president condidate
-
హైదరాబాద్ చేరుకున్న మీరా కుమార్
హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో...ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె గాంధీభవన్‌కు చేరుకుంటారు. బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులు అర్పించి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ భవనంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ముఖ్యులతో సమావేశమవుతారు. అక్కడే అందరితో కలసి భోజనం చేసి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
మీరా కుమారే ప్రధాన మంత్రి అయితే...
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దళిత మహిళ మీరా కుమార్ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెట్టలేక పోవచ్చు. బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే కూటమి నిలబెట్టిన దళిత విద్యావేత్త రామ్‌నాథ్ కోవింద్‌కు ఎక్కువ శాతం ఓట్లు ఉండడమే అందుకు కారణం. కానీ 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలన్నీ నేటిలాగే ఏకమై మీరా కుమారినే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడది అసంబద్ధంగాను, అర్థరహితంగాను, నైరూప్య చిత్రంగాను అనిపించవచ్చు. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్‌కు మద్దతుగా కాంగ్రెస్ నాయకత్వంలో 17 పార్టీలు ముందుకు వచ్చాయి. ప్రతపక్షం తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఆది నుంచి కాంగ్రెస్ వెంటబడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలకపక్షంవైపు మొగ్గుచూపారు. ముందుగానే మీరా కుమార్ పేరును ప్రతిపాదించి ఉన్నట్లయితే నితీష్ కుమార్ ప్రతిపక్షం వెంట వచ్చేవారే. తొందరపడి ఆయన బీహార్ గవర్నర్‌గా ఉన్న వ్యక్తి, అందులోనూ దళితుడన్న భావంతో కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని మార్చుకునే రకం కాదుకనుక ఆయన తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వద్ధి రేటు 7.8 నుంచి 6.1 శాతానికి పడిపోవడం, గోవధ నిషేధం తదితర పరిణామాలు పాలకపక్షానికి దళితులను, ముస్లింలను దూరం చేశాయి. ఈ రెండు వర్గాలే కలసి ఉత్తరప్రదేశ్ జనాభాలో 34 శాతం మంది ఉన్నారు. యూపీలో దళితులంతా ఒక్క మాయావతి వెనకాలే కాకుండా వివిధ గ్రూపుల కింద ఏకమవుతున్నారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతిచ్చిన మహారాష్ట్రకు చెందిన మహర్లు గోవధ నిషేధం కారణంగా బౌద్ధ మతంలోకి మారిపోయారు. జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ పన్నుకు వ్యతిరేకంగా గుజరాతీలోని మార్వీడీలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఇంతకాలం మోదీకి హారతులు పట్టిన వారే. కానీ జీఎస్టీ తమ తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న వ్యాపారాన్ని దెబ్బతీస్తుందన్నది వారి ఆందోళన. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఐక్యతా రాగం వినిపించడం ద్వారా 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ఎన్డీయేను మట్టి కరిపించాలన్నది కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాల వ్యూహం. ఈ వ్యూహం నెరవేరాలంటే మోదీ లాంటి నాయకుడిని ఢీకొనే సమర్థుడైన నాయకత్వం కావాలి. నితీష్ కుమార్ ప్రత్యామ్నాయ నాయకుడిగా తాను ప్రతిపక్షంలో ఎదగాలన్న ఆలోచనతోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి నిలబెట్టాలని పోరారు. ఇప్పుడు ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇక రాహుల్ గాంధీని మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రతిపక్షాలేవీ గుర్తించడం లేవు. అలా ఎదుగుతాడన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ స్పీకర్‌గా, విదేశీ దౌత్యవేత్తగా సమర్థంగా విధులు నిర్వహించిన రాజకీయానుభవమే కాకుండా మీరా కుమార్‌కు ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. పైగా దళిత నేపథ్యం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే కనుక ఆ పార్టీనే మీరా కుమార్‌ను బరిలోకి దించితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ‘గాంధీ–నెహ్రూ’ వారసత్వ పాలనను పక్కన పెట్టాల్సిందే. 1991లో అలా చేయడం వల్లనే పీవీ నరసింహారావు దేశ ప్రధాని కాగలిగారు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రధాని కాగలిగారు. కొంతకాలంపాటు కాంగ్రెస్ పుత్రరత్నాన్ని పక్కన పెడితే మరింత బలంగా ప్రతిపక్షాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరోదఫా ఎన్నికల్లో పుత్ర రత్నానికి పట్టాభిషేకం చేసే అవకాశం రావచ్చు. ప్రస్తుతానికి బంతి సోనియా గాంధీ చేతుల్లోనే ఉంది. ––––––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
కోవింద్‌ను బలపరుస్తూ టీఆర్ఎస్ సంతకం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలవడానికి పూర్తి మెజారిటీ ఉన్నదని తెలిసికూడా.. ప్రతిపక్షాలు నామ్‌కే వాస్తే తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నివాసానికి వెళ్లిన జితేందర్ రెడ్డి.. రాష్ట్రపతి పదవికి బీజేపీ ప్రతిపాదించిన రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ పార్టీ తరఫున సంబంధిత పత్రాలపై సంతకం చేశారు. 23వ తేదీన జరగనున్న నామినేషన్ ప్రక్రియలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడైన విద్యావేత్తను ఎంపిక చేయడాన్ని తమ పార్టీ స్వాగతించిందన్నారు. ఈ నెల 30వ తేదీన అర్ధరాత్రి పార్లమెంటులో జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. -
అనూహ్యం.. ఆశ్చర్యం...
రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయబోయే వ్యక్తి పేరు ఖరారైంది. దళితనేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించింది. రామ్‌నాథ్ కోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికైతే కేఆర్ నారాయణ్ తర్వాత రెండో దళిత నేత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించినవారు అవుతారు. బీహార్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం పార్టీ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న రామ్‌నాధ్ కోవింద్ రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 24న ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నందున అంతకుముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ ముందునుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో వ్యవహరించిన విధంగానే రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలోనూ ఇతర పేర్లను తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము పేర్లు వినిపించాయి. ఇందులో ఒక్కో దశలో ఒక్కొక్కరి పేరుపై ప్రచారం జరిగింది. కానీ... ఎక్కడా కూడా తమ అసలు అభ్యర్థి ఎవరో బయటపెట్టకుండా మోదీ, అమిత్ షాలు అడుగు ముందుకు వేశారు. అలాగే పార్టీ తరఫున కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీలు విపక్షాలు, మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల్లోనూ తమ అభ్యర్థి ఎవరో వాళ్లు కూడా బయటపెట్టలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్, వామపక్షనేతలతో పాటు మిత్రపక్షం శివసేన నేతలు కూడా ప్రశ్నించారు. అయినప్పటికీ గుంభనంగా వ్యవహరించిన మోదీ, షాలు చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా దళిత మంత్రాన్ని పఠించారు. విపక్షాలకు షాకిస్తూ దళితాస్త్రం సంధించారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ మొదటి నుంచి గుంభనంగా వ్యవహరించింది. చివరికి పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ముగిసిన తర్వాత స్వయంగా పార్టీ చీఫ్ అమిత్ షా ప్రకటిస్తేగానీ అసలు పేరు బయటకు రాలేదు. రాష్ట్రపతి అభ్యర్ధిగా దళిత నాయకుడు రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన బీజేపీ ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు వ్యవహరించింది. ఇందులో ఒకటి విపక్షాల మద్ధతు కూడగట్టడం. బీజేపీ సంధించిన దళితాస్త్రంతో విపక్షాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. గతంలో వాజ్‌పేయ్ హయాంలో ఎలాగైతే అనూహ్యంగా అబ్దుల్ కలాం పేరును తెరపైకి తీసుకొచ్చి విపక్షాలకు చెక్ పెట్టారో ఇప్పుడు కూడా అలాగే దళితమంత్రాన్ని పఠించి విపక్షాలకు అవకాశం లేకుండా చేశారు. నిన్నా మొన్నటి వరకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామంటూ బీరాలు పోయిన విపక్ష నేతలు ఇప్పుడు ఒక్కొక్కరే బీజేపీ అభ్యర్థికి మద్ధతు పలుకుతున్నారు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్ఐపీ సహా పలువురు నేతలు రామ్‌నాథ్ అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించారు. ఇక దళితులనే నమ్ముకున్న బీఎస్పీకి కూడా రామ్‌నాథ్‌కే మద్ధతు పలకడం మినహా మరో అవకాశం లేదు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరోవైపు ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం ఇప్పుడే చెప్పలేమని, పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే ప్రతిపక్షాలన్నీ ఈ నెల 22న సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థి వ్యవహారంపై చర్చించిన తర్వాత, పోటీ ఉంటుందా లేదా అనేది అప్పుడే ప్రకటిస్తామని తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక వామపక్షాలు కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతుకు సుముఖంగా లేవు. ఎవరీ రామ్‌నాధ్ కోవింద్? రాష్ట్రపతి అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన రామ్‌నాధ్ కోవింద్ 1945 ఆగస్టు ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని దహేత్ జిల్లాలో జన్మించారు. దళితవర్గానికి చెందిన రామ్‌నాథ్ కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు. 1994లో తొలి సారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ఆయన 2000వ సంవత్సరంలో మరోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యునిగా పని చేశారు. 1998-2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా వ్యవహరించిన ఆయన 2015 ఆగస్టు 16న బీహార్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2002 అక్టోబర్‌లో భారత్ తరఫున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ఆయన దళితులు, వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు. -
రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయాలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవి అభ్యర్థి ఎంపిక విషయమై ప్రతిపక్షాల మద్దతు సమీకరణకు చర్చలు జరుపుతున్న పాలకపక్ష భారతీయ జనతా పార్టీ అధిష్టానం సోమవారం అనూహ్యంగా ఈ పదవికి రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరూ ఊహించని విధంగా యోగి ఆదిత్యనాథ్‌ని ఎలాగైతే ఎంపిక చేశారో, అదే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోవింద్‌ను కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ యూనివర్శిటీలో బీకాం ఎల్ఎల్బీ చదివి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసిన కోవింద్ దళితుడవడం ఇక్కడ విశేషం. ఆది నుంచి దళితులు లేదా వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తామంటూ పాలకపక్ష బీజేపీ ఫీలర్లు వదులుతుండటంతో జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ద్రౌపది ముర్మీ లాంటి వారి పేర్లు వినిపించాయి. ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో విపక్ష పార్టీలతో సంప్రతింపులు జరపాలని నిర్ణయించిన పాలకపక్షం ముగ్గురు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీతో కమిటీ వేసింది. ఆ కమిటీ ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను వెల్లడించకుండా విపక్షాలతో చర్చలు జరపడంతో అవి ముందుకు సాగలేదు. అభ్యర్థి లేదా అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తేనే తాము మద్దతు ఇచ్చేది, లేనిది తేల్చి చెపుతామని విపక్షాలు షరతు పెట్టాయి. లౌకిక భావాలు కలిగిన వ్యక్తిని మాత్రమే తాము సమర్థిస్తామని కూడా అవి స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై రామ్‌నాథ్ కోవింద్ అనే దళితుడి పేరును ఎంపిక చేసింది. బీజేపీ తరఫున యూపీ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిచిన కోవింద్ లౌకిక భావాల గురించి పెద్దగా ఎవరికీ తెలియవు. దళితుడవడం, వివాదాస్పదుడు కాకపోవడంతో కోవింద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేందుకు విపక్షాలకు కారణాలేమీ లేవు. ఆ ఉద్దేశంతోనే బీజేపీ కోవింద్ పేరును ఖరారు చేసినట్లు అర్థం అవుతోంది. ఇప్పుడు కోవింద్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్, ఇతర విపక్షాలు సమర్థిస్తే పరువు నిలబడుతుంది. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఒకే వేదికపైకి వచ్చి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి పునాదులు వేసుకోవాలన్న విపక్షాల ఆశ అడియాశ అవుతుంది. మైనారిటీలు మినహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలను దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ అధిష్టానం 20.5 శాతం దళితులున్న యూపీ రాష్ట్రం నుంచే అభ్యర్థిని ఎన్నుకొంది. ఇది విపక్షాలను దెబ్బతీయాలనే రాజకీయ ఎత్తుగడ మాత్రమేనా, దళితుల పట్ల సానుభూతి ఏమైనా ఉందా ? అన్న అంశాన్ని మరింత లోతుగా చూడాలి. గత నెలలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుషీనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ముందు రోజు అధికారులు దళితుల ఇళ్లకు వెళ్లి సబ్బులు, షాంపూలను పంచారు. పిల్లాపాపలతో సహా శుభ్రంగా తలంటూ స్నానం చేసి యోగి ప్రారంభించనున్న వాక్సినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. ఒక్కరోజు షాంపూ ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమకు ఎవరు షాంపూ, సబ్బులు కొనిస్తారని ఈ సందర్భంగా అధికారులను దళితులు నిలదీశారు. అందరిని సమానంగా చూడాల్సిన ముఖ్యమంత్రే తమ పట్ల భేద భావం చూపిస్తే ఇక సమాజం తమను ఎలా కలుపుకుపోతుందని కూడా ప్రశ్నించారు. దళితులు తమకు అంటరానివారు కాదని చెప్పడానికి గౌతమ బుద్ధుడు కుషీనగర్ జిల్లాలోనే ఓ పాకీ పనివాడిని (హ్యూమన్ స్కావెంజర్) బౌద్ధ మతంలోకి చేర్చుకున్నారు. బుద్ధుడు చివరకు మరణించిందీ కూడా ఈ జిల్లాలోనే. అందుకనే ఇక్కడి బౌద్ధారామానికి యాత్రికులు విశేషంగా తరలివస్తారు. -
విపక్ష నేతల మద్దతు కోరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసిన విషయాన్ని ఆయన విపక్ష నేతలకు తెలియ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోమవారం ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యనేతలతో పాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన స్వయంగా మాట్లాడారు. రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, తమిళ నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లతో సహా పలువురు నేతలకు మోదీ ఫోన్ చేసి తమ అభ్యర్థి వివరాలను వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్ధతివ్వాలని కోరారు. మరోవైపు ఇతర పార్టీల నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడనున్నారు. కాగా బీహార్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమిత్ షా పార్టీ నిర్ణయాన్ని వెల్లడించారు. అలాగే రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మేదీతో భేటీ కానున్నారు.