న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలవడానికి పూర్తి మెజారిటీ ఉన్నదని తెలిసికూడా.. ప్రతిపక్షాలు నామ్‌కే వాస్తే తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నివాసానికి వెళ్లిన జితేందర్ రెడ్డి.. రాష్ట్రపతి పదవికి బీజేపీ ప్రతిపాదించిన రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ టీఆర్‌ఎస్ పార్టీ తరఫున సంబంధిత పత్రాలపై సంతకం చేశారు.
23వ తేదీన జరగనున్న నామినేషన్ ప్రక్రియలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడైన విద్యావేత్తను ఎంపిక చేయడాన్ని తమ పార్టీ స్వాగతించిందన్నారు. ఈ నెల 30వ తేదీన అర్ధరాత్రి పార్లమెంటులో జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు.