆకాశాన్నంటిన పప్పుల ధరలను ఉద్దేశిస్తూ 'దాల్, దళిత్, దాద్రి' ఘటనలు మోదీని త్వరలోనే గద్దెను దించుతాయని చెప్పారు.
త్వరలో వడోదరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడికి పార్టీ తరుపున ప్రచారానికి వచ్చిన బబ్బార్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు మొన్న ఢిల్లీలో నిన్న బిహార్ ఎన్నికల్లో ఏ విధంగానైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో వీలయినన్ని జిమ్మిక్కులు ఎన్డీయే ప్రభుత్వం చేసిందని, ప్రధాని మోదీ అయితే ఏకంగా 31 ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారని చెప్పారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చూస్తేనే ప్రధాని మోదీ ప్రజలను దారుణంగా మోసం చేశారనే విషయం అర్థమైపోతుందని అన్నారు. నవంబర్ 22 నుంచి 29 వరకు ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల్లో దెబ్బతిన్న మోదీ పటాలానికి ఇక మిగిలింది 2017లో ఉన్న గుజరాత్ ఎన్నికలే చివరి పరీక్ష అని వాటితో రానున్న రోజుల్లో ఎన్డీయే భవితవ్యమేమిటో తేలిపోతుందన్నారు.